Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ తీగ పువ్వునో.. ఏ కొమ్మ తేటినో..''
''బలే బలే మగాడివివోరు..''
''కలిసి ఉంటే కలదు సుఖము...''
''పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే...''
1978లో బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన మరో చరిత్ర సినిమాలోని పాటలివి. కలకాలం నిలిచిపోయిన ఈ పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన విషాదాంత ప్రేమకథా చిత్రం 'మరో చరిత్ర'. ఇందులో కమల్ హాసన్, సరిత ప్రధాన పాత్రలు పోషించగా, మాధవి కీలక పాత్రలో నటించారు. అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీరంగంలో కమల్ హాసన్, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. 'మరోచరిత్ర' పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరించబడింది. వైజాగ్ బీచ్, భీమిలీ, గాజువాక మొదలైన ప్రాంతాల అందాలను మనకు చూపించిన మొదటి పూర్తి నిడివి సినిమా ఇదే. నెగిటివ్ క్లైమాక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలయ్యి మే 19 నాటికి 45 వసంతాలు అవుతున్న సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
ఆండాళ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'మరో చరిత్ర'. ఈ సంస్థ మొదటి సినిమా బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అంతులేని కథ' సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ బ్యానర్లోనే ఇంకొక సినిమా చేద్దాం అని బాలచందర్ అనుకున్నారు. అయితే ఈసారి తమిళ్ రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని, అది మంచి లవ్‌స్టోరీతో అందరూ మెచ్చే సినిమా తీయాలని. దానికి సంబంధించి మంచి కథను కూడా అనుకున్నారు. రచయిత గణేష్ పాత్ర మంచి కథతో పాటు ఈ సినిమాకి టైటిల్ ని కూడా అందించారు. మొదట గణేష్ ఒక పత్రికలో రాసిన సీరియల్ పేరు 'మరో ప్రేమకథ' పేరు పెడదాం అనుకున్నారు. దానికి బాలచందర్ కూడా ఓకే చేసినప్పటికీ, ఆ తర్వాత కొంతమంది ఈ కథ వింటుంటే ఇందులో చరిత్ర అనే పదం వస్తే బావుంటుంది అని అనడంతో మరో ప్రేమ చరిత్ర అని పెట్టారు. అయితే ప్రేమ అని టైటిల్ ఉంటె ప్రేక్షకులకి లవ్ స్టోరీ అని తెలిసిపోయి అంత కిక్కు వుండదనుకొని కేవలం 'మరో చరిత్ర' అని పెట్టారు. అలా ఈ చిత్రానికి 'మరో చరిత్ర' టైటిల్ పైనల్ అయ్యింది.
మరో చరిత్ర కథ
విశాఖపట్నం ఉమెన్స్ కాలేజీలో స్వప్న (సరిత) చదువుకుంటుంటుంది. బాలు (కమల్ హాసన్) ఉద్యోగం మానేసి మద్రాస్ నుండి విశాఖపట్నంలో ఉన్న తల్లితండ్రుల దగ్గరికి వస్తాడు. స్వప్న, బాలులవీ పక్కపక్క ఇళ్లు. బాలుది తమిళ బ్రాహ్మణ ఫ్యామిలీ. స్వప్నది తెలుగు ఫ్యామిలీ. విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి వచ్చిన బాలు పక్కింటి అమ్మాయి స్వప్నతో ప్రేమలో పడతాడు. వారు పూర్తిగా భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చిన వారు కావడంతో వచ్చీరాని తెలుగుతో బాలు, స్వప్నల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. ఇదే సమయంలో స్వప్నపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్ వీరి ప్రేమ వ్యవహారాన్ని స్వప్న తల్లితండ్రులకు చేరవేస్తాడు. దీంతో ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. దాంతో ఇంటి ఓనర్ జగన్నాథం జోక్యంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఇద్దరూ ఒక ఊర్లోనే ఉండకుండా, ఉత్తరాలు కూడా రాసుకోకుండా ఉండమనీ, తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు షరతు పెడతారు. ఈ షరతులకు ఇద్దరూ అంగీకరిస్తారు.
