Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
స్వతంత్ర భారత దేశ పాలనా వ్యవస్థకు ప్రాణం పోసిన దార్శనికుడు డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కరే అని ఉస్మానియా విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య పార్థ సారధి అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల పరిపాలన, రాజనీతి శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వ ర్యంలో జరిగిన మహనీయుల జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే, అంబేద్కర్ జీవితాల్లోని విలువలను విద్యార్థు లు ఆదర్శంగా గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. బహుభాషల్లో పండితుడైన అంబేద్కర్ అపారమైన తన మేధస్సుతో సమాజానికి ప్రామాణికమైన తాత్త్విక భూమి కను అందించాడన్నారు. సమాజాభివృద్ధి మహిళాభివృద్ధి పరస్పర సంబంధం కలవి అని ఫూలే, అంబెడ్కర్ ఇద్దరూ నమ్మి ఆచారించారన్నారు. మహిళలకు అన్ని రకాల హక్కు లు కల్పించే హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో వీగిపోయినందుకు నిరసనగా రాజీనామా చేసి ఆ దిశగా సమాజంలో పోరాటం చేశారన్నారు. ప్రణాళికా సంఘం, రిజర్వ్ బాంక్, యూనియన్ సర్వీస్ కమిషన్ వంటి అత్యు న్నత జాతీయ సంస్థలతోపాటు జలవిద్యుత్ రంగం కూడా అంబేద్కర్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందన్నారు. రాజ్యాంగ రచనా సంఘంలో నిజానికి ఏడుగురు సభ్యులున్నప్పటికీ, అనేక కారణాల వల్ల ఆరుగురు సభ్యులు ఆ రచనలో పాలుపంచుకోకపోయినా, 60 దేశాల రాజ్యాంగాలను క్షుణంగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మేధావి అని స్వయంగా సంఘ సభ్యుడు టి.టి.కృష్ణమాచార్యులు పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆర్థిక సమానత్వం, సాంఘిక ప్రజాస్వామ్యం, నైతిక ప్రబోధక బౌద్దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ప్రత్యేక ఆహ్వానితు లుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి మాట్లాడుతూ ఫూలే, అంబేద్కర్ జీవితాలు యువతకు స్ఫూర్తిదాయకాలన్నారు. సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రలలో ప్రేరణాత్మక విశేషాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. డాక్టర్.శంకర్ కుమార్ సమన్వయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్.యాదయ్య, డాక్టర్.రత్న ప్రభాకర్, డాక్టర్.భాస్కర్ పాల్గొన్నారు.