Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
తెలంగాణలో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి హిందీ పరీక్ష ప్రారంభమైన తర్వాత గంటన్నరకు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేసిన నిందితుడు బీజేపీ అధ్యక్షుడి సన్నిహితుడని తెలిపారు. రాష్ట్రాన్ని అస్థిరపరచే కుట్రలో భాగంగా బీజేపీ రాక్షస క్రీడని మొదలు పెట్టిందన్నారు. అందులో భాగమే మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, నిన్న విద్యార్థుల క్వశ్చన్ పేపర్ లీక్ అని అన్నారు. రైతులను ఆగం చేద్దామనుకున్నారు కుదరలేదు.. ఉద్యోగులను ఆగం చేద్దామను కున్నారు కుదరలేదు.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆగం చేద్దామను కున్నారు కుదరలేదు.. ఎమ్మెల్యేలను కొందామను కున్నారు కుదరలేదు.. కేసులు పెట్టి లొంగ తీసుకుందామ నుకున్నారు కుదర లేదు.. ఆఖరికి విద్యార్థులను నిరుద్యోగులను పేపర్ లీకేజీలతో వారి జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు ఓట్ల కోసం రెండు సీట్ల కోసం ఇదంతా చేయడం బీజేపీ నిరంకుశత్వానికి పరాకాష్ట అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కూడా బండి సంజరు హస్తం ఉందని ఆరోపించారు. పేపర్ లీకులలో బయటపడిన వారంతా బీజేపీ కార్యకర్తలు అవ్వ డం చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కమలం పార్టీ నేతలు కుట్రలు పన్నారని అన్నారు.
గుజరాత్లో ఇప్పటివరకు 13 సార్లు పేపర్ లీకులు జరిగా యని.. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక పరీక్ష పేపర్లో కూడా లీక్ అవుతూనే ఉన్నాయన్నారు. అలాగే అస్సాంలో 2020లో ఎస్సై పరీక్ష పత్రం లీక్ అయిందని.. కర్ణా టకలో యాడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా అసిస్టెంట్ ఉద్యోగా లతో సహా అనేక పేపర్లు లీక్ అయ్యాయన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు చేసిందని ఆరోపించిన బీజేపీ.. నేడు ఆ పార్టీ అనేక స్కాములతో పాటు పేపర్ లీకేజీ వ్యవహారంలో పూర్తిగా కాంగ్రెస్ ను మించిపోయింది అన్నారు .కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ మాయలో పడి వారికోసం పనిచేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.