Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
అదానీకి సేల్స్ మ్యాన్‌గా మోడీ మారారని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీవాసుల సంక్షేమ సంఘాలతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన వారి నల్ల ధనం వెలికి తెస్తామని, మన దేశంలో అప్పులు చేసి విదేశాలకు 22మంది పారిపోయిన వారు ఉండగా అందులో 21మంది గుజరాతీయులేనని గుర్తు చేశారు. మన దేశంలో కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగులో ఉన్నాయని, కానీ రాహుల్ గాంధీ విషయంలో మాత్రం వెంటనే తీర్పు రావడం, శిక్ష అమలు చేయడం, అనర్హత వేటు వేయడం, ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయించడం అంత త్వరగా ఎలా సాధ్యం అని ధ్వజమెత్తారు. అధికారం కోసం బీజేపీ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తుందని మండి పడ్డారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బొగ్గారపు దాయనంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, మహిళ అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి వెంకట్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, జగదీష్ పాల్గొన్నారు.
కార్పొరేటర్ కొప్పులపై పరోక్ష విమర్శలు చేసిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నేతలు ప్రజలతో మమేకం అయి వారి కోసం పనిచేస్తున్నారని, కానీ స్థానిక కార్పొరేటర్ బహుళ అంతస్తుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని, మేము నిరంతరం ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశం అయి పనులు చేస్తుంటే, దానికి మరుసటి రోజు అధికారుల వద్దకు వెళ్లి ఒక దరఖాస్తు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇస్తూ మేము చేశాము అని సోషల్ మీడియాలో పెట్టుకోవడం బీజేపీ దొంగలకు సాధ్యం అని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ పుట్టుక తోనే శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నామని, ఇప్పుడు బీజేపీ నేతలు చెబితేనే హిందూయిజం తెలుస్తుందా అని అన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేదని, ఒక్క రూపాయి నిధులు విడుదల చేయించలేదని, అటువంటి వారికి తెలంగాణ ప్రజలపై ముడి చమురు ధరలు పెంచే హక్కు లేదని స్పష్టం చేశారు.