ఆ వెంటనే బాలు విశాఖపట్నం నుండి హైదరాబాదు వెళతాడు. అక్కడ బాలుకి యంగ్ విడో అయిన డ్యాన్సర్ (మాధవి) తో పరిచయమవుతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి బాలుకి తెలుగుతో పాటు డాన్స్ నేర్పిస్తుంది. విశాఖలో స్వప్నకు బావ టార్చర్ మొదలవుతుంది. బాలు ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసి, తన తమ్ముడుకి ఇచ్చి పెళ్లి చేసేందుకు స్వప్న తల్లే అతన్ని రప్పిస్తుంది. స్వప్నకు ఈ సమస్యతో పాటు మరో సమస్య.. అమెపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్ వేదింపులు. రోజులు గడుస్తున్నాయి. బాలు, స్వప్నల ప్రేమకు ఒక్కోరోజు ఒక్కో పరీక్ష ఎదురౌతోంది. జూలాజికల్ విహారయాత్ర కోసం వైజాగ్ నుండి స్వప్న, ఆఫీస్ పనిపై హైదరాబాద్ నుండి బాలు కాకినాడ వెళ్ళి ఓ రెస్టారెంట్లో దిగుతారు. అయితే అక్కడ ఇద్దరివీ పక్కపక్క గదులు కావడంతో స్వప్నను కలిసేందుకు బాలు ఓడిపోయినంత పని చేస్తాడు. స్వప్నకు తెలీకుండా ఫాలో అయి వచ్చిన బావని చూసి, తనపై నిఘా పెట్టినందుకు తల్లిని తిట్టుకుంటుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. స్వప్నను చూడకుండా ఉండలేక ఆమె గదిలోకి వెళ్లిన బాలుకు స్వప్న బావ కనిపించి, త్వరలో తను స్వప్నను చేసుకుంటున్నట్లు చెపుతాడు. బాలు నమ్మి, కోపంతో వెళ్లిపోతాడు. ఆ కోపం మాధవి మీద ప్రేమగా మారుతుంది. ఈలోపు బాలు, మాధవి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళతారు. అక్కడ స్టాల్ పెట్టిన వైజాగ్ బుక్‌షాప్ ఓనర్ బాలుకి కనిపిస్తాడు. మాధవిని అనుమానంగా చూడడం గమనించి, నా కాబోయే భార్య అని చెప్తాడు బాలు. 'పెళ్లి చేసుకోవడం నాకూ చేతనౌను. వైజాగ్ వెళ్లి చెప్పండి' అంటాడు. బుక్‌షాప్ ఓనర్ నేరుగా వెళ్లి స్వప్నకు, ఆమె అమ్మానాన్నలకు చెప్పడంతో, స్వప్న షాక్ తిని పరుగున వెళ్లి 'బాలూ పెళ్లి చేసుకుంటున్నాడా..' అని బాలు తల్లిని అడుగుతుంది. నిజం కాదని తెలుసుకుని, గడువు తేదీ కోసం ఎదురు చూస్తోంది. హైదరాబాద్‌లో బాలు స్వప్నకు రోజుకో ఉత్తరం రాసి, పోస్ట్ చేయని వాటిని చూసిన మాధవి. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహిస్తుంది. వెంటనే వైజాగ్ వచ్చి స్వప్నకు బాలు ప్రేమ గురించి చెప్పి, స్వప్న పెళ్లి కూడా వట్టి మాటేనని తెలుసుకుంటుంది. తిరిగి హైదరాబాద్ వెళ్లి బాలును స్వప్న ఎంత గాఢంగా ప్రేమిస్తూ, బాలు రాక కోసం ఎదురు చూస్తుందో చెప్తుంది. ప్రింట్ అయిన తమ పెళ్లి కార్డులను పక్కన పడేసి, వెంటనే వెళ్లి సరితను కలుసుకొమ్మని బాలు చేతిలో ట్రైన్ టిక్కెట్ పెడుతుంది. తమ పెద్దలు విధించిన గడువు ఏడాది ముగియడంతో బాలు వైజాగ్ బయల్దేరుతాడు. అయితే మాధవి అన్న తన చెల్లెలిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోకుండా పోతున్నడన్న ఆగ్రహంతో బాలును చంపేందుకు విశాఖపట్నంలోని అప్పారావుకు ఫోన్ చేసి, చంపెరు అని చెపుతాడు. బాలు విశాఖపట్నం తిరిగి వస్తున్నందుకు, ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న... వాళ్ళు తరచూ కలుసుకునే కొండ మీద గుడి, లవ్స్పాట్కు ఒంటరిగా సైకిల్ మీద బయలుదేరుతుంది. ఎప్పటినుంచో ఆమె కోసం కాచుక్కూర్చున్న బుక్‌షాప్ ఓనర్ ఒంటరిగా వెళ్తున్న స్వప్నను వెంబడిస్తాడు, విశాఖ వెళ్ళిన బాలు స్వప్న వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె గుడికి వెళ్లిందని తెలుసుకుని బైక్‌పై బయల్దేరుతాడు. మాధవి అన్న చెప్పిన రౌడీలు బాలుని పాలో అవుతారు. గుడికి చేరుకున్న స్వప్నపై బుక్‌షాప్ ఓనర్ అత్యాచారం చేస్తాడు. బాలుని పాలో అయిన దుండగులు అతన్ని తీవ్రంగా గాయపరుస్తారు. అత్యాచారానికి గురైన స్వప్న, తీవ్రంగా గాయపడిన బాలు చావుబతుకుల మధ్య అక్కడ కలుసుకుంటారు. బాలు... బాలు.. ఇంతకాలం మనం విడిపోయింది మత్యువు ఒడిలో కలవడానికా? బాలూ ఇది జరక్కముందే నన్ను నీతో లేవదీసుకుపో బాలూ... అంటున్న స్వప్నను, బాలు రా.. స్వప్నా అంటూ ఇద్దరూ కొండపై నుంచి సముద్రంలో పడి మరణిస్తారు.
