Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.13.11 కోట్ల పన్నులు వసూళ్లు
- రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లతో పోలిస్తే ప్రథమ స్థానంలో నిలిచిన పీర్జాదిగూడ
- 142 మున్సిపాల్టీలతో పోలిస్తే పదవ స్థానం
- అధికారులను, రెవెన్యూ సిబ్బందిని అభినందించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
2022-23 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. మొత్తం డిమాండ్‌లో 92.65శాతం పన్నులను రాబట్టి రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో అగ్రస్థానంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నిలిచిందని అధికారులు తెలిపారు. అలాగే 142 మున్సిపాలిటీలతో పోలిస్తే పీర్జాదిగూడ రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచిందని తెలిపారు. 2023 మార్చి 31వ తేదీతో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే పన్నుల వసూళ్లపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ట్యాక్స్ డిమాండ్ రూ.14.49 కోట్లు కాగా, ఇందులో రూ.13.11కోట్ల పన్నులను (92.65శాతం) రాబట్టినట్లు తెలిపారు. మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సహచర కార్పొరేటర్లతో కలిసి కాలనీల్లో, బస్తీల్లో పర్యటించి ప్రతి ఒక్కరూ ఆస్తి పన్ను చెల్లించాలని అభ్యర్థించడంతోపాటు జనవరి నుంచి బిల్ కలెక్టర్లకు డైలీ టార్గెట్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పన్ను వసూళ్లలో మంచి ఫలితాలను రాబట్టామని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భువన్ సర్వేతో మేలు
కిందటేడాది కేవలం రూ.9.31కోట్ల డిమాండ్ మాత్రమే ఉండగా, ఈ దఫా ఏకంగా రూ.14.49 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రత్యేక చొరవ తీసుకుని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భువన్ సర్వేను 100 శాతం అమలు చేశారు. భువన్ సర్వే ప్రకారం ప్రజల ఆస్తుల వాస్తవ కొలతల ప్రకారం డిమాండ్ నోటీసులను జారీ చేశామని అధికారులు తెలిపారు. దీంతో ప్రజల ఆస్తికి తగినంత వాస్తవ పన్ను వసూలు చేయడంతో కిందటేడాదితో పోలిస్తే రూ.5.18కోట్ల రెవెన్యూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కు పెరిగిందని అధికారులు తెలిపారు. మిగిలిన పన్నులను కూడా వారం వ్యవధిలో 100 శాతం వసూలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ డా.రామకృష్ణ రావు తెలిపారు.
పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు
సకాలంలో పన్నులు చెల్లించి పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిపిన పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మున్ముందు కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్న ప్రజలు చెల్లించిన పన్నులతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను అభివృద్ధిలోను అగ్రస్థానంలో నిలుపుతాం. అహర్నిశలు శ్రమించి పన్నులను వసూలు చేసిన కార్పోరేషన్ అధికారులను, రెవెన్యూ సిబ్బందికి, బిల్ కలెక్టర్లకు అభినందనలు.
జక్క వెంకట్ రెడ్డి, మేయర్,
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్