Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరి మధ్య పెద్ద దూరమేం కాదు.
స్పైన్ ఒక్కటే.
కథొక్కటే.
నేను మొదటి పేజైతే
నువ్వు చివరి పేజీ.
ఇద్దరమూ దాటుకురాలేని
లోతైన గాయాల్లాంటి
పొడుగాటి రాత్రుల్లాంటి
అధ్యాయాలు.
నువ్వుండి నేను లేనివి
నేను మాత్రమే ఉన్నవి
ఎటువైపో తేలక ఇద్దరివీ కాలేని
శీర్షికల్లేని అధ్యాయాలు.
ఇన్ని సయోధ్యలేని సర్గల మధ్య
కొన్ని పేజీలున్నాయి-
గులాబీరేకులు అంటుకున్నవి
సంకేతిత సందేశాలను దాచుకున్నవి
ఎడబాట్లమధ్య నెమలీకల్ని ఈనినవి
నాలుగుపెదాల మోహపుతడితో
అక్షరాలు అతుక్కుపోయినవి.
జీవితపు పేజీలన్నీ
వెనక్కీ ముందుకూ తిప్పేసినా
కలవలేనంత దూరమే కావొచ్చు
అయినా
చదువుతూ చదువుతూ రెండు పేజీలు ముందుకెళ్లినా
ఇంకా నాలుగు పేజీల వెనకే అతుక్కుపోయిన మనసుతో ఆలోచిస్తే
ఇద్దరి మధ్య పెద్ద దూరమేం కాకపోవొచ్చు.
- రవి వీరెల్లి
వర్జీనియా