Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృదయపు సంద్రం మీద
కనబడని వానొకటి కురుస్తూ ఉంటుంది
ఇసుక తిన్నెలు కరుగుతున్న దృశ్యం
అందర్నీ కదిలిస్తుంది
లోపల కలలు కొట్టుకుపోతున్న
కోరివేత దృశ్యం మాత్రం
ఎవ్వరికీ కనబడదు
మనిషి గుండెలోకి చూసే
మైక్రోస్కోపింకా కనుక్కోబడలేదు
వాకిట్లో రంగురంగుల ముగ్గు
కొద్దికొద్దిగా శిథిలమవుతున్న దృశ్యం
చుక్కల్ని కలిపిన గీతలు
గీతల చివర చుక్కలూ కలిసిపోయి
అంతా ఆస్పష్టమౌతున్న వానలో
ఒక దుఃఖధ్వని
గాలి హౌరులో ఎవ్వరికీ వినబడదు
లోపలి దుఃఖాన్ని వినిపించడానికి
ఇప్పటివరకూ
ఏ చట్టసభలోనూ
సమయం కేటాయించబడలేదు
మురికినీటిని మోసుకెళ్లే నల్లా
మెల్లమెల్లగా
ఓ మత్యుద్వారమై తెరుచుకునే దృశ్యం
విశాలంగా పరుచుకున్న ఏ రహదారికీ కనబడదు
పసితనం వీడని ఓ బాల్యం
సైకిల్ మీద వెళ్ళడం కనబడుతుంది
ఏ నిర్లక్షపు వరదకాళ్ళు అడ్డంపడి
చెరువులోకి దొర్లిందో చెప్పే సాక్షాలేవీ ఉండవు
ఎన్ని జీవితాల బరువునో భుజానికెత్తుకొని
ఠీవిగా నిలబడ్డ భవంతిని చూస్తాం
పునాదుల కింద
ఏ ధ్వంసరచన జరుగుతూ వుంటుందో తెలీదు
ఏ ఏడుకాయేడు
ఎన్నెన్నో నిశ్వాసపు మరకలు
వాన ఖాతాలో చేరిపోతూనే ఉంటాయి
చేయని నేరానికి ఉరిశిక్షపడ్డ ఖైదీలా
మబ్బులగదిలో వాన వెక్కుతూనే ఉంటుంది
వాన మనసులిపిని చదివే
కళ్ళ రెప్పలింకా తెరుచుకున్నట్టులేవు!
- సాంబమూర్తి లండ,
9642732008