Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని మన చారిత్రాత్మక స్థలాలకు వింతైన నామకరణం జరిగింది. ఒక పోర్చుగీసు వాడు ముంబయికి 10 కి.మీ. దూరంగా తూర్పుగా ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ 2 కి.మీ. వెడల్పు వున్న ద్వీపం సముద్రం మధ్య కనిపించిందట. ఆ గడ్డ పై రాతి ఏనుగు శిల్పమూ, అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని గుహలూ కనిపించాయట. ఆ ద్వీపానికి 'ఎలిఫెంటా' అని పేరు పెట్టి పరిశోధనలు జరిపారు. అక్కడ ఒక శిలాశాసనం కూడా కనిపించింది. దానిని ఆ పోర్చుగీసువాడు బయటకు తీశాడు. ఆపై పోగొట్టాడు. ఆ శిలాశాసనం అందుబాటులో వుంటే ఆ స్థల చరిత్ర తెలిసేది. ఇలాంటి పరిస్థితిలో అక్కడి శిల్పాలు, చెక్కిన తీరు, పద్ధతి, ఆ స్థల చరిత్ర తెలియజేశాయి. కళలు, కళాచరిత్ర ఇక్కడ కూడా ఆ విధంగా ఆపద్భాంధవులు అయినాయి.
ఎలిఫెంటా ద్వీపంలో చాలా గుహలు బయటపడ్డాయి. అక్కడి శిల్పం చెక్కిన పద్ధతి, విషయం ప్రకారం ఇది క్రీ.శ. 540 నుండి క్రీ.శ. 555 మధ్య చెక్కిన గుహలుగా తేల్చారు. వీటిలో ముఖ్యమైనది ఒకటవ నంబరు గుహ. దీనిలో చెక్కిన నిపుణత ప్రకారం దక్షిణ ఆసియాలోనే ఇది ఒక ముఖ్య ఇమారుతంగా లెక్కకట్టబడింది. ఈ ఒకటవ ముఖ్యమైన గుహ సదాశివ లేదా మహేశ్వర గుహ. అక్కడ పాశుపత శైవ అర్చనలు జరుగుతుండేవట. కానీ నీటి రాపిడి వలన ఆ గుహలు పాడైపోతున్న విషయం గమనించి బ్రిటీష్ వారు 1909 నుండి ఆ గుహలను ప్రయాణికుల దర్శనార్థం మటుకే వుంచి మిగిలిన కార్యక్రమాలు రద్దు చేశారు.
ఈ గుహల ముఖ్యద్వారం తూర్పునే వున్నా, మరో ముఖ్యద్వారం ఉత్తరాన చెక్కబడింది. అలా చెక్కడం ఏదో కొత్త పద్ధతిలో చెక్కాలనే కుతూహలం కాదు. ఇది తూర్పు ద్వారం చెక్కిన శివమందిరమే. బహుశా ఆ కొండకు, చెక్కిన గుహకి వున్న సముద్రపు నీటి తాకిడి చూసి ఆ గుహ కోసుకుపోయే అవకాశం ఆలోచించి, ఉత్తర ద్వారం కూడా చెక్కి వుండవచ్చు. ఈ గుహలో చెక్కిన పెద్ద మహేశమూర్తి రూపం తూర్పు ద్వారం కంటే ఉత్తర ద్వారం నుండి వస్తేనే చక్కగా కనిపిస్తుంది. ఈ గుహ గోడకి 3 శిరస్సులు కనిపిస్తున్న సదాశివుడు, లేదా మహేశమూర్తి చెక్కి ఎంతో పెద్ద రూపంగా దర్శనమిస్తుండగా గుహ మధ్యలో 4 వైపులా ద్వారాలు వున్న శివలింగం వున్న మందిరం చెక్కబడింది. ఈ చతురస్ర మందిరానికి, 4 ద్వారాలకు అటూ ఇటూ ఇద్దరు ద్వారపాలకులూ చెక్కబడ్డారు. ఎంతో పెద్ద ఆకృతిలా వున్న ఈ ద్వారపాలకులు ముందరి గుప్తులకాలం నాటి సరళమైన రూపంతో పాటు, కొన్ని ఆభరణాలు కూడా చెక్కబడి, ముందరి కాలాల్లో రాబోయే ఆర్భాటమైన శిల్పాల చెక్కడాలకు మధ్య సంధి శిల్పంలా కనిపిస్తాయి. ఇక్కడి ప్రతీశిల్పం మందమైన పెదవులతో, కిందికు దించిన కళ్ళతో కనిపించే శైవ ప్రధాన శిల్పాలు. ఒక గూడులో లకులీష శిల్పం కనిపిస్తుంది. లకులీశుడు పాశుపాతశైవం బోధించిన శైవుడు. కలచూరి రాజులు ఇష్టపడిన మతం పాశుపాతశైవం. ఇదివారు చెక్కించిన గుహలేను.
