Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఐక్యరాజ్య సమితి', 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని ట్యూనీషియాలో 1982, ఏప్రిల్ 18న ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారసత్వ సంపద పరిరక్షణకు చేయవలసిన పనులు, నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్ 18వ తేదీని 'ప్రపంచ వారసత్వ దినోత్సవం'గా ప్రకటించాలని యునెస్కోకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన 1983లో ఆమోదం పొంది, అప్పటి నుండి ఏప్రిల్ 18వ తేదీ ప్రపంచ వారసత్వ దినోత్సవం అయింది.
అలా ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో మన దేశంలోని హంపి, అజంతా, ఎల్లోరా గుహలు, తాజ్‌మహల్, కోణార్క్ సూర్య దేవాలయం, ఖజురహౌ స్మారక కట్టడాలు, జంతర్ మంతర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రాకోట, తెలంగాణలోని రామప్ప దేవాలయం... తదితరాలు వున్నాయి.
హంపి : విజయనగర మహారాజ సామ్రాజ్యంలో ప్రాచీన నగరం ఇది. నగరమంతా అద్భుతమైన స్మారక కట్టడాలు విస్తరించి ఉన్నాయి. శిధిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న విట్టల ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏక శిలా రథం గురించి. ఇది విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. విశేషం ఏమంటే ఈ ఏకశిలా రథానికి కదిలే చక్రాలు ఉంటాయి. ఇక్కడి మరో విశేషం... గోపురం నీడ ప్రధాన ఆలయంలోని ఒక చిన్న రంద్రం నుండి ప్రసరించి గోడమీద తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇది అప్పటి కళా చాతుర్యానికి నిదర్శనం. 1986లో ఈ చారిత్రక కట్టడాలకి ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కింది.
తాజ్ మహల్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా నదీ తీరాన వెలిసిన తాజ్ మహల్ ఓ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా ఈ కట్టడం ప్రాచుర్యం పొందింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణించిన తన మూడవ భార్య బేగం ముంతాజ్ మహల్ స్మారకార్థం దీనిని నిర్మించాడు. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందిన ఈ కట్టడం 1983లో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందింది.
కోణార్క్ సూర్య దేవాలయం : ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినది. 24 రథ చక్రాల మీద, సప్త అశ్వాలతో సూర్య భగవానుడు కదిలివస్తున్నట్లుగా రాతి శిల్పాలతో అందంగా నిర్మించారు. బంగాళాఖాతం తూర్పు తీరంలో మహానది డెల్టాలో వెలిసిన ఈ క్షేత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది. 1984లో ఈ సూర్యదేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదాను దక్కించుకుంది.
ఖజురహో స్మారక కట్టడాలు : మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఈ ఖజురహో స్మారక కట్టడాలు వున్నాయి. క్రీ.శ 11వ శతాబ్దం నాటి హిందూ, జైన దేవాలయాలు క్లిష్టమైన వాస్తుశిల్పానికి ఖజురహౌ స్మారక కట్టడాలు పెట్టింది పేరు. 1986లో దీనికి యునెస్కో గుర్తింపునిచ్చింది.
ఫతేపూర్ సిక్రీ :ఆగ్రాకు 37 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ కోట ఉంది. యూపీలోని ఫతేపూర్ సిక్రీని అక్బర్ 16వ శతాబ్దంలో నిర్మించాడు. అక్బర్ చిత్తోర్ విజయం తర్వాత ఆగ్రా సమీపంలోని సిక్రీ రిట్జ్ వద్ద సూఫీ సాధువు సలీం చిష్టి గౌరవార్థం ఈ నగరాన్ని నిర్మించాలని సంకల్పించాడు. పర్షియన్ భాషలో ఫతేహ్ అంటే విజయం, ఈ నగరాన్ని విజయసూచకంగా ఫతేహాబాద్ అని అక్బర్ నామకరణం చేశాడు. 1571 నుంచి 1585 వరకూ ఫతేపూర్ సిక్రీ మొఘల్ సామ్రాజ్యానికే రాజధానిగా కొనసాగింది.
దాదాపు మూడు కిలోమీటర్ల పొడవూ కిలోమీటరు వెడల్పులతో మూడువైపులా 50 అడుగుల ప్రహరీ, ఒకవైపు కృత్రిమ సరస్సుతో నగరం అద్భుతంగా నిర్మించబడింది. నగరం లోపలికి రావడానికి ఏడు అతిపెద్ద దర్వాజాలు ఉన్నాయి. ఆగ్రా గేటు ద్వారా లోపలికి ప్రవేశించగానే నౌబత్ ఖానా భవనం నుంచి చక్రవర్తి రాకపోకలకు అనుగుణంగా సంగీతం వినిపించేవారట. దీనికి తూర్పుదిశగా టంకశాల ఉంది. ఇది శిథిలావస్థలో ఉంది.
