Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-బేగంపేట్
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా పర్యవేక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాల యంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల ఆధ్వర్యంలో జరుగు తున్న అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వాటర్ వర్క్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, టీఎస్ఎస్ పీడీసీఎల్ రఘుమారెడ్డి, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియా ఉద్దిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో అనేక ప్రధాన, అంతర్గాట్ రోడ్లను అభివృద్ధి చేసి వాహనదారుల ఇబ్బందులను తొలగించడం జరిగిందని తెలిపారు. సనత్ నగర్‌లోని ఇండిస్టియల్ ప్రాంతం నుండి బాల నగర్ చౌరస్తా వరకు అండర్ పాస్ నిర్మాణం, ఫతే నగర్ ప్లై ఓవర్ విస్తరణ పనుల కోసం హెచ్ఎండీఏ నుంచి రూ.100 కోట్లను మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ పనులను చేపట్టడానికి స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫతే నగర్ ఫ్లై ఓవర్ విస్తరణ, కింద స్థల సేకరణ చేపట్టి రోడ్డు విస్తరణ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య భారీగా తగ్గుతుందని వివరించారు. అదేవిధంగా రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి విస్తరణ పనులను కూడా త్వరితగతిన చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ పాన్ బజార్లో మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు.
సనత్ నగర్ లోని కేఎల్ఎన్ పార్క్ అభివద్ధి పనుల కోసం రూ. 2.41 కోట్లు మంజూరైనాయని, పార్క్ లోని లేక్‌ను అభివద్ధి చేయడం, మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు వంటి పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవన్నీ చేపట్టేందుకు అదనంగా మరో 2.50 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, సీఎస్ఆర్ నిధులతో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి ఆదేశించారు. బీకే గూడ పార్క్ కు వచ్చే వారికోసం టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శిధిలావస్థకు చేరుకున్న బీకే గూడ వార్డ్ ఆఫీస్ స్థానంలో నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు జరిపే సమయంలో డ్రయినేజీ, వాటర్ పైప్ లైన్ లు ద్వంసం కాకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులు చేపట్టాలన్నారు. బేగంపేట, పికెట్ నాలా అభివృద్ధి పనులను వర్షాకాలం లోగా పూర్తి చేయాలన్నారు. బోర్ వెల్స్ మరమ్మతులు వచ్చినప్పుడు సకాలంలో చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయన్నారు. అల్లా ఉద్దిన్ కోటిలో ప్రమాదకరంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ లైన్‌ను తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనేక చోట్ల విద్యుత్ వైర్లు ప్రమాదక రంగా ఉన్నాయని, వాటిని తొలగించి బంచ్ కేబుల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలకు బిల్లులు చెల్లించాలనే కారణంతో విద్యుత్ సరఫరా నిలిపివేయవద్దని స్పష్టం చేశారు. అమీర్ పేటలోని డీకే రోడ్డులో గల స్విమ్మింగ్ పూల్, సికింద్రాబాద్ లోని గురుమూర్తి స్విమ్మింగ్ పూల్‌లను అవసరమైన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశిం చారు. ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్‌ను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందిం చాలని అధికారులను ఆదేశించారు. వారం రోజులలో ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్‌ను సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ లు రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, డీసీలు మోహన్ రెడ్డి, ముకుంద రెడ్డి, ఈఈలు ఇందిర, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎంలు హరి శంకర్, రమణారెడ్డి, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.