Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆవారా'తో అలరించి.. 'శ్రీ 420'లో రాజ్ కపూర్‌ని లవ్వాడినా, తన అందంతో.. అభినయంతో.. ప్రేక్షకులలో 'ఆగ్' పుట్టించిన.. 'మదర్ ఇండియా' నర్గీస్! ఒక తరానికి ఆమె దేవత.. ప్రపంచ సినిమాకే రా'రాజ్ కపూర్' ఆమె అభినయానికి దాసోహం.. ఆమె కంటిచూపు కోసం పాకిస్థాన్ మాజీ ప్రధాని భుట్టో అంతటివాడే స్టూడియోల ముందు మునిమాపులు పడిగాపులు కాసాడంటే.. ఆ మత్తు కళ్ళ నిషా విసిరిన మన్మధ బాణాలు అని చెప్పక తప్పదు. బాలీవుడ్లో నటిగాహొప్రసిద్ధి పొందిన నర్గీస్ దత్ 1940 నుండి 1960 వరకు అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంశలు పొందింది. నర్గీస్ దత్ సినిమా చరిత్రలోనే గొప్ప మహిళా నటియే కాకుండా.., ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత కోసం 'నర్గీస్ దత్ ఫౌండేషన్' ఏర్పాటు చేసి,భారతీయ మహిళల ఆత్మకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిగా ఆమె శాశ్వతమైన గుర్తింపు పొందింది. నటనలో కీర్తి శిఖరం వద్ద ఉన్న సమయంలో కుటుంబం కోసం నటనను వదులుకోవడమే కాకుండా, పక్షవాతం పడిన పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ నర్గీస్. ఆమె చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు 1980 లో రాజ్యసభలో స్థానం సంపాదించేలా చేసాయి. అనేక విజయంతమైన చిత్రాలలో నటించిన నర్గీస్ సినిమా మదర్ ఇండియా 1957లో అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1967లో వచ్చిన 'రాత్ ఔర్ దిన్' సినిమాలో నటనకు నర్గీస్‌కు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది. 38 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో మరణించిన నర్గీస్ పునరుజ్జీవనోద్యమ మహిళగా, తన పాదముద్రలను ఇతరులు అనుసరించేలా మిగిల్చి వెళ్ళింది.
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నర్గీస్, జూన్ 1, 1929న కోలకతాలో పంజాబ్‌కు చెందిన ఒక ముస్లిమ్ కుటుంబంలో జన్మించింది. నర్గీస్ అసలు పేరు 'ఫాతిమా రషీద్'. తరువాత 'నర్గీస్' గా స్థిరపడిపోయింది. నర్గీస్ తల్లి అలహాబాదుకు చెందిన ప్రఖ్యాత శాస్త్రీయ గాయని జద్దన్‌బాయి హుస్సేన్, తండ్రి రావల్పిండి సంపన్న కుటుంబానికి చెందిన మోహన్ చంద్. జద్దన్బాయిని వివాహమాడిన తర్వాత మోహన్ చంద్ ముస్లిం మతాన్ని స్వీకరించి 'అబ్దుల్ రషీద్' గా పేరు మార్చుకున్నాడు. వీరి కుటుంబం బొంబాయిలో స్థిరపడటానికి ముందు కొంతకాలం కలకత్తాకు వెళ్లింది.అక్కడ యుక్త వయస్సులో ఉన్న నర్గిస్ను అందరూ టామ్‌బాయ్ అని పిలిచేవారు. నర్గీస్ తల్లి జద్దన్‌బాయి తొలి తరం భారతీయ సినిమాలలో నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు పొందింది. తల్లి నటి కావడంతో నర్గిస్ కు 6 ఏళ్లు నిండగానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
నర్గీస్ సినీరంగ ప్రవేశం
నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. తన ఆరవయేట బాలనటిగా 1935 లో 'తలాషె హక్' చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించినప్పటికి, ఈ చిత్రంలో దర్శకుడు 'ఫాతిమా రషీద్' పేరును బేబీ 'నర్గిస్' గా మార్చాడు, అయితే ఆ తరువాత ఇదే పేరు స్థిరపడిపోయింది. ముంబైలోని క్వీన్ మేరీస్ పాఠశాలలో విద్యను పూర్తి చేసిన తరువాత, మెడిసిన్ చేయాలనుకుంది. తిరిగి నర్గీస్ 14వ యేట 1943 లో దర్శకులు మెహబూబ్ ఖాన్ ప్రోద్బలంతో స్క్రీన్ టెస్ట్ లో సెలక్ట్ అయ్యి 'తక్దీర్' సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నర్గీస్ నటించడాన్ని ఫిల్మిండియా సినీ పత్రిక 'అద్భుతమైన తొలిప్రవేశం'గా పేర్కొంది. 'తఖ్దీర్' తర్వాత, నర్గీస్ దత్ 1945 పీరియడ్ డ్రామా 'హుమాయున్' చిత్రంలో ప్రముఖ నటుడు అశోక్ కుమార్ సరసన నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. నర్గీస్ 1948లో 'మేళా, అనోఖా, ప్యార్, అంజుమన్ ఆగ్' చిత్రాలలో నటించగా, 'మేళా' తప్ప, ఏ సినిమా కూడా బాగా ఆడలేదు. 1949 లో 'బర్సాత్, అందాజ్, దారోగాజీ, రుమాల్', 1951 లో 'ఆవారా, దీదార్', 1955 లో 'శ్రీ420, 1956 లో 'చోరీచోరీ' చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును పొందింది. మెహబూబ్ ఖాన్ 1957లో నర్గీస్ నాయికగా నిర్మించిన ''మదర్ ఇండియా'' ఘనవిజయం సాదించింది. నర్గీస్ 28 ఏళ్ల వయస్సులోనే ఈ సినిమాలో తల్లి పాత్రను దరించి మెప్పించినది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడటంతో పాటు, చిత్రంలోని నటనకు నర్గీస్ కు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డుహొతెచ్చి పెట్టింది. నర్గీస్ నటించిన 'ఆహ్' సినిమా తెలుగులో 'ప్రేమ లేఖలు' పేరుతో విడుదలై తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. 1958లో సునీల్‌దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి 'రాత్ ఔర్ దిన్', ఈ చిత్రం నర్గీస్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చి పెట్టింది. నర్గీస్ కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలతో పాటు, విమర్శకుల ప్రశంసలు పొందిన పలు చిత్రాలలో నటించింది. వీటిలో చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.
రాజకపూర్ తో ప్రేమాయణం
రాజ్ కపూర్ తన సినిమా షూటింగ్ కోసం స్టూడియో వెతుక్కునే ప్రయత్నంలో నర్గీస్ వాళ్ళమ్మ జద్దన్‌బాయి సలహా కోసం వాళ్ళింటికి వెళ్ళినపుడు నర్గీస్ ను చూసి ఆమె అందానికి ముగ్దడయ్యాడు. నీలి కళ్ల అందగాడైన రాజ్ కపూర్‌ని చూసిన నర్గీస్ సైతం ఆయన పట్ల ఆకర్షితురాలయ్యింది. వారిరువురు ఒకరికొకరు పరిచయమయ్యేనాటికి నర్గీస్ వయసు 20, రాజ్ కపూర్ వయసు 22. అప్పటికే నర్గీస్ ఎనిమిది హిట్ సినిమాలను ఇచ్చింది. రాజ్ కపూర్ మాత్రం ఇబ్బందిలో ఉన్నాడు. ఆ సమయంలో తను నటిస్తున్న 'ఆగ్' సినిమాలో నర్గీస్ కోసం ఒక పాత్రను సృష్టించాడు. అనంతరం వచ్చిన 'బర్సాత్' సినిమాతో ఇద్దరి మద్య ప్రేమానుబంధం బలపడింది. రాజ్ కపూర్ సొంత నిర్మాణ సంస్థ 'ఆర్ కే ఫిల్మ్స్' తీసిన అన్నీ చిత్రాల్లో నర్గీస్ నటించింది. ఆ ఇద్దరు జంటగా 16 సినిమాలల్లో నటించి సక్సెస్ జోడీగా గుర్తింపు పొందారు. ఒక దశలో 'ఆర్ కే ఫిల్మ్స్' లో తప్ప బయటి బ్యానర్స్‌లో నర్గీస్ నటించదు అనే అప్రకటిత శాసనాన్ని రాజ్ కపూర్ అమలు చేశాడని ఇండిస్టిలో చెప్పుకునేవారు. అయితే 'ఆర్ కే ఫిల్మ్స్' ఆర్థిక కష్టాల్లో వున్నపుడు రాజ్ కపూర్ అనుమతితో బయటి సినిమాల్లో నటించి ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంతో పాటు తన నగలను అమ్మి 'ఆర్ కే ఫిల్మ్స్' ఖజానాలో జమ చేసేదట. నా పిల్లలకు నా బార్య తల్లి అయితే 'ఆర్ కే ఫిల్మ్స్' కి తల్లి నర్గీస్ అని రాజ్ కపూర్ తరచుగా సినీ పెద్దలతో చెప్పేవాడట.