ఫతేపూర్ సిక్రీ రాజభవనాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నదే బులంద్ దర్వాజ. దీన్ని దక్షిణ భారతం విజయాలను పురస్కరించుకుని నిర్మించాడట. 176 అడుగుల ఎత్తున్న ఈ ద్వారం ప్రపంచంలోని అతిపెద్ద దర్వాజాల్లో ఒకటిగా పేరొందింది. దీన్నుంచి లోపలకు వెళ్లగానే సూఫీ మతబోధకుడైన సలీం చిస్తీ సమాధి ఉన్న పాలరాతి కట్టడం కనిపిస్తుంది. తరవాత అక్బరు ప్రజాదర్బారు నిర్వహించిన భవనానం ఉంది. అక్బర్ చదరంగం ఆడిన చోటు కూడా ఇక్కడే ఉంది. గళ్లలో పావులకు బదులు మనుషులను నిలబెట్టి ఆడేవారట. దివాన్-ఎ-ఆమ్ వెనక వైపున ఉన్న భవనాలను ఖాస్ మహల్‌గా పిలుస్తారు. ఇవన్నీ రాజూ, రాణిలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసినవి. దీనికి మధ్యలో అక్బర్కోసం నిర్మించిన పడకగదిలో మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో మంచె నిర్మించి ఉంది. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. నలువైపులా పొడవాటి నీటితొట్టెల ఏర్పాటు ఉంది. అందులో సుగంధద్రవ్యాలను కలిపేవారట. ఇక్కడే రాణుల కోసం విడివిడిగా భవనాలూ వంటగదీ స్నానపుగదులూ ఉన్నాయి. జోధాబాయి భవనం అలంకరణ హిందూ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. బులంద్ దర్వాజా, జమా మసీదు, సలీం చిష్టీ సమాధి, దివాన్-ఐ-ఆం వంటి పలు నిర్మాణాలను ఇండో-పర్షియన్ నిర్మాణ శైలిలో రూపొందించారు.
వేసవి కాలంలో ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు భవన సముదాయం మధ్యలో నీటి సరస్సులను ఏర్పాటుచేయడం వీరి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చు తునక. అందులోభాగంగానే ఖాస్మహల్ ప్రాంతంలో చార్ చమన్ పేరిట ఓ నీటి సరస్సును ఏర్పాటుచేశారు. సరస్సు మధ్యలోకి రావడానికి నలువైపుల నుంచీ దారులు ఉన్నాయి. మధ్యలో ఓ వేదిక ఉంది. తాన్సేన్ ఈ వేదికమీద కూర్చునే రాజకుటుంబీకులను సంగీత రసాంబుధిలో ఓలలాడించేవాడట. 1986లో దీనికి యునెస్కో గుర్తింపునిచ్చింది
ఆగ్రాకోట : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉంది. దీనిని రెడ్ ఇసుక రాతితో నిర్మించడం వల్ల రెడ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ కోట నిర్మాణ శైలి పర్షియా, ఇండియా శిల్పకళాశైలి కలిగి ఉంటుంది. ఈ కోటలో ప్యాలెస్‌లు, టవర్స్, మసీదులు ఉన్నాయి. క్రీ.శ 16, 18 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గంభీరమైన కోటకు లాహౌర్ ద్వారం, ఢిల్లీ ద్వారం అనే రెండు ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి. దీనికి యునెస్కో 2007లో వారసత్వ హౌదా ఇచ్చింది.
అజంతా గుహలు : ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలు పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉంటాయి. 1819లో జాన్‌స్మిత్ అనే బ్రిటీషు అధికారి వీటిని గుర్తించాడు. ఇక్కడ మొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలను ఎక్కడి నుంచైతే చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింటుగా చెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకు గల దారి గుర్రపు నాడాలా సన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి. ఇవి అద్భుతమైమ బౌద్ధ మత కళాఖండాలతో గొప్ప గుర్తింపును పొందాయి. పెయింటింగులతో నిండి ఉండే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గుహల పైకప్పు, పక్కభాగాలలో బుద్ధుని జీవిత విషయాలను చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విషయాలను వర్ణించే చిత్రాలు ఉంటాయి.
రెండో గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రించారు. దాని పైకప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో బాగుంటుంది. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు వంటి వాటిని కూడా చిత్రించారు. 16వ నెంబరు గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2-7 శతాబ్దాల మధ్య కాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1983లో ఈ గుహలు గుర్తింపు పొందాయి.
ఎల్లోరా గుహలు : ఎల్లోరా గుహలను రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారు. ఔరంగాబాద్‌కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి ఆ తరువాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారట. ఇక్కడ మొత్తం 34 గుహలుంటాయి.
సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చనీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లో జైనుల గుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్ సైట్లుగా కూడా గుర్తించింది. 10వ గుహ రెండతస్థులుగా నిర్మించారు. ఇందులో ఎక్కువగా నగిషీలు చెక్కబడి ఉన్నాయి. ఇవి రాతితో చెక్కిన వాటిలా వుండవు. పోతపోసిన అచ్చుల్లా ఉంటాయి. దీని లోపల పై కప్పు భాగమంతా అనేక ఆర్చీలు పక్కపక్కన పేర్చినట్లుంటుంది. స్థంభాల పై భాగంలో అనేక మానవాకృతిలో శిల్పాలు చెక్కారు. ఈ గుహలోని బుద్ధుడి వెనుక బౌద్ధ స్థూపం -కూడా ఉంది. విశ్వకర్మకి బౌద్ధమతానికి ఎటువంటి సంబంధమూ లేకపోయినా ఆయనమీద గౌరవంతోనే శిల్పులు ఈ గుహని ఆయనకి అంకితం చేశారట. అయితే వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఎల్లోరా గుహలు కూడా 1983లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి.
రామప్ప దేవాలయం : రామప్ప వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు.
ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు, తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ప్రఖ్యాతిగాంచింది. కాకతీయుల పాలన శిల్పకళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు న్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మిం చారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు.
రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది.
ఎలాంటి పునాదులు లేకుండానే పూర్తిగా ఇసుకరాయిని ఉపయోగించి చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనం. కాలానికి అతీతంగా ఈ ఆలయం నేటికి చెక్కుచెదరకుండా సజీవకళతో ఉండటం నిజంగా ఓ ఆశ్చర్యం.
ప్రపంచ దేశాలోని ఎన్నో చారిత్రక కట్టడాలతో పోటీ పడి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. కాకతీయుల శిల్ప కళ ఉట్టిపడే ఈ ప్రాచీన ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. 2020 ఏడాదికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది.