Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక జనావళికి శుభోదయం
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగానే ప్రియతమ సుందరయ్య అతి చిన్నతనంలోనే, ఇంట్లో తల్లితోనే వాదులాట, నాకు ఇంట్లో అన్నం పెడుతున్నావు, మరి పాలేరుకి ఎందుకు అన్నం బయట పెడుతున్నావు? అంటూ ఇంట్లోనే పోరాటం. స్కూలుకి వెళ్ళడం ఎగ్గొట్టి పొలాల్లో కూలీలతో తిరుగుతూ టీచర్లు అడిగితే పొలాల్లోనే మంచి పాఠాలు నేర్చుకుంటున్నానని జవాబు చెప్పేవారు. పేదవర్గాలకి కారు చౌకగా సరుకులు అందించాలని సైకిల్ పై వెళ్ళి టోకు ధరల దుకాణంలో సరుకులు తెచ్చి తానే దుకాణంలో కూర్చుని సరుకులు అమ్మడం, అన్ని కులాలకు సహపంక్తి భోజనాలు ఏర్పరచి, పై కులాలకు భయపడి ఎవరూ లేకపోతే, తాను బాధతో నిరాహార వ్రతం చేయడం మొదలైన సామ్యవాద లక్షణాలతో తాను పుట్టిన గ్రామంలోనే ఉద్యమం ప్రారంభించారు. ఈ విశాల భారతంలో అలగానిపాడు అనే ఒక పల్లెలోని భూస్వామ్య కుటుంబంలో 1913 మే నెల 1వ తేదీన జన్మించారు. ఈ భూమి తల్లికి బిడ్డగా, ఈ భూమి అందరికీ సొంతం, ఈ సంపద అందరికీ సమానం, అందరం భూమి తల్లి బిడ్డలం అనేది ప్రబోధిస్తూ, నలుదెశల సూర్యుడిగా ప్రకాశిస్తూ, సామ్యవాద సారధిగా నిలిచారు. మహిళల గురించి మాట్లాడుతూ తన రచనలలో ''స్త్రీలకు అవకాశం దొరికితే ఎంతటి విజయాలు సాధిస్తారో నేనూ చూశాను. అద్భుతాలు సృష్టిస్తారు'' అన్నారు. తన రచనల్లో అనేకమంది మహిళల వీరోచిత పాత్ర వారి పేర్లతో సహా రాశారు.
తన ప్రాథమిక విద్యాస్థాయి నుండే యోగి వేమన శతకం నుండి సుమతీ శతకం వరకు అన్నీ చదివారు. నిరంతరం గ్రంథాలయంలోని సకల గ్రంథాలు రామాయణం, మహాభారతం మొదలైన పురాణ గ్రంథాలు పఠించారు. మహాకవులు గురజాడ, కందుకూరి రచనల నుండి మానవ జాతికి మహాప్రస్థానం వలె వున్న కారల్మాక్క్స్ రచన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పఠించి, మార్క్సిజమే తన మహా ఆయుధంగా తన నిరంతర పోరాటంతో మేధావి వర్గాలను కార్మిక వర్గాలను చైతన్య పూరితం చేశారు. తెలంగాణ మహోధ్యమంలో అజ్ఞాతంగా అడవులలో కొండ గుట్టలలో కారు చీకటిలో, ఆకాశపు నక్షత్రపు వెలుగులలో వందల మైళ్ళు సంచారం చేస్తూ కాళ్ళు పుళ్ళుపడి పోయినా, ఆకలికి అడవిలో దొరికే కాయలు, ఆకులు తింటూ గెరిల్లాల దళాలకు శత్రువుల నుండి రక్షణ ఏర్పాటు చేసుకుంటూ ఆయన సంచారం మానవ శక్తికి రుజువు. గెరిల్లాలకు ప్రమాదం రాకుండా ఆయన ఎత్తుగడలు అద్భుతం. దళాలను ప్రోత్సహిస్తూ వారి ఆహారం, ఆరోగ్యం కోసం మన ఊహకు అందని ఏర్పాట్లు సుందరయ్య నిరంతర తపస్సు. శత్రువుని ఎదుర్కోవడంలో ఆయన వ్యూహం, ఎత్తుగడలు క్యూబా విముక్తి పోరులో ఫెడరల్ కాస్ట్రోకి మార్గదర్శకుడైన యువ వీరుడు బొలీవియా దేశపు బిడ్డ చేగువేరాను గుర్తు చేస్తాయి.
