Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక కాప్రా, మల్కాజిగిరి, కీసర మండల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం 8వ రోజు శిక్షణలో భాగంగా స్థానిక ఆక్స్ఫర్డ్ మోడల్ హై స్కూల్ శ్రీ కష్ణా నగర్ కాలనీ చక్రిపురంలో విద్యార్థులకు ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సూత్రాలుపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జననీ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ లోక్ దాస్ మాట్లాడుతూ నేడు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు సంభవించాయని సాంప్రదాయక ఆహారపు అలవాట్లను మానేసి నూతన ఆహారపు అలవాట్లను పెంచుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. అనేక రకాల ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి ఊబకాయ సమస్యతో అనేకమంది రోజు సతమతమవుతున్నారని, నేడు విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ శారీరిక శ్రమ తగ్గడం, వ్యాయామాలు చేయడం పై ఆసక్తి తగ్గడంతో ఈ సమస్య ఇంకా అధికమవుతున్నదన్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలని.. తద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోగలమని వారు తెలియజేశారు. ప్రతీ రోజు వ్యాయామాన్ని నిత్యకత్యంగా చేసుకోవాలని, ఉదయాన్నే మితాహారం గ్లాస్ పాలను తాగడం, మధ్యాహ్నం భోజనంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని, ఫాస్ట్ ఫుడ్‌కు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. తరువాత విద్యార్థులకు కల్పనా సులువుగా డ్రాయింగ్ ఎలా గీయాలో, హ్యాండ్ రైటింగ్ ఎలా మెరుగుపరుచుకోవాలో మెలకువలు నేర్పించారు. వేసవి శిక్షణ శిబిరంలో జన విజ్ఞాన వేదిక కాప్రా మండల, మల్కాజిగిరి మండల ప్రధాన కార్యదర్శిలు సీహెచ్ ప్రభాకర్, శివ ప్రసాద్, కాప్రా మండల ఉపాధ్యక్షులు శివ శంకర్ రెడ్డి, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అందరు ఇందులో పాల్గొన్నారు.