Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాహుల్ గాంధీ డిస్ క్వాలిఫికేషన్ మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలో భాగమే అని వక్తలు అన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లోని ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్లో ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఎస్.నాగేశ్వర రావు అధ్యక్షతన ఓయూ స్టూడెంట్ అండ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో బిగ్ డిస్కషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ చంద్రునాయక్, ప్రొ.అన్సారీ, ప్రొ.గాలి వినోద్ కుమార్ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. సూరత్ కోర్టు తీర్పు ప్రకారం రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలకు పరాకాష్ఠ అన్నారు. ఆర్ధిక నేరగాళ్లను కాపాడాటానికి దేశ ప్రజలను, వారి భావ ప్రకటన హక్కును కాలరాయడం అన్యాయమైన చర్య అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ఆర్థిక నేరగాళ్ల దోపిడీ గురించి ప్రశ్నించడం నేరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న పార్టీలను, సంస్థలను, ప్రతిపక్షాల ను ( ఏజెన్సీల సీబీఐ ,ఈడి ,లాంటి) సంస్థల చేత దాడులు చేపించడం అలవాటుగా మారిందన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా పారదర్శకతగా ఉండాలన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా గౌతం అదానీ అవినీతికి వ్యతిరేకంగా ప్రసంగించిన అంశాలను పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించడం కోసం ఏకంగా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధినీ డిస్ క్వాలిఫై చేయడం మోదీ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు అంతిమ రూపం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి యువతరం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం.ఎల్) ప్రజా పంథా పార్టీ హైదరబాద్ జిల్లా కార్యదర్శి ఎం.హాన్మేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిరుద్యగ జే.ఏ.సి నేత మానవతారారు, పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ అజరు, క్రాంతి, పి.డి.ఎస్.యూ ఓయూ అధ్యక్షులు ఎన్.సుమంత్, సెక్రెటరీ కె.స్వాతి, ఎస్.ఎఫ్.ఐ నేత శ్రీను, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నేత ఉదరు కుమార్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, ఎం.ఎస్.ఎఫ్ జాతీయ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.