Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందీ సినిమా సంగీతాన్ని పండితులకే కాదు పామురులకు కూడా చేరువచేసిన అతి కొద్దిమంది సంగీత దర్శకులలో మొదటగా పేర్కొనదగినవారు శంకర్- జైకిషన్ ద్వయం. అప్పటివరకు నౌషాద్, సి.రామచంద్ర, అనిల్ బాశ్వాస్ వంటివారు హిందీ చిత్ర రంగాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాలం అది. నూనూగు మీసాలు కూడా రాని ఇద్దరు కుర్రాళ్లు ఆ ముగ్గురి అంశను కలబోసుకొని హిందీ తెరవెనుక ప్రత్యక్షమయ్యారు శంకర్ - జైకిషన్లు. ఈ సంగీత ద్వయంలోని ఒక యువకుడు మన తెలంగాణవాడు. అతనెవరో కాదు మన హైదరాబాదీ 'శంకరీసింగ్ రఘువంశీ'. భారతీయ సినీ సంగీతాన్ని రెండున్నర దశాబ్దాల పాటు చకచ్చకితం చేసిన సంగీత కోవిదులు శంకర్ జైకిషన్లు. వీరు సినిమాలకు పని చేసిన కాలమంతా ఒక 'స్వర్ణయుగమే'. ఈ ఇద్దరి సినీ సంగీతం భారతీయ సినిమా పంథానే మార్చేసింది.
అచ్చమైన మన హైదరాబాద్ పహిల్వాన్, కండల వస్తాదు. 1922 అక్టోబర్ 15న హైదరాబాదులో పుట్టాడు. తండ్రి రాంసింగ్, తల్లి ఎల్లమ్మ చిన్నప్పటి నుంచే సంగీత నాట్యాలంటే ఆసక్తి చూపి, బడికి వెళ్ళే రోజుల్లోనే శాస్త్రీయ సంగీతంపై దష్టి పెట్టాడు. తబలా వాదకుడిగా ప్రావీణ్యం సాధించాడు. కథక్ నత్యంలోనూ శిక్షణ పొందాడు. నెమ్మదిగా అతని అడుగులు రంగస్థలం వైపు నడిచాయి. సత్యనారాయణ, హేమావతి థియేటర్ గ్రూపులో చేరి నాటకాల్లో వేషాలు వేయడం మొదలు పెట్టారు. ఇలా నాటక రంగంలో పనిచేస్తున్నా కూడా తనకి ఇష్టమైన సంగీతానికి చేరువగానే మసలుకునేవారు.
హైదరాబాద్‌లో తాలింఖానాలో కసరత్తులు చేసిన వస్తాదుగా మొదట కుస్తీలు పట్టేవాడు మన శంకర్ సింగ్. అంతే ఇష్టంగా తబలాపై లయగా దరువు వేశాడంటే మోగిపోయేది. ఏది ఏమైనా సరే, నేర్చుకున్నది చాలని బొంబాయి చేరుకున్న శంకర్ కొంత కాలం హున్న్ లాల్ - భగత్ రాంల వద్ద శిష్యరికం చేశారు. 'ప్యార్ కీ జీత్' (1948)లో మెడకు డోలు తగిలించుకొని మన శంకర్ డ్యాన్స్ చేశాడు.
ఆ తరువాత అనుకోకుండా పథ్వీరాజ్ కపూర్ దష్టిలో పడ్డారు. ఆయన్ను భక్తిగా 'పాపాజీ' అని పిలిచేవారు. పథ్వీ థియేటర్లో నెల జీతానికి కుదిరాడు. వారి నాటకాలకు మన శంకర్ తబలా వాయించేవారు.
ఇక శంకర్ సింగ్ జోడి అయినా జై కిషన్ సంగతి. 1929 నవంబర్ 21న గుజరాత్ కు చెందిన బల్సారాలో జన్మించిన జైకిషన్తో శంకర్‌కు స్నేహబంధం కుదిరింది.
జై కిషన్‌ను శంకర్ తన వెంట తీసుకెళ్లి పథ్వీరాజ్కి చెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అయితే జై కిషన్ ఎడమ చేతివాటం. మన శంకర్ మాత్రం కుడి చేతినే ఉపయోగించాడు. ఇలా ఈ కుడి ఎడమలు రెండూ కలిసి బాలీవుడ్లో ఆనాడు ఒక 'అద్భుత స్వర సజన'ను సష్టించాయి.