అయితే వీరిద్దరి ప్రేమ ఒకటి కావడానికి రెండు కారణాలు అడ్డుపడ్డాయి. అదివరకే రాజ్ కపూర్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.అతను తన భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు, నర్గీస్ మతం వేరు కావడం. ఈ ఇరువురి ప్రేమకి అడ్డంకి అయ్యాయి. తమ ప్రేమ సుఖాంతం అవుతుందనుకున్న ఇద్దరికీ నిరాశే ఎదురయ్యి, వారి తొమ్మిదేళ్ల బంధం ముగిసింది. దీంతో నర్గీస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తన డిప్రెషన్ తగ్గడానికి 'మదర్ ఇండియా' సెట్లో తన సహ నటుడు సునీల్ దత్‌ని ఊరటగా మలచుకుని అతనికి దగ్గరవ్వడమే కాకుండా, పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజ్ కపూర్ 'ఆర్ కే ఫిల్మ్స్' కార్యాలయంలో నర్గీస్ ఉపయోగించిన వస్తువులను, గదిని అపురూపంగా చూసుకుంటూ రోజంతా మద్యం సేవిస్తూ ఏడుస్తూ గడిపేవాడు. ఇలా ఈ ఇద్దరి ప్రేమ గమ్యం చెరకుండానే ముగిసిపోయింది.
మజిలీ చేరని లవ్ స్టోరీస్
అయితే వీరిద్దరి మధ్య ప్రేమ విఫలమైన, కొన్నాళ్ళ తర్వాత రాజ్‌కపూర్ ఎప్పటిలాగే తన కథానాయికలతో ప్రేమ కలాపాలు సాగిస్తూనే కుటుంబం దూరం కాకుండా చూసుకున్నాడు. ఇక నర్గీస్ ప్రేమలో పడిన మరో నటుడు దిలీప్‌కుమార్ మాత్రం నర్గీస్ జ్ఞాపకాలతో చాలా కాలం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. వయసు దాటిపోయాక 1966లో సైరాబానును చేసుకున్నాడు. విచిత్రమైన ఈ లవ్‌స్టోరీలో ఎవరి ప్రేమా సక్సెస్ కాలేదు.
''ప్యార్ హువా.. ఇక్ రార్ హువా హై.. ప్యార్ సె ఫిర్ క్యో దర్తా హై దిల్.. కహతా హై దిల్ రస్తా ముష్కిల్ మాలుమ్ నహి హై కహా మంజిల్..'' అన్నట్లుగానే వీరి ప్రేమ మజిలీ చేరకున్నా అందరూ హ్యాపీ గానే వున్నారు.
సునీల్ దత్ తో నర్గీస్ వివాహం
నర్గీస్''మదర్ఇండియా''సహనటుడు సునీల్‌దత్‌ను 1958లో వివాహం చేసుకుంది.
మదరిండియా షూటింగ్ సమయంలో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మంటల్లో చిక్కుకున్న నర్గీస్‌ను సునీల్ దత్ కాపాడటంతో అందుకు బదులుగా ఆమె తన జీవితాన్ని ఇచ్చింది. ఆ సినిమా షూటింగప్పుడే వాళ్లిద్దరి ప్రేమ గుప్పుగుప్పుమంది. సినిమా విడుదలకు ముందే ఇద్దరు ఒక్కటయ్యారు. సునీల్ దత్ తనకంటే ఒక ఏడాది చిన్నవాడైనప్పటికి నర్గీస్ హిందూ మతాన్ని స్వీకరించి అతన్ని వివాహమాడింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో సంజయ్ దత్, ప్రియా దత్, నమ్రతా దత్. సంజయ్ దత్ విజయవంతమైన సినీ నటుడిగా ఎదిగాడు.రెండో బిడ్డ నమ్రతా దత్ నటుడు కుమార్ గౌరవ్‌ని వివాహం చేసుకున్నారు. ఈయన మదర్ ఇండియాలో నర్గీస్, సునీల్ దత్‌లతో కలిసి కనిపించిన ప్రముఖ నటుడు రాజేంద్ర కుమార్ కుమారుడు. ఇక మూడో బిడ్డ ప్రియా దత్ రాజకీయాల్లో రాణిస్తున్నారు.
