Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చరిత్రలో రాజులు, రాజ్యాలు, రాజకీయాలు, యుద్ధాలు, రాజ్యాల ఆక్రమణలు, వీటి మధ్య కాలం నిలిచిపోకుండా ప్రాచీన యుగంనుండి మధ్యయుగంలోకి అడుగు పెట్టింది భరతఖండం. సుమారు క్రీ.శ. 5వ శతాబ్దం వరకూ ప్రాచీన యుగంగా లెక్కకడితే ఆపై శతాబ్దాలు మధ్యయుగంగా లెక్క చూడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే క్రీ.శ. 5వ శతాబ్దాం వరకూ కొండ రాతి గుహలు తవ్వి, అందులో శిల్పాలు చెక్కి, దైవారాధన కోసం కళా స్థావరాలు నిర్మించారు. ఆపై శతాబ్దాలలో 8వ శతాబ్దం వరకూ రాతి గుహలు కళాస్థావరాలుగా చెక్కడం కన్పించినా, క్రీ.శ. 5వ శతాబ్దం నుండే మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఉత్తర భారతంలోని దేవఘర్ ప్రదేశంలోని దశావతార మందిరం గురించి మనం మాట్లాడింది ఆ విషయమే.
క్రీ.శే. ఆనందకుమార స్వామి అనే ఒక మాననీయ కళాచరిత్రకారుడు చెప్పిన ప్రకారం భారతదేశంలో సుమారు 1200 గుహలు చెక్కితే అందులో 900 బౌద్థ ఆరామాలు, 200 జైన గుహలు, 100 హైందవ గుహలు చెక్కబడినట్లుగా ఒక సుమారు లెక్క చెప్పారు. బౌద్ధులు మత ప్రచారం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు, బౌద్ధ మత భిక్కుల అవసరార్థం బౌద్ధ ఆరామాలు చెక్కడం జరిగి వుండవచ్చు. బౌద్ధం ఆనాడు మిగిలిన అన్ని మతాలపై ఆధిక్యతతో ఒక ప్రణాళికలా ప్రచారం చేసి వుండవచ్చు. అయితే తెలుగు ప్రాంతాలు ఈ సుమారు కథకు విరుద్ధంగా మరో కథ చూపాయి. తెలుగు ప్రాంతాలు చరిత్ర కాలం అనగానే శాతవాహనుల పేరు, అక్కడి బౌద్ధమతం గురించే అందరికీ గుర్తుకు వస్తుంది. అలాగే అమరావతి స్థూపం, నాగార్జున కొండ స్థూపం గురించి, ఆనాటి బౌద్ధమత ప్రాముఖ్యం గురించీ మాట్లాడుతాం. అయితే మన తెలుగు పురాతత్వ శాస్త్రజ్ఞులు కొన్ని కొత్త విషయాలు బయటకు తీశారు. తెలుగు ప్రాంతంలో, ప్రాచీనకాలంలో బౌద్ధమే కాదు, హైందవ మత సాంప్రదాయం కూడా అంతే ముఖ్యంగా వుండింది. అలాగే క్రీ.పూ. శతాబ్దాలకే ఇక్కడి ఇటుకలతో మందిర నిర్మాణం జరిగిందని తెలుస్తుంది.
చిత్తూరు మండలం కాళహస్తి తాలూకాలోని గుడిమల్లం లేదా గుడిపల్లంలోని పరశురామేశ్వరుడు అనే ఈశ్వర ఆలయం, ఈ పైని కొత్త విషయాలు చూపిస్తూ, పాత విషయాలను సవాలు చేసింది. 1903లో రావు బహదూర్ వెంకయ్య ఇక్కడ ఈ మందిరం ఒకటుందని కనుకొన్నాడు. ఆపై పురాతత్వ శాస్త్ర విభాగం 1914లో దీని మరమత్తు విషయంగా ఆలోచించి, 1963లో దీనిని జాగ్రత్త పరచవలసిన స్థలంగా, దేశ ఖజానాగా భద్రపరచాలని నిర్ణయించింది. 1914లో గోపీనాథరావు మొదటగా ఈ మందిరం గురించి రాశాడు. ఆపై 1973లో ఐ.కె.శర్మ అనే పురాతత్వ శాస్త్రవేత్త చేతుల మీదుగా జరిగిన తవ్వకాలలో కొన్ని ముఖ్య విషయాలు బయటపడ్డాయి. అక్కడ దగ్గరలోని స్వర్ణముఖి నది ఒడ్డుల్లో రాతియుగపు మట్టి కుండల ఆనవాళ్ళు దొరికాయి.
