Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హాస్టళ్లకు సొంతభవనాలు నిర్మించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కష్ణయ్య
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ హాస్టళ్లకు మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయా లని, బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి వారు హాజరై మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు 100 శాతం నుంచి 200 శాతానికి పెరిగాయని, ఇంత పెరిగినా మెస్ చార్జీలు కేవలం 25 శాతం పెంచి అది కూడా విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే 100 శాతం మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మొత్తం బీసీ కాలేజీ హాస్టళ్లు అద్దె భవనాల్లో ఉన్నాయని, 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదన్నారు. హాస్టల్ కరెంట్ బిల్లులు గత పది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, పరీక్ష సమయంలో హాస్టళ్లకు కరెంటు కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1500 నుండి రూ.3000 వరకు అలాగే పాఠశాల హాస్టల్ గురు కుల విద్యార్థుల ఆహార చార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ. 1100 నుంచి రూ. 2500కు, మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రూ. 950 నుంచి రూ. 2000 పెంచాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ లను ఇంటర్ డిగ్రీ కోర్సులకు రూ. 5500, ఇంజనీరింగ్ ఇతర విద్య కోర్సులకు రూ. 6500 ఇస్తున్నారన్నారు. వీటిని పదివేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని లేనిపక్షంలో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, నిరంజన్, నిఖిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.