Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిషన్
నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వారాంతపు సెలవులను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.కిషన్ ఆధ్వర్యంలో శనివారం తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ సాబేర్ అలీకి రాగన్నగూడలోని మున్సిపల్ వార్డు కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ ఈఎస్ఐ, ఈపీఎఫ్లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని, ప్రతి నెలా 5వ తేదీ లోపు కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సబ్బులు, నూనెలు, బట్టలు మరియు చెప్పులు లాంటి రక్షణ పరికరాలను వెంటనే ఇవ్వాలని, అలాగే ఎండలు తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండలబారి నుండి వారిని రక్షించేందుకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జె.ఆశీర్వాదం ఎన్.యాదగిరి, తుర్కయంజాల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేతరి దాసు, యూనియన్ నాయకులు మేతరి నవీన్ కుమార్, చెక్క వెంకటేష్, కంప్యూటర్ ఆపరేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.