పథ్వి నాటకాలకు వీరి నేపథ్య సంగీతం బాగా అమరింది. అందరిని ఆకట్టుకున్నది కూడా. దాంతో శంకర్ - జై కిషన్‌లు 'చక్కని స్నేహ జంట'గా నలుగురి దష్టిలో పడ్డారు. అదే కాలంలో అద్భుతమైన సినిమాలు తీయాలని కలలుగంటున్న రాజ్ కపూర్ దష్టిలో పడ్డారు వీరు. అప్పటికే కవులు హస్రత్ జైపూరి, శైలేంద్రలు అక్కడే ఉన్నారు. ఇంకేముంది, భారతీయ సినిమాలో నూతన అధ్యాయానికి శ్రీకారం పడింది. రాజ్‌కపూర్ మొదటి సినిమా 'ఆగ్' (1948) తీయాలనుకున్నప్పుడు రామ్ గంగూలీని మ్యూజిక్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్లుగా శంకర్ - జైకిషన్లను తీసుకున్నారు. అయితే తన సినిమా బాణీలను రామ్ గంగూలీ బయటకు ముందుగానే వినిపిస్తున్నాడని తెల్సుకుని రాజ్ కపూర్ తన తరువాతి సినిమాకి శంకర్, జై కిషన్‌లను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఆ చిత్రం 'బర్సాత్' (1949). అలా శంకర్-జైకిషన్ల శకం మొదలైంది.
తొలి చిత్రం 'బర్సాత్' తోనే వారి పాటలు దేశాన్ని ఒక్కసారిగా ఉర్రూతలూగించాయి. 'బర్సాత్ మె హమ్ మిలే తుమ్ సజన్', 'హవామె ఉడ్తాజాయే మేరలాల్ దుపట్టా మల్ మల్ కా', 'రాజాకీ ఆయేగి బారాత్' పాటలు వీరిని మొదటి చిత్రంతోనే హిమాలయ శిఖరాలపై కూర్చో పెట్టాయి. ముఖ్యంగా 'రాజాకి ఆయేగి బారాత్' పాట రాసిన శైలేంద్ర కవిత్వం మన శంకర్ సంగీతానికి సరైన జోడీ అయ్యింది. అట్లానే, హస్రత్ - జైకిషన్ లు బాగా కుదిరారు. ఇట్లా థీమ్ సాంగ్స్ శంకర్ శైలేంధ్రలు చేస్తే.. డ్యూయెట్ సాంగ్స్ జైకిషన్ హస్రత్లు చేయడానికి ఎవరంతట వారే డిసైడ్ అయిపోయారు. అట్లా యధాలాపంగా సంగీత సాహిత్యాల సంగమం జరిగిపోయింది. అయితే, ఏ పాటను ఎవరు చేశారన్నది బయటికి చెప్పకూడదనేది వీరిరువురు కుదుర్చుకున్న ఒప్పందం. దీనికి లోబడే వాళ్లు చాలా కాలం పని చేశారు. శంకర్ -జైకిషన్లు ఇట్లా రాజ్ కపూర్ సినిమాలకు శాశ్వత సంగీత దర్శకులుగా చాలా కాలం కొనసాగారు.
ఈ నేపథ్యంలో శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చిన చిత్రాలు 1949- 'బర్సాత్', 1951-60 మధ్యకాలంలో 'ఆవారా, బాదల్, కాలీఘటా, నగినా, డాగ్, పర్బత్, పూనమ్, ఆV్‌ా, ఆస్, ఔరత్, నయాఘర్, పతితా, షికస్త్, బూట్ పాలిష్, మయూర్ పంఖ్, పూజా, సీమా, శ్రీ 420, బసంత్ బహార్, చోరి చోరీ, హాలాకు, కిస్మత్ కీ ఖేల్, న్యూఢిల్లీ, పట్ రాణి, బేగునాV్‌ా, కట్ పుత్లీ, బాఘీ సిపాహీ, యహూది, అనాడీ, ఛోటీ బహెన్, కన్హయ్య, లవ్ మేరేజ్, మై నషే మే హూ, ఉజాలా, కాలేజ్ గర్ల్, దిల్ అప్నా ప్రీత్ పరాయీ, ఏక్ ఫూల్ చార్ కాంటే, జిస్ దేశమే గంగా బహితీ హై, గబన్, సింగపూర్', 1961- 1971 మధ్యకాలంలో 'ఆస్ కా పంఛీ, బారు ఫ్రెండ్, జబ్ ప్యార్ కిసీసే హౌతాహై, జంగ్లీ, ససురాల్, ఆషిక్, ఆస్లీ నక్లీ, హరియాలీ ఔర్ రాస్తా, ప్రొఫెసర్, రంగోలి, దిల్ ఏక్ మందిర్, లమ్హే, ఆయీ మిలన్ కి బేలా, రాజ కుమార్, సంగమ్, సాంర్a ఔర్ సవేరా, ఆర్జూ, గుమ్నామ్, జాన్వర్, అమ్రపాలిలి వంటి చిత్రాలలో శంకర్ జైకిషన్ల సంగీతాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. వారు చేసిన ఎన్నో ప్రయోగాలు హిందీ సినీ సంగీతాన్ని పరిపుష్టం చేశాయి.