దట్టంగా పెరిగిన అడవిలా చెట్లు, ఆ మందిరం కప్పులోకి కూడా చొచ్చుకుపోయిన చెట్లని నరికితే అక్కడ 3 మీటర్ల ఎత్తున్న ఇటుకలతో కట్టిన ప్రాకారం కనిపించింది. పురాతన కాలపు ఇటుకలు చాలా పెద్దవిగా వుండేవి. అలాంటి పెద్ద ఇటుకల పునాదులవి. వాటి ఆకారాన్ని బట్టి ఆ మందిరం సుమారు క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి క్రీ.శ. 3వ శతాబ్దం మధ్య కట్టబడిందని ఊహించారు. అలా అక్కడ ప్రతిష్టించిన లింగం కూడా పాత కాలం నాటిదే అని, అలా అక్కడ ప్రాచీన కాలంలోనే మందిర నిర్మాణం జరిగిందనీ చెప్పారు. అలాగే అవునూ, కాదూ అనే మరి కొందరి శాస్త్రజ్ఞుల వాదనలూ లేకపోలేదు. ఏది ఏమైనా, ఈ గుడిమల్లం మందిరం, దీని పురాతన కట్టడం, మన దేశ కళాచరిత్రలో మరో ఆలోచనలు, సిద్ధాంతాలను వెలికితీసింది. ఈ మందిరం ఎన్నో శతాబ్దాలపాటు దైవారాధనలోనే ఉండేదట.
గుడిమల్లం గుడిలోని లింగం, ముదురు మట్టి రంగు రాయిలా చెక్కబడింది. ఈ రాయి తిరుపతి కొండల మీద దొరికే రాయే. దీనికి కొంత పెళపెళమనే గుణం వున్నా గట్టి రాయి. చక్కటి నునుపు శిల్పం చెక్కవచ్చు. ఈ లింగం యోనిపీఠం మొత్తం పొడవు 1.60 మీటర్లు వుంటుంది. కానీ పైకి 1.54 మీటర్లు మటుకే కనిపిస్తుంది. ఈ లింగాకారం పూర్తిగా పురుషాంగం ఆకారంలో చెక్కబడింది. ఈ లింగానికి ముందు వైపు శివుడి రూపం చెక్కబడింది. ఈ శివరూపం ముందు వైపు 80.సెం.మీ. లోతుగా చెక్కబడి, 46 సెం.మీ ఎత్తు వున్న ఒక మరగుజ్జు రూపం యొక్క మనిషి ఆకారం భుజాలపై నిల్చుని వుంటాడు శివుడు. ఈ మరగుజ్జు రూపం 'గణ' రూపంగా గుర్తించారు. గణరూపాలు చిన్నచిన్న దేవుడి రూపాలు. ఈ లింగం, రెండు వలయాకారాలు ఒకటి 76 సెం.మీ, మరొకటి 54 సెంమీ మధ్య బిగించి నిలబెట్టబడింది. ఈ రెండు వలయాలు, వలయాకార రాతితో పేర్చబడి, లింగం పట్టు నిలబెట్టటంతో పాటు, యోనిపీఠంలాగా కూడా పేర్చబడ్డాయి. మొదటికాలంలో అభిషేకం చేసిన నీరు పారే ప్రణాళికలు నిర్మించేవారు కాదు. అది తరువాతి శతాబ్దాలలో తీసుకువచ్చిన మార్పులు, చేర్పులవి. ఇక్కడ కూడా గుడిమల్లం గుడిలో మొదట కింద కట్టిన పీఠంలో నీరు పారే ప్రణాళిక లింగం పీఠంలో లేదు. తరువాత 8వ శతాబ్దం తరువాత చతురస్ర పీఠం అమర్చినప్పుడు మార్పులు చేయబడ్డాయి.