సుందరయ్య చిన్న వయసులోనే మహాత్ముడు గాంధీజీ అడుగుజాడల్లో ఉప్పు సత్యాగ్రహాలు చేసి, పోలీసుల లాఠీదెబ్బలు, జైలు నిర్బంధాలు అనుభవిస్తూ, ఖాదీ ఉద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ సాగిస్తూ భారత స్వాతంత్య్ర సాధనలో గొప్ప పాత్ర నిర్వహించారు. సుందరయ్య గాంధీజీతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా దిరుసుమర్రు గ్రామంలోనే మొదట ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు. ఎవరూ ఎక్కలేని ఎత్తైన తాటి చెట్టు ఎక్కి వాటి గెలలు నరికి అంతే ప్రతాపం చూపారు. అందరూ నెల్లూరు రెడ్డి ఎంత గొప్పవాడో అని చెప్పుకున్నారు. మార్క్సిజం హింసకు వ్యతిరేకం. న్యాయసాధనలో శత్రువు మీద పడితే ఆత్మ రక్షణా ప్రయత్నంలో మాత్రమే హింస జరగవచ్చును. మనంతట మనంగా హింసకు పూనుకోరాదు అనేది మార్క్సిజం. ఆ మార్క్సిజం సూత్రాలు దేశమంతటా వ్యాపింప చేయుటకు సుందరయ్య దేశవ్యాపిత పర్యటన ఎన్నో అవరోధాలను దాటుకుంటూ సాగించిన ఆయన కృషి అత్యద్భుతం. అనేకమంది దేశ భక్తులను కలుసుకుంటూ మార్క్సిజమే ప్రజల బంగారు భవితకు నిజమైన మార్గదర్శిగా సిద్ధాంత చర్చలు ఎంతోమంది మేధావులతో, కార్మిక వర్గంతో చర్చలు జరుపుతూ తాను ఆంధ్రాలోనూ, కామ్రెడ్ బసవపున్నయ్య ఢిల్లీలోనూ వుండి పార్టీలోని పెడ ధోరణులను తీవ్రంగా ఖండిస్తూ దేశ వ్యాపితంగా సి.పి.ఐ.ఎం పార్టీని నిర్మించారు. సుందరయ్య, బసవపున్నయ్యలు అపూర్వసహోదరుల వలె తెలంగాణ విముక్తి సాధనలో తమ ప్రతిభను చాటారు. నిరంతరం ప్రజల్లో మమేకమై ఉద్యమాలు సాగించారు. పార్టీని నిర్మంచారు.
1953వ సంవత్సరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మా అద్దె ఇంట్లో నిరంతరం పార్టీ నాయకులు ఎవరెవరో ముందు గడిలో కూర్చుని చర్చలు సాగించేవారు. వారెవరో నాకు అసలు తెలీదు. నాకు సరిగా వంట కూడా రాదు. ఏది వండితే అదే తినేవారు. పప్పు వండి కోడిగుడ్లు ఉడికించేదాన్ని. నెయ్యి, మా అమ్మగారు పంపించిన ఆవకాయ, మజ్జిగ వుండేది. ఒకరోజు సుందరయ్య స్నానం చేసి తువ్వాలు కట్టుకుని ఇంట్లోకి వస్తూ మా పెద్దమ్మాయి సరోజను నా ఎదురుగా పెట్టుకుని, పొయ్యి దగ్గర వంట చేస్తున్న నన్ను చూపించి తనలో తాను 'ఈ ఒక్క అమ్మాయితో ఇంత మందిమి చేయించుకుంటున్నాం' నా వంక చూస్తూ మా పాపను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్ళారు. ఆయన సుందరయ్యగారని నాకు తెలియదు. తర్వాత అల్లూరి గారు చెప్పారు, సుందరయ్య మన పార్టీ నాయకులు అని. అది 1954వ సంవత్సరం.
