Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులు లేని చోటల్లో హాస్టల్స్‌ను మూసివేయాలనడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగునా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల ప్రేమను చాటు కున్నారని తెలిపారు. కానీ అంబేద్కర్ వారసుల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూసివేయాలని ఆదేశించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. విద్యార్థులు లేని చోట్ల హాస్టల్స్ మూసి వేయడం మానుకుని పేద పిల్లలను చేర్చి చదివిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సూచి ంచారు. తొమ్మిది నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లకు మెస్‌చార్జీలు చెల్లించకపోవడంతో హాస్టల్ విద్యార్థులు అర్ధాకలతో నకనకలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మేస్ చార్జీలను విడుదల చేయాలని కోరారు. హాస్టళ్లకు కరెంటు బిల్లులు పది నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయనీ, పరీక్షల సమయంలో కరెంట్ కట్ చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారు, పరీక్షలు ఎలా రాస్తారు అనీ, దీని ప్రభావం విద్యార్థుల పరీక్షల ఫలితాలపై పడుతుందన్నారు. రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టల్స్, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవనీ, వెంటనే సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్‌కు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి మ్యాగ జైన్, వార్తా పత్రికలు మంజూరు చేయడానికి ప్రతినెలా రూ.2వేలు ఇవ్వాలన్నారు. అంబేద్కర్ వారసుల హాస్టల్స్ జోలికొస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేసీ చైర్మన్ నీలా వెంకటేష్, భూపేష్ సాగర్, సుధాకర్, అనంతయ్య, రాజేందర్, గుజ్జ కృష్ణ యాదవ్, వెంకట్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.