Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టసభల్లోకి కమ్యూనిస్టులు ప్రవేశించేందుకు కృషి
- పొత్తుల రూపంలో త్యాగాలకు సిద్ధంగా లేం
- ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-బోడుప్పల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దేశానికి పెనుప్రమాదం పొంచి ఉందని, అందుకే బీజేపీని తరమికొట్టి దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ చేపట్టిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో భాగంగా సోమవారం మేడ్చల్ జిల్లా పరిదిలోని బోడుప్పల్ కార్పొరేషన్లో నిర్వహించిన పాదయాత్రలో సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజల సంపదను, దేశ సంపదను కొల్లగొడుతూ అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లా డుతూ ప్రజల మధ్య చీలికలు తెచ్చేలా కుట్రలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్ర హోం మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రాజెక్టులు ఇచ్చి రాష్టాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టకుండా తాము అధికా రంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామనడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు మతం ఆధారంగా కాకుండా వారి సామాజిక పరిస్థితుల అధారంగా అప్పటి రాజశేఖరరెడ్డి సర్కారు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దమ్ముంటే బీసీ జన గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచా లని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎస్టీల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన ఏజెండా
దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని గద్దె దించడానికి లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పనిచేస్తామని కూనంనేని స్పష్టం చేశారు. ప్రమాదకరమైన బీజేపీని ఎదుర్కోవడం తమ ప్రధాన కర్తవ్యం అని, అదే సందర్భంలో పొత్తుల రూపంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేమన్నారు. కమ్యూనిస్టులుగా చట్ట సభల్లోకి ప్రవేశించడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పుడే రాజకీయ పొత్తుల గురించి ఆలోచించడం లేదని, భవిష్యత్తులో పరస్పర సహకారం అందించే పార్టీలతో కలిసి వెళ్లే విషయాల గురించి మాట్లాడుతామని అన్నారు. మేడిపల్లి సీపీఐ మండల కార్యదర్శి అర్.కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పద్మ, బాలమల్లేష్, జిల్లా కార్యదర్శి డిజి.సాయి లుగౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సీపీఐ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి శ్రీమాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.