Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఉన్నతాధికా రులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, నిబంధనల ప్రకారం జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనీ, ఈ విషయమై ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. జిల్లా నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామనీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పకడ్భందీగా, ప్రశాంత వాతావ రణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలను పాటిస్తూ జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్తు, గాలి కోసం ఫ్యాన్లు, వెలుతురు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామనీ, ఆయా పరీక్ష కేంద్రాల్లో ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 220 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో మొత్తం 44, 014 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు జిల్లా అధికారులతో ఇప్పటికే ముందస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించామనీ, ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు పకడ్భందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ వీసీలో జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఏసీపీ నరేష్ రెడ్డి, డీటీవో నరసింహ, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.