Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌం మంత్రి మహమూద్ అలీ
- హైదరాబాద్ వార్షిక సైబర్ సెక్యూరిటీ సమ్మిట్- 2023 అవగాహన సదస్సు
- మా షూటింగ్ సెట్లో ఓ వ్యక్తికి కూడా సైబర్ కాల్ వచ్చింది : సినీ దర్శకుడు రాజమౌళి
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌గా నిలిచారని హౌం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. తెలంగాణలో పోలీసుల పనితీరు బాగుందన్నారు. గురువారం హైదరాబాద్ సిటీ సెక్యురిటీ కౌన్సిల్(హెచ్సీఎస్సీ), హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 'హైదరాబాద్ వార్షిక సైబర్ సెక్యూరిటీ సమిట్- 2023 పేరుతో అవగాహన సదస్సును నిర్వహించారు. బంజారా హిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హౌం మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రోజురోజుకు హ్యాకింగ్, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫిషింగ్ మెయిల్స్, లింక్స్‌తో నేరాలు పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. స్కూల్స్, ఐటీ కంపనీలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు సైబర్ సేఫ్టీ పాటించాలన్నారు. సైబర్‌నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండా లన్నారు. ఐటీ, ఇతర కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్ లా అండ్ ఆర్డర్‌ను బాగా కంట్రోల్ చేస్తున్నారని ప్రశంసించారు.
విశిష్ట అతిగా పాల్గొన్న ప్రముఖ సినీ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన అవసర మన్నారు. 80 శాతం నేరాలు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తు చేశారు. బడా రాజకీయ నాయకుల నుంచి స్టార్ సెలబ్రిటీలు, సాధారణ కూలీల వరకు ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులే అని తెలిపారు. తమ షూటింగ్ సెట్ వర్క్‌లో ఉన్న ఓ వ్యక్తికి సైతం సైబర్ కాల్ వచ్చిందని, బ్యాంక్ మేనేజర్ అని మాట్లాడుతున్నామని చెప్పడంతో ఓటీపీ చెప్పాడ న్నారు. దాంతో అతని 10 నెలల వేతనం అతని బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరస్తులు కోట్టేశారన్నారు. డబ్బుపై దురాశతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని తెలిపారు. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరన్నారు. ఈజీగా వచ్చే డబ్బు మోసానికి దారితీస్తుందన్నారు. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కష్టం అంటే ఎంటో నేర్పించాలన్నారు. సైబర్ నేరాలపై తెలుగులో ప్రజలకు అవగాహన కలిగేలా విస్తత ప్రచారం చేయాలన్నారు. వంద పెడితే.. వెయ్యి, వెయ్యి పెడితే లక్ష, లక్ష పెడితే పది లక్షలు వస్తాయని అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవడం మన అవి వేకం అవుతుందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల న్నారు. బ్యాంక్ అధికారులు ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీల విషయం అడగరని చెప్పారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా 1930 ఆన్లైన్ నెంబర్లో డయాల్ చేయాలని కోరారు. రోజురోజుకు అనేక రకాలుగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని హైదరాబాద్ సీపీ, సమ్మిట్ చైర్మెన్ సీవీ ఆనంద్ తెలిపారు. లోన్‌ఫ్రాడ్, ఇన్‌స్ట్రాగ్రామ్, మార్ఫింగ్, ఇన్వెస్ట్మెంట్, కేవైసీ తదితర పేర్లతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారన్నారు. సైబర్ నేరాలకు కట్టడి చేయడం, దర్యాప్తు వేగవంతగా పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమ్మిట్ నిర్వహించామన్నారు. రియల్ఎస్టేట్, ఐటీ, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రయివేట్తోపాటు ఇతర సంస్థలలో సైబర్ నేరాలపై అవగాహన తీసుకుని రావడం తోపాటు కట్టడి చేసేవిధంగా తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రా యాలను తీసుకుంటు న్నామన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఐటీ నిపుణులు, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.