Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో పరుగులు తీస్తున్న తెలంగాణ రాష్ట్రం
- ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు
- పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పేదరిక నిర్మూలన కోసం కేసీఆర్ సర్కారు అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పేదలకు జీవో నెంబరు 58 ద్వారా క్రమబద్ధీకరించిన భూమి పట్టాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రభుత్వ భూముల్లో తెలిసీతెలియక ఇండ్లు నిర్మాణం చేసుకున్న పేదలకు జీవో నెంబరు 58 ద్వారా క్రమబద్ధీకరించి పట్టాలు అందించారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందని, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఇంకా దరఖాస్తులు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పించడం జరిగిందని, వారందరూ దరఖాస్తు చేసుకొని పట్టాలు పొందాలని సూచించారు. అదేవిధంగా అనర్హులు ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఈ పట్టాలు పొందితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి కీసర అర్డీవో రవి అధ్యక్షత వహించగా, మేడిపల్లి తహసీల్దారు మహిపాల్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, బీఅర్ఎస్ పార్టీ బోడుప్పల్ నగర అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, జంట కార్పొరేషన్లకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.