Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సభ (ప్లీనరీ సమావేశం) నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సభలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం 12 తీర్మాణాలను ప్రవేశపెట్టగా.. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, నాయకులు బలపర్చారు. అనంతరం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే బీఆర్ఎస్కు ఊపిరి అనీ, వారు లేకపోతే పార్టీ లేదన్నారు. సేవా భావం, క్రమశిక్షణ, క్రియాశీలకంగా పని చేసే 60 లక్షల సభ్యత్వాలు గల ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం దేశంలో ఏ పార్టీ నేతలకూ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య, ప్రచారాలు, తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపు కోవడమే ప్రతిపక్షాల పని అన్నారు. నేడు ఏ రంగాన్ని తీసుకున్నా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది అంటే అది సీఎం కేసీఆర్ గొప్పతనమే అన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ వెంటే నడుస్తున్నారని చెప్పారు. ఎన్నికలవేళ మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు వచ్చే విపక్షాలకు చెంపపెట్టు సమాధానం చెప్పాలని అన్నారు. సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తెప్పి కొట్టి వాస్తవాలను ముందు ఉంచాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేండ్లలో రూ.6 వేల కోట్లతో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వివరించి రాబోయే రోజుల్లో మూడో గులాబీ జెండా ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులు, సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్, కొంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేటర్లు, ఎక్స్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, దుండిగల్, నిజాంపేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షులు, మున్సిపాలిటీల బీఆర్ఎస్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.