సునీల్‌దత్‌తో వివాహమైన తరువాత నర్గీస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసి, తన భర్తతో కలసి ''అజంతా ఆర్ట్స్ కల్చర్ ట్రూప్ ''ను ఏర్పాటు చేసింది. నాటి ప్రముఖ నటులు, గాయనీ గాయకులను భాగస్వాముల్యను చేస్తూ, సరిహద్దు ప్రాంతాలలో సైనికులకు వినోదాన్ని అందించేందుకు ఈ సంస్థ ద్వారా స్టేజ్ షోలను నిర్వహించింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ఢాకా నగరంలో ప్రదర్శనలిచి సైనికులను అలరించారు. 1972 లో నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సలహాతో నర్గీస్''ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా'' సంస్థను ప్రారంభించి దివ్యాంగుల సేవారంగంలో కార్యక్రమాలను ప్రారంభించారు. పిల్లల పక్షవాత సంబధిత వ్యాధులు ఫిట్స్ లక్షణాలు ఉన్న వారికి సేవలను అందిచాలనే లక్ష్యంతో ఈ సంస్థకు మొదటి పోషకురాలయి, సంస్థ కోసం చేసిన కృషికి ఒక సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు పొందగల్గింది.
క్యాన్సర్‌తో మృతి
నర్గీస్ తన కుమారుడు సంజయ్ దత్ మొదటి చిత్రం 'రాకీ' విడుదలకు కొద్ది రోజుల ముందు, 1980 ఆగస్టు 2న, నర్గీస్ రాజ్యసభలో అనారోగ్యానికి గురైంది. ఆమెను వెంటనే ఇంటికి చేర్చి బొంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన తరువాత నర్గీస్ పరిస్థితి మరింత దిగజారడమే కాకుండా, వేగంగా బరువు తగ్గింది, ఆమెకు 15 రోజుల పరీక్షల తర్వాత 'ప్యాంక్రియాటిక్ క్యాన్సర్' ఉన్నట్లు నిర్ధారణ కావడంతో న్యూయార్క్ నగరంలోని మెమోరియల్ స్లోన్-కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్లో వ్యాధికి చికిత్స పొందింది. అక్కడ చికిత్స పొంది భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు నర్గీస్ పరిస్థితి క్షీణించడంతో బొంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. నర్గీస్ 51 సంవత్సరాల వయస్సులో 1981 మే 2 కోమాలోకి వెళ్ళి, మరుసటి రోజు మే 3 న ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది.
నర్గీస్ దత్ ఫౌండేషన్
నర్గీస్ సునీల్ దత్ తో వివాహం, ప్రసవం తర్వాత సినిమాలలో నటించడం గణనీయంగా తగ్గించి, బాయ్ స్కౌట్స్, గైడ్స్, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి వివిధ సంస్థలతో అనుబంధం పెంచుకుని, సామాజిక సేవపై దృష్టి సారించింది. పేదవారి కోసం పాఠశాలను స్థాపించడం, శారీరకంగా వికలాంగుల కోసం పని చేయడం చేసింది.
1981 లో నర్గీస్ చివరి కోరిక మేరకు ఆమె భర్త సునీల్ దత్ 'నర్గీస్ దత్ ఫౌండేషన్' ను, 'నర్గీస్‌దత్ మోమోరియల్ కాన్సర్ హాస్పిటల్' ను స్థాపించి పేషంట్లకు సేవలు అందించాడు. 'నర్గీస్ దత్ ఫౌండేషన్' ద్వారా గత 42 సంవత్సరాలుగా ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత రంగంలో సేవలందిస్తుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని వికలాంగ పిల్లల సంరక్షణ, పునరావాసం, విద్యలో గణనీయమైన కృషి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు, ఆమె చివరి కోరిక సాకారాన్ని ఎక్కువ కాలం చూడలేకపోయింది. నర్గీస్ మరణానంతరం ఆమె భర్త సునీల్ దత్ తో పాటు స్నేహితులు, ఇపుడు నర్గీస్ పిల్లలు ఆమె కలను సజీవంగా ఉంచే భాద్యతను చేపట్టి లక్ష్యం దిశగా పయనం కొనసాగిస్తున్నారు.
