Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒరిజినల్ ఫైల్ మాయం..!
- విజిలెన్స్ విచారణకు అడ్డంకులు
- తనకు అనుకూలంగా రిపోర్టు తయారు
- కమిషనర్ మెతక వైఖరి..!
- ఏసీ, జేసీ ఇష్టారాజ్యం
- విజిలెన్స్విచారణ జరగాల్సిందే : యూనియన్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో కలకలం రేపిన మెమో టాంపరింగ్ కేసు విచారణ డ్రామా తరహాలో సాగుతున్నది. 'టాంపరింగ్ కేసును విజిలెన్స్ విభాగం విచారించాలా? పరిపాలనా విభాగమే అంత ర్గతంగా విచారించాలా' అనే విషయం చర్చనీయాంశమైంది. పైగా దీనిపై రిపోర్టు తయారు చేసి కమిషనర్‌కు అందచేసినట్టు తెలి సింది. ఇంత పెద్ద కేసును విజిలెన్స్ విచారణకు ఆదేశించాల్సిన కమిషనర్ అంతర్గ విచారణకు మొగ్గు చూపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే విజిలెన్స్ విచారణ జరిగితే అసలు పాత్రదారులు, సూత్రదారులెవరో బయటికొస్తారనే కమిషనర్‌ను తప్పుదోవ పట్టించి అంతర్గత విచారణ చేసే విధంగా ఒప్పించారని బల్దియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో పాటు టాంపరింగ్‌కు పాల్పడిన అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకో వడం లేదనీ, వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నారోనని యూనియన్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒరిజినల్ ఫైల్ ఏమైంది..?
మెమో టాంపరింగ్ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్‌ను ఈవీడీఏం అధికారులకు ఇవ్వకుండా దాచి పెట్టారనే ప్రచారం జరుగుతున్నది. అందుకు విజిలెన్స్ అధికారులకు జిరాక్స్ ఫైల్ అందజేయడం నిదర్శనం. ఇప్పటి వరకు మూడు సార్లు విజిలెన్స్ అధికారులు అడిగినా సరైన సమాధానం చెప్పకుండా పరిపాలనా విభాగం అధికారులు దాట వేస్తున్నారని సమాచారం. ఒరిజినల్ ఫైల్ దొరికితే మెమోను ఎవరు మార్చారనే విషయం బయటికొచ్చే అవకాశముందని గమనించిన సదరు అధికారులు జాగ్రత్త పడుతున్నట్టు విజిలెన్స్ అధికారులు చర్చించుకుంటున్నారు.
కమిషనర్ మెతక వైఖరి..!
మెమో టాంపరింగ్ కేసులో కమిషనర్ మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని పలువురు యూనియన్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తున్న కమిషనర్ మెమోనే మార్చి ఉద్యోగం ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై యూనియన్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యంగా సంబంధిత క్లర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతోపాటు బదిలీ కూడా చేయలేదని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు విజిలెన్స్ విచారణకు పరిపాలనా విభాగం అధికారులు సహకరించడంలేదనే విమర్శలూ లేకపో లేదు. పైగా విచారణ సమయంలో ఏసీ సెలవు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏసీ ఆ రిపోర్టుపై తాను సంతకం చేయబోనని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ తరుణంలో విజిలెన్స్ విచారణ ఆగిపోయింది. మెమో టాంపరింగ్ కేసు విషయంలో పరిపాలనా విభాగం ఏసీ, జేసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, అందుకు కమిషనర్ పట్టించుకోకపోవడమే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్ చొరవ తీసుకుని టాంపరింగ్ కేసుపై విజిలెన్స్ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.