శంకర్ జైకిషన్లు స్వతహాగా సంగీతంలో గొప్ప ప్రతిభాశాలురు. ఆ కాలంలో ఎక్కువ శాతం సినిమా పాటలన్నీ శాస్త్రీయ సంగీతంలో చేసినవే. ఆ సమయంలో 'బర్సాత్' పాటలతో ఒక్కసారిగా భారతీయులందరినీ సమ్మోహితం చేశారు. వారు హిందీ సినీ సంగీతంలో ఎన్ని ప్రయోగాలు చేశారో చెప్పడం అసాధ్యం. ఆర్కెస్ట్రాయిజేషన్కి పంకజ్ మల్లిక్ తప్ప మరెవరు అంత ప్రాధాన్యం ఇవ్వని కాలంలో భారీ సంఖ్యలో అన్ని పాటలు ఆర్కెస్ట్రెజేషన్తో చేయడంలో వారు విజయం సాధించారు.
నత్య గీతాలకు ట్యూన్స్ అందించడంలో వీరిది అంది వేసిన చేయి. వీరి చిత్రాల్లో దాదాపు ప్రతి సినిమాలో టైటిల్ సాంగ్ చేసింది మన శంకరే. శైలేంద్ర పాటలకు ఎక్కువ మ్యూజిక్ చేసింది కూడా తనే అని చాలా మందికి తెలియదు. ఈ జంట ఇంకా 'చోరి చోరి' (1955), 'అనారి' (1959), 'దిల్ అప్నా ప్రీత్ పరాయి (1960), ప్రొఫెసర్ (1962), సూరజ్' (1966), 'బ్రహ్మచారి' (1968), 'షెహచాన్ (1970), 'మేరా నామ్ జోకర్' (1971), భైమాన్' (1972), చిత్రాలకు ఫిలిం ఫేర్ అవార్డులు పొందారు. వీరి సంగీతంలో పాడిన లతా మంగేష్కర్ 'చోరి చోరి' చిత్రానికి, రఫీ 'ససురాల్, 'సూరజ్' చిత్రాలకు, అషా భోంస్లే 'షికార్ చిత్రానికి ఉత్తమ గాయని, గాయకుల అవార్డులు అందుకున్నారు.
ఆ తరువాత శంకర్-జైకిషన్లు 'ఆస్ కా పంచి 'బారు ఫ్రెండ్', 'జబ్ ప్యార్ కిసీ సే హౌతా హై, జంగ్లీ, ససురాల్, సాంర్a, ఆశిక్, ఆరుజు, రంగోలి, గుమ్ నామ్, జాన్వర్, దిల్ ఏక్ మందిర్, ఆమ్రపాలి, హమ్ రాహి, సూరజ్ 'రాజ్ కుమార్', 'లవ్ ఇన్ టోక్యో', 'తీస్రీ కసం', 'రాత్ ఔర్ దిన్', 'బ్రహ్మచారి', 'మెరే హుజార్', 'యకీన్' వంటి చిత్రాలకు 1961-77 మధ్య కాలంలో వీరు కలిసి సంగీతం అందించారు. శంకర్ జైకిషన్లు పాశ్చాత్య బాణీలు అనుకరిస్తారనే అపవాదు ఒకటి ఉంది కాని, వారి బాణీలుంటేనే డిస్టిబ్యూటర్లు సినిమాలు కొనే కాలం అది. అట్లాంటి సమయంలోనే సంగీత ప్రధాన చిత్రం 'బసంత్ బహార్' వచ్చింది. ఈ చిత్రానికి ముందుగా అనిల్ బిశ్వాస్‌ను ఎంపిక చేశాడు భరత్ భూషణ్. కానీ డిస్ట్రిబ్యూటర్లు శంకర్-జైకిష్లే కావాలని పట్టు పట్టారు. అయిష్టంగానే వీరిని ఎంపిక చేశారాయన. కానీ మన శంకర్ - జైకిషన్ లు దీన్నొక మహత్తర అవకాశంగా, ప్రతిష్టగా తీసుకుని అద్భుతమైన పాటలు కూర్చారు. ''జా జారే బలమ్, వ సుర్ నా సజే క్యా గావు మై, కేతకి గులాబ్, నైన్ మిలే చైన్ కహా, మీ పియా తేరి'' పాటలు ప్రేక్షకులను రసానంద డోలికలలో తెలియాడించాయి.
వారు బాణీలు సమకూర్చిన ఎన్నో వందల పాటలు స్వర ప్రపంచాన్ని ఇంకా ఏలుతూనే ఉన్నాయి. శంకర్ - జైకిషన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం భైరవి. నిజానికి అప్పటికి నౌషాన్, ఝండేఖాన్ అనిల్ బిస్వాస్ భైరవి రాగాన్ని ఆధారంగా చేసుకొని అనేక పాటలకు స్వరకల్పన చేశారు. అయితే అదే భైరవి రాగాన్ని శంకర్-జైకిషన్లు తన సంగీతానికి ప్రాతిపదిక రాగంగా పెట్టుకొని అనేక పాటలను రూపొందించారు. ''సునో చోటిసీ గుడియాకి లంబి కహానీ'' (సీమా), ''బర్సాత్ మే హమ్ సే మిలే తుమ్'' (బర్సాత్), ''కిసీనే అప్నా బనా కె మానుకో ముస్కురానా సిఖాదియా''(పతిత), ''మైపియా తెరీ''(బసంత్ బహార్), ''మేరానామ్ రాజా''(జిన్ దేశమే గంగా పారి హై), ''బోల్ రాధాబోల్'' (సంగమ్) ఇంకా ఎన్నో సుమధుర స్వరకల్పనలు శంకర్-జైకిషన్లు సష్టించారు.
శంకర్-జైకిషన్ లు హిందీలో సూపర్ హిట్ సంగీత దర్శకులే కాదు, 'సూపర్ స్టార్' సంగీత దర్శకులు కూడా.
'బర్సాత్' సినిమాతో హిందీ సినీ ప్రపంచంలో నూతన శకం ఆరంభమయింది. అందులోని పాటలన్నీ సూపర్ హిట్లే. అన్ని పాటలూ లతాతోనే పాడించి, ఆమె ఉన్నతస్థాయికి చేరుకోవటంలో ప్రధాన పాత్ర వహించారు శంకర్ జైకిషన్లు. శైలేంద్ర, హస్రత్లు గీతరచయితలుగా, శంకర్-జైకిషన్లు రాజ్ కపూర్ సినీసంగీత భవంతికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. సరళమైన పదాలతో అతి సులువైన బాణీలతో, మన్మోహనమైన వాయిద్యాల కలయికలతో, ప్రతి పాట ఒక ప్రత్యేక ప్రపంచంలా తీర్చిదిద్దేవారు శంకర్-జైకిషన్లు. అందుకే, వారి పాటలు సినీ పరిధి దాటి, ప్రత్యేక అస్తిత్వాన్ని పొందాయి. నటీనటులకు ప్రత్యేక ఇమేజీని ఇచ్చాయి. నటీనటులు లేకుండా సినిమాను ఊహించగలిగినా, శంకర్- జైకిషన్ పాటలు లేకుండా సినిమాను ఊహించలేనంతగా వారి పాటలు ప్రజల హదయాలలో నిలిచిపోయాయి. 'టైటిల్ సాంగ్' సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది శంకర్-జైకిషన్ ద్వయమే. అంతకుముందు అరకొర టైటిల్ పాటలున్నా, టైటిల్ సాంగ్‌కు వ్యాపారస్థాయిని కల్పించింది వీరే. 'జంగ్లీ' అనగానే 'యాహూ' గుర్తుకు వస్తుంది. 'చాహె కోయి ముఝె జంగ్లీ కహే' అంటూ దూకే షమ్మీకపూర్ గుర్తుకు వస్తాడు. సైరాబాను గుర్తుకు వస్తుంది. 'కాశ్మీర్‌కి కలిహు మై' అంటూ ముద్దమందారంలాంటి ఆమె అందం మెదులుతుంది. వెంటనే, 'ఎహెసాన్ తెరా హౌగా ముఝపర్' అన్న సుమధుర గీతం పెదవులపైకి వస్తుంది.. మహమూద్ అనగానే 'హమ్ కాలే హైతో' క్యాహువా' పాట గుర్తొస్తుంది.
రాజేంద్రకుమార్ పేరు చెప్పగానే 'తెరి ప్యారీ ప్యారీ సూరత్ కో'' అన్న పాట గుర్తుకు వస్తుంది. 'బహారో ఫూల్ బర్సావో' అంటూ ఎదలో పూలజల్లు కురుస్తుంది. మరికొన్ని అల్లరి పాటలు గుర్తుకు వస్తాయి.. 'పూలోంకి రాణీ బహారోంకి మల్లికా' అంటూ రొమాన్స్‌లో హదయం నిండుతుంది. 'ఆవారా హూ', 'మేరా జూతా హై జాపానీ', 'సబ్ కుఛ్ సీఖా హమ్నే', మేరే మనకి గంగా'' వంటి పాటలు రాజ్‌కపూర్ ఇమేజ్‌లో భాగమై పోయాయి.
రాజ్‌కపూర్ తరువాత అయన సోదరుడు, షమ్మీకపూర్ చిత్రాలకు సంగీతం చేయడంలో కూడా శంకర్-జైకిషన్లు బాగా పాపులర్ అయ్యారు. అయితే, ఈ ఇద్దరి స్నేహం కొందరికి కన్ను కుట్టి ఉంటుంది. ఎలా జరిగిందో ఏమో కాని, ఎవరు ఏ పాట చేశారనేది బయటికి చెప్పకూడదన్న' ఒప్పందం కాస్తా అనుకోకుండా ఉల్లంఘించబడింది. 'సంగం' (1964)లోని ''ఏ మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్'' పాటకు తానే ట్యూన్ చేశానని తన భార్య పల్లవికి రాసిన ప్రేమలేఖలో హస్రత్ చేత పాట రాయించానని 'ఫిలిం ఫేర్'లో జై కిషన్ రాశాడు. దాంతో శంకర్-జైకిషన్ల నడుమ విభేదాలు పొడసూపాయి. ఒప్పంద ఉల్లంఘన జరిగిందని శంకర్ అభ్యంతర పెట్టాడు.
ఆ తర్వాత 'దిల్ ఏక్ మందిర్'(1963) సినిమాకు సంగీతం సమకూర్చాక వారిద్దరూ స్నేహ పూర్వకంగానే విడిపోయారు. ఎవరి చిత్రాలకు వారే విడిగానే సంగీతం సమకూర్చుకున్నారు. అయితే, ఎవరికి వారు రెండు పేర్లను వాడుకున్నారు. కొన్నాళ్లు అలా శంకర్, జై కిషన్లుగా కొనసాగారు. వారు విడిపోయాక రాజ్ కపూర్ కోరిక మేరకు 'మేరా నామ్ జోకర్' సినిమాకు మాత్రం కలిసి పని చేశారు. 1948 నుండి 1971 వరకు శంకర్-జైకిషన్లు చేసిన సినిమాల సంఖ్య సుమారు 180. ఒక్కో సినిమాకు అయిదు లక్షలు పారితోషికం తీసుకున్న రికార్డు వీరిది.
'మేరా నామ్ జోకర్' సినిమా తర్వాత జైకిషన్ 1971 సెప్టెంబర్ 12న తనువు చాలించారు. అప్పుడు సంగీతం అంతా జై కిషనే చేశారని, శంకర్ దీనికి పనికి రాడని కొందరు నిందలు మోపారు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. రెండేళ్లు ఒక్క సినిమా కూడా లేకుండా గడిపిన శంకర్ మళ్లీ ''సన్యాసి' చిత్రంతో పెద్ద హిట్ కొట్టారు. ఆ తరువాత స్వతంత్రంగా 30 సినిమాలకు సంగీతాన్ని సమకూర్చి తన సత్తాను చాటుకున్నారాయన.
శంకర్ చొరవ వల్లే అప్పట్లో ఫిలింఫేర్ అవార్డుల్లో గాయనీ గాయకులకు చోటు కల్పించేవారని హిందీ చిత్రరంగంలో చెప్పుకునేవారు. ఫలితంగా లతాకు వరుసగా 'ఉత్తమ గాయని' అవార్డులొచ్చాయి. కానీ, తరువాతి రోజుల్లో లతాతో శంకర్‌కు అభిప్రాయ భేదాలు వచ్చాయి. గాయని శారదను ఎక్కువగా ప్రోత్సహించడం ఇందుకు కారణంగా చెప్తారు.