తమిళనాట ఘనవిజయం
1978లో విడుదలయిన ఈ చిత్రం కేవలం తెలుగులోనే తీశారు. అయితే దర్శకుడు బాలచందర్ ఈ సినిమా తెలుగులో భారీ విజయం దక్కించుకున్నాక తమిళ్లో రీమేక్ చేస్తాను అని భావించారు. కానీ, కమల్ హాసన్ దానికి అడ్డు చెప్పారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మద్య ఎక్కువగా తమిళ డైలాగ్స్ కూడా ఉండటం వల్ల మళీంళ సెపరేట్‌గా తమిళ్లో రీమేక్ చేయడంలో అర్ధం లేదని చెప్పారు. దాంతో ఈ సినిమాను తమిళనాడులో కూడా తెలుగు బాషలోనే విడుదల చేసి తమిళంలో సబ్ టైటిల్స్ వేసి విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అలా మొట్టమొదటి సారి తెలుగు సినిమాను తమిళంలో సబ్ టైటిల్స్‌తో విడుదల చేసిన సినిమా విజయవంతమైంది. ఇలా ఒక సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్‌తో వేయడం మొదటిసారి కావడం విశేషం. అక్కడ సఫైర్ అనే థియేటర్లో ఏకధాటిగా 556 రోజులు పైగా ఆడి రికార్డు సష్టించింది. ఇక హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా ఈ సినిమా అక్కడ సైతం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2005 లో కన్నడలో 'లవ్ స్టోరీ'గా, 2009లో ఒడియాలో 'తు మోరీ పాయిన్' గా, 2010లో తెలుగులోకి సైతం అదే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. మరో చరిత్ర మలయాళంలో తిరకల్ ఎజుతియ కవిత (1980) గా డబ్ చేయబడింది.
హిందీలో 'ఏక్ దూజే కేలియే' గా..
మరో చరిత్రని హిందీ లో 'ఏక్ దుజే కేలియే' అనే టైటిల్ తో పునర్నిర్మించారు. హిందీలో కూడా బాలచందర్ డైరెక్ట్ చేయగా, ఎల్.వి.ప్రసాద్ నిర్మించారు. హిందీలో కమల్ హాసన్, మాధవి, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో సహా అనేక మంది దక్షిణాది కళాకారులు కూడా ఈ సినిమా ద్వారానే హిందీ ప్రేక్షకులకు తొలిసారి పరిచయం అయ్యారు. తెలుగు సరిత పాత్రకి పంజాబీ అయిన రతీ అగ్నిహౌత్రిని ఎంచుకున్నారు. చక్కని పాటలు, బాలచందర్ దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్, భీమిలి, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సైతం సూపర్ హిట్ చేశాయి.
సరితకు దక్కిన అవకాశం
ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్ కావాలి. మొదటి హీరోయిన్గా మాధవిని ఎంపిక చేసారు. ఇక రెండో హీరోయిన్గా జయప్రదని అడిగారు. ఆమె చేయలేకపోయింది. ఆ తర్వాత హీరోయిన్ దీపను అడిగారు కానీ ఆమె డేట్స్ కూడా కుదరలేదు. దాంతో మరో 150 మంది అమ్మాయిలను స్క్రీన్ టెస్ట్ చేసినా, ఎవరూ సెలెక్ట్ కాలేదు. ఇక చివరిగా సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారి చుట్టాలమ్మాయి అభిలాషను చూసిన బాలచందర్ ఆమెని ఓకే చేసేశారు. అయితే అభిలాష చూడటానికి అందంగా లేకపోయినా ఆమె మాటలు, యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ చూసిన బాలచందర్ ఫిదా అయిపోయి అభిలాష పేరుని సరితగా మార్చి మెయిన్ హీరోయిన్గా తీసుకుని, మాధవిని రెండో హీరోయిన్గా పెట్టారు.
ప్రేమ జంటల ఆత్మహత్యతో క్షమాపణలు చెప్పిన బాలచందర్
ప్రేమిస్తే కలిసి ఉండాలి లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే సూత్రంతో తెరకెక్కిన ఈ సినిమా ఎంతోమంది ప్రేమికులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమా చూసి తమ ప్రేమ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని భయపడి చాలామంది ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సినిమా యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ప్రేమ జంటల ఆత్మహత్య ఈ చిత్ర దర్శకుడు బాలచందర్ ని తీవ్రంగా కలచి వేసింది. దీంతో ఈ సినిమా 200 డేస్ ఫంక్షన్లో బాలచందర్ ''నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఈ సినిమా తీయడం అని'' అందరికీ క్షమాపణలు చెప్పాడు.
- పొన్నం రవిచంద్ర,
9440077499