తర్వాత 1967వ సంవత్సరంలో పాలకొల్లులో జరిగిన చారిత్రాత్మకమైన సిద్ధాంతపోరాటం, పాలకొల్లు ప్లీనం సందర్భంగా సుందరయ్యగారు ఎక్కువగా పాలకొల్లు వచ్చేవారు. మా ఇంట్లోనే ఆయన మకాం. నన్ను పార్టీ జిల్లా కమిటీలో వుండాలని ఆదేశించారు. నేను భయంతో అంత పెద్ద స్థాయి నాకు లేదు, నేను ఉండలేను అన్నాను. దానికి సుందరయ్యగారు సీరియస్గా 'ఏం... భయపడుతున్నావా? నిన్ను ఏ గోతిలోనైనా దించేస్తున్నామా?' అన్నారు. దానితో నాకు పౌరుషం వచ్చింది. నాకేం భయమని కాదు, అంత స్థాయి నాకు లేదని అన్నాను.
సుందరయ్య ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాలకొల్లు మా ఇంట్లో వున్నారు. ఆహారం పండ్ల రసాలే. భోజనం లేదు. ఆయనకు సపోటా పండ్లు ఇష్టం. అవి తెప్పించి ఇచ్చాను. ఇష్టంగా తిన్నారు. కొంచెం సేమ్యా చేసి ఇచ్చాను. పుచ్చుకున్నారు. నేను లోపలి వంట గదిలోకి వెళ్ళాను. గదిలో గుమ్మం చివరకు వచ్చి 'అమ్మా, వెళ్తాను' అన్నారు. ఆయన వైపు చూసి నిలబడి పోయాను. మాట రాలేదు. కనీసం నమస్కారం కూడా చెప్పలేకపోయాను. నెమ్మదిగా మా మెట్లు దిగి వెళ్ళిపోయారు. మా డాబా పై పెంకుటిల్లు మాది. ఆ వీధి వైపు కటకటాల్లో పడకకుర్చీలో ఆయన విశ్రాంతిగా కూర్చున్న దృశ్యమే నాకు ఎప్పుడూ కళ్ళలో కన్పిస్తూ వుంటుంది. నేను సపోటా పండ్లు ఇస్తే సంతోషంగా చూసి పువ్వు ఇలా పెడుతూ వుండు, మేం తింటూ వుంటాం అన్నారు. ఆ నవ్వు మరువలేను. అదే ఆయన కడసారి సజీవ దర్శనం మా ఇంట్లో. అంతటి మహనీయులు సుందరయ్య.
బసవ పున్నయ్య, ఉద్దరాజు రామం, ఎల్.బి.జీ, కొరటాల, గుంటూరు బాపనయ్య, సత్యనారాయణ, బీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఓంకార్, నర్రా నరసింహారెడ్డి, సుశీలా గోపాలన్ కేరళ మొదలైన మహా నాయకులందరికీ ఆతిథ్యం ఇచ్చిన మా ఇల్లు పవిత్ర దేవాలయం. ప్రజా ఉద్యమాల పుట్టిల్లు.
మహనీయులు సుందరయ్య సందేశం :
1. నీకు శత్రువుల వల్ల వచ్చే ప్రమాదానికి తీసుకునే జాగ్రత్తలతో పాటు అదనపు జాగ్రత్తలు తీసుకో.
2. పుస్తకం ఎవరికీ ఉచితంగా ఇవ్వకు. నీకు కొని చదువు. ఇతరులతో కొనిపించి చదివించు.
3. 'ఒక పూట భోజనం మానేసి అయినా, ఆ పొదుపు డబ్బుతో పుస్తకం కొను' అని చెప్పేవారు.
ఆ మహోన్నత సందేశాలు పాటిస్తూ మెజారిటీ శ్రామిక వర్గాన్ని చైతన్యపూరితం చేయాలి. మేల్కొల్పాలి. ఆకలి లేని సమాజం సమ సమాజం. ఆ స్వర్గ థామం శ్రామిక రాజ్యం సోషలిజం సాధించాలి. మరిన్ని త్యాగాలకు దేవభక్తులు సన్నద్దం కావాలి. త్యాగమయ జీవితమే జీవిత పరమార్థం అనేది అడుగడుగునా గుర్తుంచుకుంటూ సార్దక జీవులం కావాలి.
నిరంతరం ఆ మహనీయుని స్మృతులతో
అల్లూరి మన్మోహిని.
(సంపూర్ణ అక్షరాస్యత సాధించిన వీర వియత్నాం సోషలిస్టు ప్రభుత్వ రథసారధి మహోన్నత మానవతా మూర్తి హోచిమిన్ జన్మదినం కూడా మే 1వ తేదీ)
- శ్రామిక శక్తికి, విజయోత్సవం మే దినోత్సవం