Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ బస్టాప్ వద్ద రోడ్డుపైనే నిర్మాణం
- ఉన్నది పట్టించుకోకుండా కొత్తది..
- ఉచిత మూత్రశాలలకు మంగళం
నవతెలంగాణ-బేగంపేట్
బేగంపేట సర్కిల్ పరిధిలో అనేక ప్రధానమైన వాణిజ్య , వర్తక ప్రాంతాలున్నాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రెతిఫైల్ బస్టాండ్ , పాస్ పోర్టు కార్యాలయం, మోం డా మార్కెట్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజు నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆయా పనులపై వచ్చే ప్రజలకు మూత్రశాలల సమస్య వెంటాడుతుంది. మూత్ర శాలలు ఎక్కడపడితే అక్కడకట్టుకుంటూ పోయారు తప్పా వాటి నిర్వహణ గాలికి వదలి వేశారని ఆరోపణలు వస్తు న్నాయి. గతంలో నిర్మించిన మూత్ర శాలలు అనేకం నేడు శిథిలావస్థకు చేరుకుని అవి నిరుపయోగంగా మారగా అటు తర్వాత మళ్లీ కొత్త పేర్లు పెట్టి నిర్మించడం జీహెచ్ఎంసీ అధికారుల పనిగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.
ఉన్నది పట్టించుకోకుండా కొత్తది..
గురుద్వారా టెర్మినల్‌లోని బాలానగర్ బస్టాప్‌లో గత 15 ఏండ్ల క్రితం సులభ్ కాంప్లెక్స్ నిర్మించారు. దీన్ని ఆనుకునే బహిరంగ మూత్రశాలలు ఉన్నాయి. అయితే అది పాతది అవ్వడంతో ఇప్పుడు పక్కనే కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు అయిపోయాక పాతది కూలగొట్టే అవకాశం ఉంది. అయితే ఉన్న మూత్రశాలలను సరిగ్గా పట్టించుకోలేదని పలు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నిలిపే స్థలంలో టాయిలెట్ నిర్మిస్తుండటంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల , జగద్గిరిగుట్ట , బాలానగర్ తదితర ప్రాంతాలకు చెందిన బస్సులు ఇక్కడ నిలుపుతారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కూడా ఇక్కడ బస్సులు కొద్దిసేపు నిలుపుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ టాయిలెట్ నిర్మాణంతో కేవలం ఒక వైపు మాత్రమే బస్సులు ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
ఉచిత మూత్రశాలలకు మంగళం
బేగంపేట సర్కిల్ పరిధిలో ఉండే పలు బహిరంగ మూత్రశాలలను జీహెచ్ఎంసీ అధికారులు విస్మరిస్తూ పెయిడ్ మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు న్నాయి. డబ్బులు వసూళ్లు చేసికునే మూత్రశాలలను అధికారులు ప్రోత్సహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రయివేటుకు చెందిన పెట్రోల్ బంక్‌లు, హౌటళ్లలో ఉచితంగా మూత్ర విసర్జనకు అవకాశం ఉంది. కానీ ఈ మూత్ర శాలల్లో డబ్బు వసూళ్లు చేసుకునేందుకు జీహెచ్ ఎంసీ అవకాశం కల్పించడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. మూత్ర విసర్జనకు రూ.5 వసూలు చేస్తుండడంతో కొందరు సామాన్యులు బయటే మూత్ర విసర్జన చేస్తున్నారు. దాంతో పరిసరాలు పాడవుతున్నాయి.
ఉన్నదాన్ని కూలగొట్టి
మోండా మార్కెట్ ఇందిరాగాంధీ విగ్రహం ప్రాంతంలో బహిరంగ మూత్రశాల ఉండేది . దీన్ని జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ఇక్కడ ఉండే వ్యాపారులు కోసం ఈ మూత్రశాలను కూలగొట్టారని తెలిసింది. కూల్చి వేసిన మూత్రశాల వైపు ఓ దుకాణం తెరుచుకోనుందని సమాచారం. దీని కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి.