Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిన్న నకిలీ జనన, మరణ ద్రువపత్రాలు
- నేడు మార్కుల మెమో టాంపరింగ్
- పట్టించుకోని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం
- గాడి తప్పిన పరిపాలన కమిషనర్‌పై విమర్శలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పరిపాలన గాడి తప్పింది. నిఘా నిద్రపోతోంది. ఎక్కడ ఏం జరుగుతోందో పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పరిపాలన విభాగం, హెల్త్ విభాగం, శానిటేషన్ విభాగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కమిషనర్ పట్టించుకోవడంలేదని నగర ప్రజలు, యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అవినీతి ఆరోప ణలు, డబ్బులు తీసుకుని ప్రమోషన్లు ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్ల బాగోతం విషయంలో ఇంతవరకు చర్యలు తీసుకోవడంలేదని విమర్శలూ లేకపోలేదు.
31 వేల సర్టిఫికెట్లు రద్దు
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో జారీచేసిన సర్టిఫికెట్లు సరైనవని కావని బహిర్గతమవడంతో 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను రద్దు చేశారు. జనవరి 2020 నుంచి 2022 డిసెంబర్ మధ్య 31వేల సర్టిఫికెట్లను జారీచేశారు. వీటిలో సుమారు 27వేల సర్టిఫికెట్లు ఫేక్ ఉన్నాయని, మరో 4వేల సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారమే జారీచేసినట్టు అధికారులు గుర్తించారు. వీటిని రద్దు చేయడంతో నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు తీసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోలేదని విమర్శలొ స్తున్నాయి. అయితే నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీ, తర్వాత రద్దు అంశానికి పరిపాలన విభాగానికి లింకు ఉందని, పరిపాలన విభాగంలోని ఓ అధికారి అంతా నడిపిస్తున్నారని, అందుకే ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదని బల్దియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై ఏ మాత్రం నిఘాలేదనే విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
మెమో టాంపరింగ్
ఓ అమాయకురాలి డబ్బులు తీసుకోవడంతోపాటు ఆమె మార్కుల మెమోను టాంపరింగ్ చేసి తప్పుడు ఉద్యోగం ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవడంలేదంటే 'తిలపాపం తల పిడికెడు' అన్న చందంగా అందరికి ముడుపులు అందాయనే ప్రచారం జరుగుతోంది. 15 డిసెంబర్ 2021న అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చి నేటికి సదరు మహిళకు ఐడీ నెంబర్ ఇవ్వకపోగా సంబంధిత ఫైల్‌ను కనీసం రిజక్ట్ కూడ చేయలేదు. అసలు లేబర్ సెక్షన్ నుంచి జరగాల్పిన కారుణ్య నియామకం జనరల్ బ్రాంచ్ జరగడమేంటని పలువురు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఓ క్లర్క్ ఫైల్ పెడితే సూపరింటెండెంట్, ఏఎంసీ, పర్సనల్ ఆఫీసర్, జేసీ, అడిషనల్ కమిషనర్, కమిషనర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలోనే అన్ని సర్టిఫికెట్లను పరిశీలించడంతోపాటు అందరి సంతకాలతోనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాని మెమో టాంపరింగ్ కేసులో జేసీ సంతకం పెట్టకపోవడం అనుమానంగా ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడతున్నారు.
విజిలెన్స్ విచారణ ఏది?
మార్కుల మెమోను టాంపరింగ్ చేసి 15 డిసెంబర్ 2021న అపాయిట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఈఎన్సీ రిజక్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజిలెన్స్ విభాగం పంపించలేదు. దీంతోపాటు ఈ కారుణ్యనియామకంలో విషయంలో స్థానిక పోలీసులు జీహెచ్ఎంసీ పరిపాలన విభాగానికి వస్తే 'ఈ విషయం గురించి మీకు సంబంధంలేదు. మా దగ్గర విజిలెన్స్ విభాగం ఉంది. వాళ్లు చూసుకుంటారు' అని ఓ అధికారి, క్లర్క్ పోలీసులను వెనక్కి పంపించారు. ఇదిలా ఉండగా ఏదైనా ఫైల్ 4 రోజుల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉంటేనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ టాంపరింగ్ కేసు ఫైల్ రెండేండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నా సంబంధిత విభాగం క్లర్క్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీలో భాగమైన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి పంపించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి పంపిస్తే దొంగలెవరో బయటికొస్తా రని పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీలో వరుసగా జరుగుతున్న సంఘటనలపై ఏసీబీ అధికారులు సైతం నిఘా పెట్టినట్టు సమాచారం. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లలో అవకతవకలు, మెమో టాంపరింగ్ విష యంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు తమ దృష్టికి వచ్చిం దని, వీటిపై మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పురపా లక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌లకు ఫిర్యాదు చేయనున్నట్టు పలువురు యూనియన్ నేతలు చెబుతున్నారు.
సీఎంఓహెచ్ విచారణ ఎందుకు..?
ఈ ట్యాంపరింగ్ కేసులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను విచారణాధికారిగా నియమించినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీలో బర్త్ డెత్ సర్టిఫికెట్ల అవకతవకల అంశాన్ని విచారించడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇచ్చిన అధికారులు మార్కుల మెమో టాంపరింగ్ కేసును చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు అప్పగించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విచారణ బాధ్య తలు సీఎంఓహెచ్‌కు ఇస్తే మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకని, జీహెచ్ఎంసీలో సర్కార్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ భాగం కాదా? జీహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.