Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో స్థానికులు, వాహనదారులు
నవతెలంగాణ-సంతోష్ నగర్
వర్షాలు లేకున్నా డ్రయినేజీ మ్యాన్ హౌళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐ ఎస్ సదన్ డివిజన్ ధోబి ఘట్ పెట్రోల్ బంక్ తుల్జా భవాని వైన్స్ వద్ద, చంపాపేట్ డివిజన్ పరిధిలోని కాలనీలో, సంతోష్ నగర్ డివిజన్ పరిధిలోని భాష్యం హై స్కూల్ వద్ద, శ్రీశైలం రహదారిలో చెరువును తలపించేలా మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఆ దారి గుండా ప్రతినిత్యం చిన్నా, చితక, భారీ వాహనాలు సైతం వందల సంఖ్యలో తిరుగుతుంటాయి. కాగా మురికినీటి కంపు, దుర్వాసన వెదజల్లు తోంది. దీంతో వాహనదారులు, పరిసరాల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రతీ 15 రోజులకోసారి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా శాశ్వత పరిష్కారం చూపకుండా కంటి తుడుపు చర్యగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న డ్రయినేజీ నీరు దిగువకు వెళ్లేందుకు సరిపడా డ్రయినేజీ పైపులైన్ లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని స్థానికులు అంటున్నారు. భాష్యం హై స్కూల్ పరిధిలోని ఎలక్ట్రికల్ పైపు నూతనంగా నిర్మించడం.. ఎక్కడ పడితే అక్కడ డ్రయినేజీ పైపులను డామేజ్ చేయడం వల్ల ఇలా జరుగుతుందని పలువురు చెబుతున్నారు. మరమ్మత్తు చేయకుండా రోడ్డు నిండా దుర్గంధంతో వ్యాపారస్తులు విద్యార్థులు వాణిజ్య సంస్థల వారు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నా ఎందుకు శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం చూపి, డ్రయినేజీ సమస్యను పరిష్కరించాలని ఆయా కాలనీలవాసులు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను కోరుతున్నారు.