Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని గిరిజన మినీ గురుకుల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నిర్మల ఆధ్వర్యంలో 29మంది మహిళలు మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం గేటు వద్ద నినాదాలు చేశారు. వీరిని బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మినీ గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనీసా వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 29 గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో.. మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ పని చేస్తున్నారని తెలిపారు. పేద గిరిజన విద్యార్థులకు విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు నెలకు రూ.15వేలు, పెట్లకు 11వేలు, అకౌంటెంట్‌కి రూ.10వేలు, వర్కర్లకు రూ.7500 చొప్పున ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. కానీ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. 5 సంవత్సరాల నుంచి ఇతర డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్స్ ఉద్యోగులకు లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు అమలు అవుతున్నాయన్నారు. మినీ గురుకులం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే కనీస వేతనాల జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, ఇది అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచి అమలు చేయాలని, ధరల పెరుగుదల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. అలాగే, పర్మినెంట్ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్‌కార్డు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రజిని, సుశీల, శ్రీలత, వనిత, మంకు బాయ్, గిరిజ బారు తదితరులు పాల్గొన్నారు.