Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దళితులను కించపరుస్తూ హేళనగా మాట్లాడిన బిషప్ కె. పద్మారావుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా), తెలంగాణ మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల మార్చి 5 ఆదివారం రామ్ కోఠి లోని సిఎస్ఐ చర్చిలో మెదక్ డయోసీస్ బిషప్ కె. పద్మారావు ప్రసంగిస్తూ ''మాల మాదిగలకు ఉన్న ఎచ్చులు ఏంటో తెలుసా? మానెడు గింజలు ఉంటే మంచం ఎక్కి కూర్చుంటారు కిందకు రానే రారు. అవి అయిపోగానే దిగి వస్తారు దండం పెడుతూ'' అని అన్నారు. అలా మాల మాదిగలను చులకనగా, హేళన చేసి మాట్లాడారని, తక్షణమే మెదక్ బిషప్ కె. పద్మారావుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, అంసా రాష్ట్ర కోఆర్డినేటర్ డా.గాజుల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంసా నాయకులు రాహుల్ మద్నురే, పొనకంటి రవీందర్, తెలంగాణ మాల మహానాడు నాయకులు గాజుల నాగరాజు, ముండ్లగిరి లక్ష్మీనారాయణ, పెరుమాండ్ల జయప్రకాష్, నూకతొట్టి నవీన్ పాల్గొన్నారు.