బాలీవుడ్లో బతుకమ్మ పాట
శంకర్ దర్శకత్వంలో 1971లో తెలుగులో వచ్చిన 'జీవితచక్రం'లోని ''బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో'' పాట మన తెలంగాణ తనాన్ని నాలుగు దశాబ్దాల కిందటే ఎంతో గొప్పగా వెల్లడించింది.
ఇక శంకర్ హైదరాబాదీ కావడం వల్ల ఆయన్ను హైదరాబాద్ తెలంగాణ సంస్కతి నీడలు వీడలేదనడానికి తన కంపోజింగ్సే సాక్ష్యాలుగా నిలిచాయి. 'శ్రీ 420'లో ముఖేష్ పాడించిన తెలంగాణ నుడికారంతో కూడిన 'రామయ్యా వస్తావయ్యా! రామయ్యా వస్తావయ్యా' పాట నేటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. అట్లాగే, 1964లో విడుదలైన 'రాజ్ కుమార్' చిత్రంలోని 'నాచ్ మన్ బతుకమ్మ' పాట, జెమినీ వాళ్ళు 1969లో తీసిన 'సత్రంజ్' లో ''బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతావ్, ఇక్కడ ఇక్కడ రా!'' పాటను మహమూద్, రఫీ, శారదలచే పాడించారాయన. ఆ రోజుల్లో ఈ ఒక్క పాట కోసమే ఈచిత్రం హిట్ అయ్యింది. అది మన శంకర్ గొప్పతనమే. ఆ తరువాత 1971లో తెలుగులో వచ్చిన ''జీవిత చక్రం' సినిమాకి శంకర్ సంగీత దర్శకత్వం వహించారు. అందులో ''బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో..'' పాట తెలంగాణ సంస్కతిని ఆయన మరిచిపోలేదనడానికి నిదర్శనం. అలా శంకర్ ఆనాడే మన బతుకమ్మకు పట్టం గట్టారు.
శంకర్ సినిమా రంగ సేవలకు గుర్తింపుగా 1979లో 'పద్మశ్రీ' పురస్కారం లభించింది. మహానగర పాలక సంస్థ ముంబైలోని ఒక కూడలికి 'శంకర్ జైకిషన్ చౌక్' అని నామకరణం చేసింది. 2013లో భారతీయ సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 100 మంది సినీ ప్రముఖుల స్టాంపులలో వీరిరువురి స్టాంపు కూడా విడుదల చేసింది. హైదరాబాదులో జన్మించి ఇక్కడి తాలింఖానాలో కండల వస్తాదుగా తర్ఫీదుపొంది, నాటి ముంబైలోని హిందీ చిత్ర రంగంలో సాటిలేని సంగీత దర్శకుడుగా ఒక వెలుగు వెలిగినవాడు శంకర్ సింగ్ రఘువంశీ. ఇండిస్టీలో కొచ్చిన తొలి రోజుల్లోనే యోధానుయోధుల సంగీతంతో పోటీపడి జయించారాయన. తొలినాటి బాలీవుడ్ వైభవానికి ఎంతో కషి సల్పిన శంకర్ 1987 ఏప్రిల్ 26న కన్నుమూసి, తన స్వర యాత్రను ముగించారు. హైదరాబాద్ నుండి హిందీ చిత్ర సీమకు జైరాజ్ అజిత్, చంద్రశేఖర్‌ల తరువాత వెళ్లిన శంకర్ అక్కడ చేసిన స్వరయాత్ర దేశదేశాల్లో మార్మోగింది. రష్యా, జపాన్ వంటి దేశాల్లో 'ఆవారా' సినిమా పాటలు మార్మోగాయి. రాజ్‌కపూర్ సినీ విజయాలలో శంకర్ - జైల పాత్ర ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రజలంతా గర్వించదగిన సినీ సంగీత దర్శకులు శంకర్ సింగ్ రఘు వంశీ. హిందీ చిత్ర రంగంలో రాజ్ కపూర్, నర్గీస్, శంకర్ జై కిషన్, శైలేంద్ర, హజ్రత్ జై పూరీలు ఒక స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టిన బృదం. ఆ దంలో మన శంకర్, జైకిషన్ తో కలిసి నిర్వహించిన భూమిక హిందీ సినీ చరిత్రలో అవిష్మరణీయమైనది.
- హెచ్.రమేష్‌బాబు,
7780736386