Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 30 భవనాల నిర్మాణానికి కసరత్తు
- ఒక్కో భవనానికి రూ.12-15 లక్షల ఖర్చు
- దాతల సహకారంతో కొత్త హంగులు
- నగరంలో రెండు చోట్ల కొనసాగుతున్న పనులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గత పాలకుల వైఫ్యలంతో పసి పిల్లలు అక్షరాలు నేర్చుకునే కేంద్రాలైన అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక అద్దె ఇండ్లు, కమ్యూనిటీ హాల్లో నడిపించేవారు. దీంతో కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడేవారు. వీరి కష్టాలకు చెక్ పెట్టి.. ఐసీడీఎస్ సొంత భవనాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు దాతల సహకారాన్ని తీసుకుంటుంది. వివిధ కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులు, ఆయా సంస్థల యాజమా నులతో సంప్రదింపులు జరిపి జిల్లాలో 30 చోట్ల సొంత భవనాలు నిర్మించాలని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యచరణ సిద్దం చేసింది.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 917 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో కేవలం 17 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతుండగా.. 178 కమ్యూనిటీ హాళ్లు, 719 అంగన్వాడీ కేంద్రాలు అద్దె ఇండ్లలో కొనసాగుతున్నాయి. అయితే భవన నిర్మాణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు సొంత భవనాలు నిర్మించాలని ఐసీడీఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సయ్యద్‌నగర్, చార్మినార్ మండలంలోని అరుంధతీనగర్‌లో అంగ న్వాడీ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించగా.. సుమారు రూ.12-15లక్షల వ్యయంతో సరికొత్త హంగులతో మోడల్ అంగన్వాడీ నిర్మించనున్నారు. ఒక్కొ అంగన్వాడీ కేంద్రంలో హాల్, కిచెన్, స్టోర్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో పాటు పిల్లలకు ఆహ్లదకరంగా ఉండేలా గోడలకు రంగులు, జంతువుల బొమ్మలు, అక్షరమాలలు, ప్రత్యేక చిత్రాలు ఉండేలా తీర్చిదిద్దనున్నా రు. అంతేకాకుండా పిల్లలు అనువుగా కూర్చునేందుకు చైర్లు, ఆడుకునే ఆట వస్తువులు ఉండేలా ఏర్పాటు ్ల చేస్తున్నారు.
30 భవనాలకు స్థలాల గుర్తింపు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత అయిదేండ్లుగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణాలకు సముచిత బడ్జెట్ కేటాయించకపోవ డంతో సొంత భవనాలు లేక ఏండ్లుగా అద్దె ఇండ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. 917 కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు పక్కనపెడితే.. 790 భవనాలకు కిరాయిల రూపంలో ప్రతినెలా సుమారు రూ.18 లక్షల వరకు చెల్లిస్తుండడంతో నిర్వహణ భారం పెరుగు తోంది. మరోవైపు మహిళా శిశుసంక్షేమ శాఖకు జిల్లాలోని వివిధ మండలాలల్లో ఉన్న 30 స్థిర ఆస్తులు కబ్జాకు గురికాకుండా చూడడం పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం నగరంలో ఎక్కడా ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జాదారులు రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు ప్రత్యేక కృషితో ఆయా స్థలాల్లో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వాల సహకారం గురించి ఆలోచించకుండా దాతల సహకారంతో తొలి దశలో పదింటిలో నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. వీటిలో రెండింటికి ఇప్పటికే భవన నిర్మాణం కోసం భూమిపూజ కూడా చేయగా.. పనులు నడుస్తున్నాయి. మిగిలిన వాటి నిర్మాణ కోసం దాతలతో సంప్రదింపులు జరుపుతుండగా.. ముత్తుట్ ఫైనాన్స్ సంస్థ నాలుగు మోడల్ అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు ముందుకువచ్చింది. మరో నాలుగింటిని రోటరీ క్లబ్ నిర్మించేం దుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ఈ భవనాల నిర్మాణం కోసం ఆయా సంస్థలు రూ.15-20లక్షల నిధులు వెచ్చించేందుకు ముందుకొచ్చి నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొద్దినెలల క్రితం నాట్కో సంస్థ దాదాపు రూ.40లక్షలకుపైగా నిధులు ఖర్చు చేసి బోరబండలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీడీఎస్‌కు 30 స్థలాల్లో భవనాలు నిర్మించేందుకు సరిపడ బడ్జెట్ లేక.. మరోవైపు సొంత భవనాలు లేక.. అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
దశలవారీగా పూర్తి చేస్తాం : జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు
నగరవ్యాప్తంగా ఉన్న అయిదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో తమకు మొత్తం 30 స్థిర ఆస్తులు ఉన్నాయి. ఆయా స్థలాల్లో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశాం. ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారం తీసుకుం టున్నాం. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పనులు నడుస్తున్నాయి. దశలవారీగా మిగతా వాటిని పూర్తిచేస్తాం.