Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-కాప్రా
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావుఫూలే ఆశయ సాధన కోసం ఏప్రిల్ 15 నుంచి జరిగే ఫూలే, అంబేడ్కర్ జన జాతరలను జయప్రదం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఈసీఐఎల్‌లోని సీఐటీ యూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా ఫూలే చిత్రపటానికి సంఘం జిల్లా నాయకులు, నిర్మాణ బాధ్యులు చింతల యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఫూలే, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫూలే అంబేద్కర్ జన జాతరలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ దేశంలో కుల వ్యవస్థకు, కుల అసమానతలు, కుల వివక్షకు, అంటరా నితనానికి ప్రధాన కారణం మనుధర్మశాస్త్రమన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని మట్టుబెట్టాలని బాహటంగా ప్రకటించి, ధైర్యంగా పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. నేడు ఆధునిక భారతదేశంలో మతోన్మాదులు, కార్పొరేట్ శక్తులు కలిసిపోయి దేశ సౌర్వభౌమాధికారాలను, రాజ్యాంగ హక్కులను కాల రాస్తు న్నారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుయుక్తులు పన్నుతున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు పోరాటాలు చేయడమే పూలే అంబేద్కర్‌లకు మనమిచ్చే నివాళి అన్నారు. ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం కపసాగర్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఎన్ బాల పీరు, జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి లక్ష్మణ్, జిల్లా నాయకులు బాలయ్య మోహన్, నర్సింహ్మ, సత్యనా రాయణ, మహేశ్వరి, రాకేష్, రాము పాల్గొన్నారు.