Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన తెలుగు నాటకం వికాసానికి మూడు ప్రధాన స్రవంతులు దోహదపడ్డాయని పరిశోథకులు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ తెలిపారు. 20వ శతాబ్దం ప్రధానంగా పద్య నాటకానిదే అని డా||సి.నారాయణరెడ్డి పేర్కొన్నా, ఆ శతాబ్దంలో ఈ మూడు ప్రధాన స్రవంతులు ప్రవేశించడం గమనార్హం.
బళ్ళారి రాఘవ లండన్ వెళ్ళి బెర్నార్డ్‌షా వంటి ప్రముఖుల ఎదుట షేక్స్ఫియర్ నాటకాలు ప్రదర్శించి ప్రశంసలు చూరగొని, అక్కడి నాటకాలను నిశితంగా పరిశీలించిన మీదట మన తెలుగు నాటక అభివృద్ధికి మూడు ముఖ్య సూచనలు చేశాడు.
1. నాటకాల్లో స్త్రీల పాత్రలు స్త్రీలే ధరించాలి. అప్పటి వరకూ నాటకాల్లో మహిళల పాత్రలను పురుషులే ధరించారు. పద్మశ్రీ స్థానం నరసింహారావు, రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రిలు స్త్రీల పాత్రలకు ప్రతీతి అనే విషయం చెప్పక్కర్లేదు కదా. సాంఘిక నాటకాల్లో స్త్రీ పాత్రలేని నాటిక, నాటకాలు వందల సంఖ్యలో ముద్రితమైనాయి. వేల సంఖ్యల్లో దశాబ్దాల కాలం ప్రదర్శితమైనాయి. నాటకాల్లో విభిన్న పాత్రలు ధరించే స్త్రీలను ఇప్పటికీ చులకనగా చూసే గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ ఫ్యూడల్ అవశేషాలు ఇంకా పోలేదు మరి.
2. పౌరాణిక, పద్య నాటకాల కన్నా సాంఘిక నాటకాలు మిన్న అని ఆంధ్ర నాటక కళాపరిషత్ వేదికపై ఢంకా భజాయించారు రాఘవ. అప్పటి నుండి సామాజిక చైతన్యం ఇతివృత్తం కలిగిన సాంఘిక నాటికలు, నాటకాలు ఔత్సాహిక కళాకారులకు ఇతివృత్తాలయ్యాయి. వృత్తినాటకం కన్నా ఔత్సాహిక నాటకం పెద్ద ఎత్తున విస్తరించడానికి ఈ పరిషత్ పోటీ దోహద పడింది.
3. వివిధ రంగాలకు ఎలా విద్యాలయాలు, శిక్షణాలయాలు వుంటాయో, అలానే నాటక రంగానికి విద్యాలయాలు, శిక్షణాలయాలు వుండటం అవశ్యం అని తెలిపారు. ఆ క్రమంలో తొలుత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాటక శిక్షణా విభాగం (థియేటర్ ఆర్ట్స్ ట్రైనింగ్) ఏర్పడింది. అనంతరం ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, తెలుగు విశ్వవిద్యాలయంలో, నిజాం కాలేజీలో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ ఏర్పడి విద్యార్థులకు శిక్షణనిస్తున్నాయి.
ఆంధ్రనాటక కళాపరిషత్, నట శిక్షణా విభాగంతో తెలుగు నాటక వికాసానికి మూడవ స్రవంతిగా దోహద పడింది ఆంధ్ర ప్రజానాట్యమండలి అని శర్మగారు వివరించారు.
నాటక రంగ వికాసానికి బళ్ళారి రాఘవ ప్రతిపాదించిన మూడు సూత్రాలను ఆచరణలో పెట్టడానికి త్రికరణశుద్దిగా పని చేసింది ప్రజానాట్యమండలి.
స్త్రీ పాత్రలు స్త్రీలు ధరించేలా దీక్ష వహించింది. కమ్యూనిస్టు కార్యకర్తల కుటుంబ స్త్రీలు రంగంలోకి దిగి 'మా భూమి, ముందడుగు' వంటి నాటకాలను రక్తి కట్టించారు. ఆ నాటక ఇతివృత్తాలు కూడా ప్రజా పోరాటాలకు సంబంధించినవి గనుక, పోరాట చైతన్యంలో భాగంగానే ఆ స్త్రీలు అలా రంగ ప్రవేశం చేశారు. నాటకరంగం లోని స్త్రీలకు అలా గౌరవమూ, ఆదరణ లభించడానికి కారకురాలయింది ప్రజానాట్యమండలి.
ప్రజానాటకాలు ఎలా రూపొందించుకోవాలనే సంకల్పంలో డా||గరికపాటి రాజారావు, కోడూరి అచ్చయ్య వంటి వారి దిగ్గజాలతో ప్రజానాట్యమండలి వర్క్‌షాప్‌లు, శిక్షణా శిబిరాలు నడిచేవి. అందుకే శర్మగారు 1980 దశకంలో ఓ సారి ఇలా అన్నారు... ''తెలుగు నాటక రంగంలో ఇప్పుడు వస్తున్న ప్రయోగాలన్నీ 40 ఏళ్ళ క్రిందటే రాజారావులు, అచ్చయ్యలు చేశార''ని. వారి సామాజిక దూరదృష్టి, ప్రయోగ వ్యామోహం అలా వుండేది మరి.
అప్పటి నుండి ఇప్పటికీ ప్రజాకళాకారులు, ప్రజానాట్యమండలిలు ఎన్నిగా చీలిపోయినప్పటికీ నాటక వర్క్‌షాప్‌లు, శిక్షణలు మరువడం లేదు. రాజకీయ, సామాజిక పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడల్లా వారు ఆ శిక్షణల్లో రాటు దేలుతూ ప్రజల ముందుకొస్తూనే వున్నారు. సద్దార్ హష్మీ రూపొందించిన ఆధునిక వీధినాటిక కూడా అలా ప్రజాపోరాటాల్లో మమేకం అవుతున్నది. ఆ ప్రక్రియే ఓ నాటక శిక్షణగా రూపొందటాన్ని కాదనలేం. ప్రాచీన వీధి నాటకం నుండి ఈ ఆధునిక వీధి నాటకం వరకూ మన తెలుగు నాటకానిదో అద్భుత పరిణామం, వికాసం. వాటిని గ్రంథస్థం చేయడంతో పాటు తెలుగు వారికి ఓ స్థిరమైన ప్రత్యేక నాటక విద్యాలయం ఏర్పాటు చేయడం ఎంతైనా అవశ్యం.
(నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం)
- కె.శాంతారావు, 9959745723