Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై నిధులు ఇవ్వడంలో వివక్షత చూపినా తెలంగాణ మాత్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని స్వామి శంకర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీవాసులు, సంక్షేమ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం 8సంవత్స రాల్లో 14రంగాల్లో దేశంలో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింద న్నారు. ఎల్బీనగర్లో ఫ్లై ఓవర్లు, టిమ్స్ హాస్పిటల్, ఆక్సిజన్ పార్క్‌లు, తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా పార్కులు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం వలన తెలంగాణ మాత్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని, దేశం నుండి తెలంగాణకు మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్, మెట్రోకు నిధులు ఇవ్వడంలేదని కేంద్రంపై మండిపడ్డారు. ఆదానికి నరేంద్రమోదీ అండగా ఉండడం వలన 2020లో ప్రపంచంలో 609వ స్థానంలో ఉండగా 2022లో ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి ఎగబాకిన విషయం అందరికీి తెలిసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో స్కామ్‌లు జరిగితే జాయింట్ పార్లమెంట్ కమిటీ చేశారని, మోడీ హయాంలో అలాంటి కమిటీ ఆదానికి వ్యతిరేకంగా ఎందుకు వేయడంలేదని కేంద్ర ప్రభుత్వంని విమర్శించారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తారని, ఎన్నికలు ముగిసిన తరువాత మళ్ళీ గ్యాస్ ధరలు పెంచుతున్నది కేంద్రం అని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, ఆర్టికల్ 317 రద్దు విషయంలో కేంద్రంకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనైనా చేతులు కలుపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దాయనంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, గుడాల మల్లేష్, మహిళ అధ్యక్షురాలు అంజలి, భాస్కర్ సాగర్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
ఇంకా అభివృద్ధి కాలేదు : నియోజకవర్గ పరిధిలో పలు నూతన కాలనీలు ఏర్పడడం వలన తక్కువ మంది అట్టి కాలనీల్లో నివాసం ఉండడం వలన కొంతమేర డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సరఫరా లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, రోడ్లు సరిగా లేని విషయాన్ని ప్రజలు విస్మరిస్తారే తప్ప, కరోనా సమయంలో ప్రపంచం అతలాకుతలం అయిందనే విషయాన్ని మాత్రం ప్రజలు పట్టించుకోరని ఎమ్మెల్యే అన్నారు.
బీఆర్ఎస్లో ఫ్లెక్సీ గొడవ : హయత్‌నగర్ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. ఎమ్మెల్యే రాక కోసం సభలో స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, ప్రస్తుతం బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఫోటోను మాజీ కార్పొరేటర్ అనుచరులు ఫ్లెక్సీలో చిన్నగా పెట్టడంతో అధ్యక్షుడి అనుచరులు వెంటనే దానిని చించివేయగా, ఎమ్మెల్యే రాకముందే మరో నూతనంగా అన్ని కులాల నాయకులు వుండే విధంగా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అసలే గత ఏడాది నుంచి రెండు వర్గాలుగా ఉన్న బీఆర్ఎస్ ఆత్మీయ సభ సందర్భంగా కనిపించకుండా చేద్దామనుకున్నారు. కానీ కార్యకర్తల్లో మాత్రం తమ నాయకుడు ఫ్లెక్సీల్లో చిన్నగా కనిపించేసరికి తట్టుకోలేక అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ని చించివేశారు.