Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగోల్లో తీవ్ర దోమల బెడద
- కాపాడాలని వేడుకుంటున్న డివిజన్ ప్రజలు
నవతెలంగాణ-నాగోల్
హైదరాబాద్లోని నాగోల్ డివిజన్లో సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే దోమలు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాంతో దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నాగోల్ డివిజన్లోని మూసీ నదీ పరిసర ప్రాంత కాలనీలవాసులు వాపోతున్నారు. మూసీ నదికి పరిసరాలలో న్యూ నాగోల్, మమతా నగర్, బీకే రెడ్డి నగర్, నాగోల్ గ్రామం ,వెంకటరెడ్డి నగర్, రాజ్యలక్ష్మి నగర్లతో పాటు పలు కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో సాయంకాలం కాగానే తేనెటీగలను మరిపించేలా గుంపులు, గుంపులుగా దోమలు సంచరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయా కాలనీలో ప్రజలు పేర్కొంటున్నారు. ఒకవైపు మూసి, మరోవైపు నాగోలు చెరువు ,ఉండడంతో వాటికి తోడు కాలనీలోని కొంతమంది ఇండ్లలోని చెత్త, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడే రోడ్లపై వేయడంతో విపరీతమైన దోమలు పుట్టుకొస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దోమల నివారణకు పలు చర్యలలో భాగంగా మందులను పిచికారి చేసినా లాభం లేకపోయిందని, దీంతో చీమల పుట్టల్లా పుట్టుకొస్తున్న దోమల వల్ల తాము పలు రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే ఇక రాత్రంతా జాగరణనే అని, ఒకవైపు ఊడకపోత, మరోవైపు దోమల బెడద ను తట్టుకోలేక పోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు దోమలపై ప్రత్యేక దష్టిని సారించి దోమల బెడద ను నివారించి తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.