ఇక్కడ వున్న శివుడు పరశురామేశ్వరుడు. అంటే విష్ణువు దశావతారాలలోని పరశురాముడు కాదు. ఇక్కడ లింగం మధ్యలో శివుడు పాశపతశైవ సిద్ధాంతంలో ప్రతిష్ఠించిన శివుడు. ఈతని చేతిలో పరశుఅంటే గొడ్డలి పట్టి వుండగా, రామ అంటే నల్లని వాడు అనీనట. ఈ శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో పూర్తి వివరాలు లేవని ఐ.కె.శర్మగారు రాశారు. ఈ శివుడి లింగాకారాన్ని లకులీశ శివ అని కూడా అంటారు. చేతిలో దండం వంటి ఆయుధం పట్టి, మానవ ఆకారం వున్న శివుడిని లకులీస శివలింగం అని కూడా అంటారు. ఈ శివుడు సమపొద స్థానంలో నిల్చుని వున్నాడు. ఈయనకు రెండు చేతులే చెక్క బడ్డాయి. ఇలా రెండే చేతులు చెక్కిన శివ రూపం వలన కూడా ఈ శివలింగ రూపం పురాతనయైనదని తెలుపుతుంది. మొదట శివరూపాలు రెండే చేతులతో చూపేవారు. ఇది రుద్రరూపం. రుద్రరూపాలు ముదురు మట్టి రంగులలోనూ చెక్కుతారు. కుడి చేతిలో ఒక మేక పట్టుకుని వుంటాడు ఈ శివుడు. ఆ మేక తల క్రిందకు వేలాడుతుండగా, వెనుక కాళ్ళు అతని చేతిలో వున్న చనిపోయిన మేక ఇది. చూపుడు వేలు, చిటికెన వేలు వదిలివేసి బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలుతో ఆ చనిపోయిన మేకని పట్టుకుని వుంటాడు. అంటే దాని అర్థం ఈ మేక బలి ఇవ్వబడిన మేక. అంటే ఈ శిల్పం చెక్కిన కాలం జంతుబలి జరుగుతున్న రోజులు. శివుడి ఎడమ చేతిలో ఒక నీటి కుండ, ఆజ్యపాత్ర వుంటుంది. పరశు లేదా దండం వున్న గొడ్డలి ఎడమ భుజాన్ని ఆనుకుని వుంటుంది. బహుశా మొగలి రేకుతో ఆ గొడ్డలి శరీరానికి కట్టి వుంది. ఈ దండాన్ని ఎన్.పి.జోషి గారు బిల్వదండం లేదా మారేడు కొమ్మతో చేసిన దండంగా చెపుతారు. ఈ లక్షణాలన్నీ వైదిక సంప్రదాయ అగ్ని - రుద్రుడి రూప వివరణలు.
అతని తలకట్టు గురించిన వివరాలు చాలామంది మాట్లాడారు. ఇది ఒక వింతలాగ కూడా కనిపిస్తుంది. శివుడి తలకట్టు జడలుగా అన్ని చోట్లా వున్నా ఇక్కడ జుట్టంతా ఒక కట్టలాగా కట్టినట్టు వుంటుంది. వుంగరాల జుట్టుని జడలల్లి మొగలిపువ్వుతో తలపాగాలా కట్టినట్టు శిల్పం చెక్కారు. ఈ పువ్వు శివుడికి చాలా ప్రీతికరం. అందులో నాగసర్పాలు వుంటాయి. సర్పం శివుడి కంఠాభరణం. శివుడి తలపై చంద్రవంక కూడా లేత మొగలి పూవు రేకుకు మల్లేనే చెక్కారట శిల్పులు. పురాణాల ప్రకారం మొగలి పూవు శివుడి తలని అలంకరించింది.