ఇక్కడి ముఖ్యమైన మధ్య శిల్పం మూడు ముఖాలు కనిపిస్తున్న చతుర్ముఖ లింగం. నాలుగవ ముఖం వెనుకవైపు వున్నట్టు ఊహించాలి. ఇది 5 మీటర్ల కన్నా ఎత్తు వుండి సందర్శకులని ఆశ్చర్యపరిచే శిల్పం. పాశుపత లింగపురాణం ప్రకారం, పై భాగాన వుండే ముఖాన్ని కూడా సందర్శకులు ఊహించాలి. కనిపిస్తున్న మూడు ముఖాలు, మూడు రకాల భావాలను చూపిస్తుంటాయి. ఎడమవైపు ముఖం ఉబ్బిన కళ్ళు, దొంతర మీసంతో కోపంతో వున్న ఉగ్ర భైరవ శివరూపం. మధ్యముఖం ప్రశాంత భావం చూపిస్తుంటే కుడి పక్క ముఖం నాజూకైన సరళమైన ముఖం.
ఈ గుహలో కొన్ని చూడముచ్చటగా వున్న శివపురాణ కథలు లోతుగా గూళ్ళలా గుహ గోడల్లో చెక్కబడ్డాయి. చెక్కిన కథల రూపాలు ముందుకు వచ్చి మనకు పురాణ కథలు చెపుతున్నాయా అన్నంత అందంగా చెక్కబడ్డాయి. అన్నీ నిలువెత్తు శిల్పాలే. ఒక గోడకి అర్ధనారీశ్వర రూపం చెక్కబడింది. మహేశమూర్తి వున్న మూడు ముఖాల శివ శిల్పానికి తూర్పు పక్క ఈ శిల్పం చెక్కబడింది. ఈ రెండు శిల్పాలకు మధ్య వున్న గోడపై, మరగుజ్జు రూపమైన గణరూపం పై చేయి ఆన్చిన ద్వారపాలకులు నిలుచుని వుంటారు. అర్థ నారీశ్వర శిల్పం సుమారు ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవు. పార్వతి చేతిలో అద్దం పట్టి, అల్లిన జడ, చెవులకు పెద్దరింగులు, గాజులు, ఉంగరాలతో వయ్యారంగా నిలుచుని శివుడి సగభాగం ఆక్రమించగా కొద్ది ఆభరణాలతో శివుడు, ఎడమచేయి నందిపై ఆన్చి కుడిచేతిలో సర్పం పట్టి సగభాగంగా నిల్చుని వుంటాడు. ఇది ప్రకృతి పురుష కలయిక రూపం. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, దేవతలు కూడా పైన ఆకాశ మార్గాన చెక్కబడ్డారు. మహేశమూర్తికి మరోపక్క గంగాధర మూర్తి చెక్కబడింది. మధ్యలో శివపార్వతులు నిలుచుని వుండగా, గంగ మూడు శిరస్సులతో శివుడి తలని చేరుతూ కనిపిస్తుంది. ఆ మూడు శిరస్సులు, గంగ, యమున, సరస్వతి అయినా అవవచ్చు. లేదా మందాకినీ, భగవతీ, అలకనంద కావచ్చు. లోతుగా చెక్కబడ్డ ఈ గోడపై పైభాగాన బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, సరస్వతి, ఇంద్రాణి, లక్ష్మి... మరెందరో దేవతలు. ఈ సంఘటన చూడడానికి అంచెలంచెలుగా వస్తున్నట్టు చెక్కబడింది. ఇది భూమి, ఆకాశం, భూలోకం, స్వర్గలోకం కలిసే సందర్భం. ఇందుకు కారణమైన భగీరధుడు నమస్కారం చేస్తూ కింద మోకాళ్ళపై కూర్చుని వుంటాడు. చిరునవ్వుతో నిలుచున్న పార్వతిని ఒక చేతితో పట్టుకుని, మరో భుజంపై సర్పంతో శివుడు నిలుచుని వుంటాడు, ఉరవడిగా వచ్చే గంగని బంధించడానికి.
