Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాసు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివిగలవాడే కానీ వాసులో ఒక అవలక్షణం వుంది. ఏడాదంతా ఆటపాటల్లో గడిపి, తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక పుస్తకాలు ముందు పెట్టుకుని అన్నీ ఒక్కసారి చదవలేక గందరగోళానికి గురవుతుంటాడు. జనవరిలో పండగ సెలవులయాక బడి తెరిచిన రోజు సాయంత్రం ఇకనుంచయినా వాసుని బాగా చదివించాలనుకుని అతని తల్లి వసుంధర. ''సంవత్సర పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. కాలం వధా చేయకుండా చదవాలి వాసు'' అన్నది
''ఇంకా మూడు నెలలు సమయం వుంది కదమ్మా, చదువుతానులే, హడావుడి పెట్టకమ్మా'' అన్నాడు వాసు తల్లితో.
'వీడెప్పుడూ ఇంతే, ఏ పనయినా వాయిదాలు వేస్తుంటాడు. తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక నానా హైరానా పడిపొతాడు. అంతా ఒకసారి చదవలేక. చదివినా గుర్తుండక. తాను కంగారు పడిపోయి ఇంట్లో అందరినీ కంగారు పెట్టేస్తాడు. ముందు నుంచి కొంత కొంత చదువుకుంటూ వుంటే తేలిగ్గా వుంటుంది. అంతా ఒక్కసారి చదవాలంటే కష్టం. పైపెచ్చు జ్ఞాపకమూ వుండదని ఎన్ని సార్లు చెప్పినా వాసుకి అర్థం కాదు. వాడి తీరు మారదు. ఎలా చేయాలో ఏమిటో' అనుకుంటూ వంటింట్లోకి నడిచింది వసుంధర.
అంతలో వాసు తండ్రి రామ్మూర్తి, ''వసుంధరా! అలా బయటికి వెళ్ళొస్తాను. ఏమైనా కావాలా? వచ్చేటప్పుడు తెస్తాను'' అన్నాడు.
''బియ్యం నిండుకున్నాయండి. మీ పనులయి వచ్చేటప్పుడు ఒక బస్తా బియ్యం తీసుకురండి. నెలకు సరిపోతాయి'' అంది.
సరేనని రామ్మూర్తి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు బస్తా ధాన్యం ఆటోలో తెచ్చాడు. ఆటోవాడు బియ్యం బస్తా తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. రామ్మూర్తి స్నానం చేయడానికి వెళ్ళాడు. హాల్లో పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చున్నాడు వాసు. వాసుని చదివించాలని వసుంధర కొడుకు పక్కనే సోఫాలో కూర్చున్నది. ''ఏమిటో వాసూ! రోజూ వంట చేయాలంటే బద్దకంగా వుంటున్నది. విసుగుగా కూడ అన్పిస్తున్నది. ఇప్పుడు తెచ్చిన బస్తాబియ్యం ఒక్కసారి వండేసి, తినేసి నెలరోజులు ఆకలి లేకుండా వుంటే బలే వుంటుందనిపిస్తోంది. నెల అంతా వంట లేకుండా వుండొచ్చు'' అన్నది.
దానికి వాసు ''అదేమిటమ్మా అలా అంటున్నావు. బస్తాబియ్యం ఒక్కసారి ఎలా తింటాం? కడుపు పట్టొద్దూ'' అన్నాడు.
''నువ్వు అనేది కూడ అదే కదరా! పరీక్షలముందే పుస్తకాలన్నీ చదివేసి పరీక్షలు రాయగలనంటున్నావు గదా. అన్ని పుస్తకాల్లోని విషయం ఒక్కసారి బుర్రలో పట్టించగలనని ధీమా నీకుంది గదా! అలానే యిది కూడా జరగగలిగితే నాకు పని భారం తగ్గి సుఖపడతాను'' అన్నది.
''అమ్మా అది వీలయ్యే పని కాదని నాకనిపిస్తోంది'' అన్నాడు వాసు.
''నాకు కూడ నువు చెప్పేది వీలు కాదనిపిస్తోంది. పరీక్షలముందే అంతా చదివి బుర్రకెక్కించుకోవాలంటే అయ్యేపని కాదు. రోజూ కొంత కొంత చదివి గుర్తుపెట్టుకోవాలి. అలానే కొంత కొంత తింటూ ఆకలి తీర్చుకోవాలి గాని, ఒకేసారి తిని ఆకలి కొంత కాలం పాటు లేకుండా చేసుకోవాలంటే వీలుకాదు'' అంది వసుంధర.
తనలో మార్పు తీసుకరావడానికే తల్లి అలామాట్లాడిందని వాసుకి అర్థయింది. బాగా ఆలోచించి, గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. తరువాత ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటూ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాడు వాసు.
- డా||గంగిశెట్టి శివకుమార్