ఒకసారి బ్రహ్మకి, విష్ణుమూర్తికి వాదన జరిగి, వారిద్దరూ శివలింగం యొక్క ఆది, అంతం చూడాలని, విష్ణువు, వరాహరూపంలో లింగం మొదలు తవ్వుతూ కిందకి వెళితే, బ్రహ్మ హంస రూపంలో ఎగిరి శివలింగం యొక్క శిరస్సు భాగం చూడటానికి బయలు దేరారట. ఎంత ప్రయాణించినా ఎవరికీ ఏమీ దొరకలేదట. శివుడి తల మీద అలంకరించిన మొగలి పువ్వు రేకు ఎంత పొడవుండేదంటే, ఆ రేకు కిందకు వేలాడుతుంటే, హంస రూపంలోని బ్రహ్మ 'నీవెవరు' అని అడిగాడట. అప్పుడు మొగలిపూవు నేను శివుడి తలని అలంకరిస్తానని, అక్కడి నుండే వేలాడుతున్నానని చెప్పిందట. ఎంత ఎగిరినా దొరకని శిరస్సు ఆనవాలు విన్న బ్రహ్మదేవుడు మొగలిపూవుతో చెప్పాడట. తను శివుడి శిరస్సు చూశానని విష్ణువుతో చెప్పమని, ఆ మొగలిపూవు కొస పట్టుకుని విష్ణువుకి తను శిరస్సు చూశానని అబద్దమాడాడట బ్రహ్మ. ఆ విషయం తెలిసిన విష్ణువు ఇద్దరికీ శాపం పెట్టాడట. అందువలనే మొగలిపూవు పూజకు పనికిరాదనీ, బ్రహ్మకు గుడులు లేవని ఒక నానుడి.
ఈ పరశురామేశ్వరుడి తలకట్టు పాయల తలకట్టుతో అగ్నిపూపంలా, అగ్ని - రుద్రుడనే పేరుకు సార్థకంలా వుంటుంది. ఈ శిల్పం అంతే నునుపుగా అందంగా చెక్కబడింది. తలకట్టు కూడా అంతే నేర్పుగా చెక్కబడింది. కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు, ముక్కుపుటాలు, గుండ్రటి బుగ్గలు, కొసతేలిన గడ్డం, మందమైన పెదాలు, ఈ శిల్పం బలమైన యువకుడి రూపం ఇది. కళ్ళు సగం తెరవబడి ధ్యానంలో ముక్కుపైకి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందువలన ఇది విరూపాక్షి రూపం అని కూడా అనవచ్చు. చెవులకు కుండలాంటి వేలాడుతున్న కుండలాలతో పాటూ మెడలో వున్న కంఠాభరణం క్రీ.పూ. 2వ శతాబ్దంపు బారూత్ శిల్పాలను గుర్తుతెస్తుంది. అలాగే భుజంపై యజ్ఞోపవీతం లేక పోవడం కూడా ఒక గుర్తుగా గోపీనాథరావు ఇది పురాతన చెక్కడంలోని సంప్రదాయంగా వివరించారు ఈ కారణాలు కూడా ఈ గుడి, ఈ శివలింగానికి పురాతన గుర్తు, తారీఖు ఇవ్వబడ్డాయి. చేతులకు బాహుబంధు, కంకణాలు కూడా అందంగా చెక్కబడ్డాయి. వస్త్రం, ఆ వస్త్రం ముడతలు చెక్కిన తీరు, మేఖల బంధం (ఒడ్డాణం) చెక్కడం ఇవి కూడా బారూత్ - అమరావతి నాటి క్రీ.పూ. తారీఖునే ఖాయం చేస్తాయి. శివుడు ఇక్కడ భూతానాధిపతి శివ, ఒక 'గణ' రూపం మీద నిల్చున్న దేవ వాహన శివుడు. భుజాల మీద శివుడిని మోస్తున్న ఈ మరగుజ్జు, మోకాళ్ళ మీద కూర్చుని, పిరుదులపై చేతులుంచి, పళ్ళు బిగపట్టి, ముఖం బిగించి బరువు ఆపుతుంటాడు. ఈ గణరూపం ఆనవాలు కూడా క్రీ.పూ. 2వ శతాబ్దపు శిల్పాలతో పోలిక చూపిస్తుంది. గుడిమల్లం శివుడు, పంచరాత్ర పాశుపత శైవ పద్ధతికి చెందినరూపం. ఈ మార్గశైవం క్రీ.పూ. శతాబ్దాలలో వుండేది. మొత్తం మీద ఈ గుడి మల్లుడు భారతీయ చరిత్రకారులకు కొత్త పాఠాలు నేర్పాడు. ఆనాటికే గుడి కట్టడం, చక్కటి గుండ్రటి శిల్పం చెక్కడం, బౌద్ధం ఒక్కటే కాదు, హిందూధర్మమూ ప్రాముఖ్యత వహించిందని తెలిపాడు.
- డా||ఎం.బాలామణి,
8106713356