Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
- వర్షాకాల సన్నదతపై మంత్రి సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
రానున్న వర్షకాలంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్థితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కే.టీ. రామారావు జీహెచ్ఎంసీ అధికారులను అదేశించారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి జీహెచ్ఎంసీ వర్షకాల సంసిద్దతపైన నగర ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద నివారణ కార్యక్రమంపై మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశం సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రజాప్రతి నిధులకు మంత్రి కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన అన్ని పనులు జూన్ 1వ తేదీ నాటికి పూర్తి కావాలన్నారు. నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడిక తీతను తొలగించాలని అధికారులను అదేశించారు. ఇప్పటికే ఈ నాలా అడ్డంకులను తొలగిం చేందుకు, ఎస్.ఎన్.డీ.పీి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిధులను సైతం కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఎన్.డీ.పీ కార్యక్రమంలో దాదాపుగా పూర్తయిన ప్రధానమైన నాలాల నిర్మాణ, బలోపేతం చేసే పనులను చర్చించారు. ఈ సందర్భంగా ప్రతీ ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎస్.ఎన్.డీ.పీ పనుల పురోగతిపైన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళిక అంశాన్ని కూడా విస్తతంగా సమీక్షించారు. వర్షకాలంలో కీలకమైన వాటర్ లాంగింగ్( నీళ్లు నిల్వడం) పాయింట్లు, రోడ్ల నిర్వహాణపైన ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. నగరంలో ఉన్న పాత భవనాల గుర్తింపు అత్యంత కీలకమని ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, నగర మేయర్, కమిషనర్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.