నర్గీస్ దత్ పేర జాతీయ అవార్డు
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ ప్రతి ఏటా ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల విభాగంలో నర్గీస్ గౌరవార్థం ''నర్గీస్ దత్ జాతీయ సమైక్యత అవార్డు'' నెలకొల్పింది. ఈ అవార్డునును జాతీయ సమైక్యత పై రూపొందించబడిన చలన చిత్రానికి ప్రతి ఏటా బహుకరిస్తున్నారు. 1965 లో 13 వ జాతీయ చలన చిత్రాల పురస్కారాలలో నెలకొల్పబడిన ఈ అవార్డును ఇప్పటివరకు అన్నీ భారతీయ బాషలలో నిర్మితమైన 46 చిత్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు కింద ఎంపికైన చిత్రానికి 50 వేల నగదుతో బాటు రజత కమలం, ప్రశంశా పత్రం అందిస్తున్నారు.
నర్గీస్ పై పుస్తకాలు
నర్గీస్ జీవిత చరిత్రపై పలు పుస్తకాలు వెలువడ్డాయి. 1994 లో టి.జె.ఎస్. జార్జ్ ''ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నర్గీస్'' అనే పేరున పుస్తకాన్ని వెలువరించగా, 2007 లో నర్గీస్ కుమార్తెలు ప్రియా దత్, నమ్రతా దత్‌లు కలసి వారి తల్లిదండ్రుల జీవితాల గురించి ''మిస్టర్ అండ్ మిసెస్ దత్ మెమోరీస్ ఆఫ్ అవర్ పేరెంట్స్'' అనే పుస్తకాన్ని ప్రచురించారు. అదే సంవత్సరం కిశ్వర్ దేశాయ్ 'డార్లింగ్జీ, ది ట్రూ లవ్ స్టోరీ ఆఫ్ నర్గీస్ సునీల్ దత్' పుస్తకాలు విడుదల అయ్యాయి. 2018లో వచ్చిన నర్గీస్ కుమారుడు సంజయ్ దత్ బయోపిక్ చిత్రం 'సంజు' లో నర్గీస్ పాత్రను మనీషా కొయిరాలా పోషించించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం 2018 లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
పురస్కారాలు
1957లో నర్గీస్ 'మదర్ ఇండియా' సినిమాలో నటనకు గాను 'ఫిలింఫేర్ ఉత్తమనటి' అవార్డు అందుకున్నారు. ఈ సినిమా 'ఆస్కార్ అవార్డు' కు నామినెట్ చేయబడింది.
1958లో 'పద్మశ్రీ' పురస్కారాన్ని పొందిన సినిమా రంగానికి చెందిన తొలి నటి నర్గీస్.
1958లో చేకొస్లోవేకియాలో జరిగిన చలన చిత్రోత్సవంలో 'మదర్ ఇండియా' సినిమాలో నటనకు ''కార్లోవి వేరీ ఉత్తమ నటి అవార్డు'' సాధించిన తొలి నటి.
1968లో 'రాత్ ఔర్ దిన్' సినిమాలో నటించిన నర్గీస్ 'జాతీయ ఉత్తమనటి' అవార్డుతో, 'ఊర్వశి' పురస్కారం అందుకున్న తొలి నటీమణి.
1980 లో నర్గీస్ రాజ్యసభకు నామినేట్ అయ్యింది.
2001లో హీరోహౌండా కంపెనీ, స్టార్‌డస్ట్ సినీపత్రిక 'బెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది మిలీనియం' పురస్కారాన్ని ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌తో కలిపి ప్రదానం చేశాయి.
1993 డిశంబర్ 30 వ తేదీన భారత తపాలా శాఖ నర్గీస్ దత్ జ్ఞాపకార్థం ఒక రూపాయి విలువ గల పోస్టల్ స్టాంపు ను విడుదల చేసింది.
(మే 3న 42వ వర్దంతి సందర్భంగా..)
- పొన్నం రవిచంద్ర, 9440077499