Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్టీ జాబితాలో ఏ ఇతర కులాలను చేర్చవద్దని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్టీ జాబితాలో ఇతర కులాలను కలపద్దని కోరుతూ మంగళవారం మల్లాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. అనంతరం సంఘం చైర్మెన్ ఈ.ఆంజనేయులు, జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.రమణ, హరి రామ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎస్టీలు విద్యా ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో ఇతర కులాలను కలపాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా జాతీయ ఎస్టీ కమిషన్, సెంట్రల్ రిజిస్టర్ జనరల్, గిరిజన కేంద్ర మంత్రిత్వ శాఖ, సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇతర కులాలను ఆమోదించకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శేషాద్రి, నాగార్జున, యామిని కుమార్, డాక్టర్ బాలాజీ నాయక్, అయ్యా నాయక్, వెంకటరమణ, బ్రహ్మయ్య, లాల్య నాయక్, ప్రసన్నకుమార్, శ్రీమన్నారాయణ, తౌడన్న, తిరుపతిరావు, సత్యనారాయణ, సత్యారావు, మద్దిలేటి వెంకటేశ్వర్లు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.