Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
- 13 వరకు పరీక్షల నిర్వహణ
- రెండు జిల్లాలో 564 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- హాజరు కానున్న 1,16,154 విద్యార్థులు
- గంట ముందుగానే సెంటర్లోకి అనుమతి
నవతెలంగాణ-సిటీబ్యూరో/మేడ్చల్ కలెక్టరేట్
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో నేటి నుంచి మొదలుకానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికా కుండా పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని కోరారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభమై.. 13వ తేదీన ముగియ నున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో దాదాపు 564 కేంద్రాల ద్వారా 1,16,154 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమై.. మధ్యాహ్నాం 12.30 గంటలకు ముగుస్తాయి. పరీక్ష గదుల్లో విద్యుత్, నీటి సౌకర్యం, రవాణా, వైద్య సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిం చారు. హైదరాబాద్, మేడ్చల్ డీఈవోలు ఆర్.రోహిణీ. విజయ కుమారి ఆధ్వర్యంలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకు న్నామని తెలిపారు. ఇక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రానికి ఒకరి చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కేటాయించారు. కస్టోడియన్, జాయింట్ కస్టోడియన్లతో పాటు 3వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనుండగా.. మేడ్చల్ పరిధిలో 4వేలకుపైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అలాగే సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్క్లను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్షలు జరగనున్న 564 కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును నియమించి..144 సెక్షన్ పక్కాగా అమలు చేయను న్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు తెరవ కుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు సీఎస్‌లు, డీఎస్‌లు మినహా ఇతర సిబ్బంది, ఇన్విజిలేటర్లు సైతం సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం..
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్, ఫ్రీ బస్‌పాస్ చూపిస్తే ఆర్టీసీ బస్సులు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, పరీక్ష ముగి సిన తర్వాత ఇంటికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని సికిం ద్రాబాద్ రీజినల్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆయా పరీక్ష కేంద్రాలకు బస్ సర్వీస్‌లు నడుపు తున్నామని, మొత్తం 11 డిపోల నుంచి 218 పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల సౌకర్యార్థం బస్ సర్వీస్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇదిలావుంటే ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా హాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కాగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందితో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఆర్ఎస్ ప్యాకెట్లతో సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బం దులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఆయా మండల విద్యాధికారులకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకుంటారని, అందరూ సహకరించి పరీక్షలను విజయ వంతం చేయాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల డీఈవోలు కోరారు.
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
జిల్లావ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండదు. 9.35 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటర్లోకి అనుమతి ఉండదు. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించం. విద్యార్థులు మాస్‌కాపింగ్‌కు పాల్పడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
- ఆర్.రోహిణి, డీఈవో, హైదరాబాద్
ఎవరైనా పరీక్షల్లో పాస్ చేయిస్తామంటే నమ్మొద్దు
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి. ఇందుకు తల్లదండ్రులు కూడా పిల్లలకు సహకరించాలి. విద్యార్థులు పరీక్షా సమయానికంటే గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షల్లో పాస్ చేయిస్తామని ఎవరైనా మాయ మాటలు చెబితే నమ్మవద్దు. కాపీ కొట్టే వారిపై కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి సందేహాలు గానీ సమస్యలు గానీ ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్: 040- 35659758 కు సంప్రదించవచ్చు
- విజయ కుమారి, డీఈవో, మేడ్చల్ మల్కాజిగిరి