గుహకు ఆగేయంలో గోడలో చెక్కిన శిల్పం అంధకాసుర వధ అనే కథ. ఉగ్రరూపంలో వున్న శివుడు అంధకాసురుడిని చంపడంలో పూర్తి నిమగమై కనిపిస్తాడు. అంధుడైన ఆ రాక్షసుడి రక్తం బొట్టు కిందపడితే అనర్థమనీ ఒక చేతిలో చిప్పపట్టి రక్తం కిందపడకుండా చూస్తూ, మరో చేత్తో త్రిశూలంతో గుహ గోడలో నుండి బయటకు దూకుతున్నాడా శివుడు అన్నంత భయం గొలిపే శిల్పం ఇది. దేవతలందరూ ఒక మంచెపై కూర్చుని కిందికి, శివుడి భయంకర రూపం భయంగా చూస్తూ వుంటారు.
గుహకు నైరుతి గోడపై కళ్యాళ సుందరమూర్తి రూపం చెక్కబడింది. ఇది శివపార్వతుల వివాహవేదిక. పార్వతి వివాహానికి ముందు శివుడికి ఎడమ పక్క వుండగా, పర్వతరాజు కన్యాదానం చేయగా, బ్రహ్మమంత్రం చదవగా, విష్ణువు బ్రహ్మ వెనుక నిలిచి వుండగా, రుషి మునుల ఆశీర్వచనాల మధ్య, చంద్రుడు కలశం పట్టి కాళ్ళు కడగడానికి నీరు అందిస్తుంటే ముగ్దలా పార్వతి పెళ్ళికూతురైన దృశ్యమిది.
గుహకు తూర్పు గోడపై యోగీశ్వర శివరూపం చెక్కబడింది. పద్మాసనం వేసుకుని ఒక కమలం మీద కూర్చున్న శివుడికి అటూ ఇటూ నమస్కార ముద్రలో నాగదేవతలు నిల్చుని వుంటారు. దేవీ దేవతలు ఆయన వద్దకు వస్తున్నట్టు చెక్కబడింది. శివుడి కిరీటం, జడబంధం, ఊపిరి పీలుస్తున్న తీరు వేరుగా వుండడం వలన ఇది ధ్యాన బుద్దుడి రూపం కాదు అని తేల్చవచ్చు. లేకపోతే యోగీశ్వర శివ, ధ్యాన బుద్ద రూపాల తీరు ఒకటే అనే పొరపాటు పడే అవకాశం వుంది.
పశ్చిమ దిక్కు వరండాలో అతీత నృత్య మూర్తి నటరాజు రూపం చెక్కబడింది. ఈ శిల్పం 4 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో చెక్కిన 8 చేతులున్న నృత్యం చేస్తున్న శివరూపం. వివిధ ఆయుధాలు పట్టుకుని లలిత ముద్రల్లో వేళ్ళు చూపుతూ, శరీరం దూదిలా తేలికగా ఆడిస్తూ నాట్యం చేస్తున్న శివుడిని చూసి పార్వతి తెల్లబోయి చూస్తూ వుంటుంది. బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, సరస్వతి, గణేష్, కార్తీకేయ రూపాలు కూడా ఇక్కడ చెక్కబడినా, మిగిలిన కథా శిల్పాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ దేవతా రూపాలు కన్పించవు.
తూర్పు ద్వారం వైపు రావణానుగ్రహ శివరూపం చెక్కబడింది. పార్వతి, శివుడు కైలాసం మీద కూర్చుని పచ్చీస్ ఆడుతుంటారు. నంది పార్వతికి కిందగా కూర్చుని వుండగా, భ్రింగి, 4 చేతులున్న శివుడి పాదాల వద్ద కూర్చుని వుంటాడు. శివుడి వద్ద గణేశ, కార్తికేయ రూపాలు కూడా చెక్కబడ్డాయి. పైభాగాన కొండల రూపంలా ఎత్తుపల్లాలు చెక్కి కైలాస పర్వతం చూపబడింది. అలాగే పై భాగాన దేవీదేవతల రూపాలూ చెక్కబడ్డాయి. ఈ గూడులోని కథలో ఒక వింత వుంది. ఈ కైలాస పర్వతం కింద వైపు రావణాసురుడు తన పది చేతులతో ఆ కైలాస పర్వతాన్ని కదిపే ప్రయత్నంలో మనకు కనిపిస్తాడు. రావణాసురుడు వెళుతున్న దారిలో కైలాస పర్వతం అడ్డు వచ్చిందని ఎత్తి పక్కన పెట్టబోతాడట. ఆ కుదుపుకు పార్వతి భయపడి శివుడు వద్దకు చేరితే, ఆమెని ఎడమ చేత్తో పట్టుకుని తన కుడికాలి బొటనవేలితో ఆ పర్వతాన్ని నొక్కుతాడు శివుడు. ఆ కుదుపు, బలం అర్థమైన రావణాసురుడు శివభక్తితో, తన శరీరంలో నుంచి ఒక నరం తీసి, ఏకతారలా మీటుతూ శివ తాండవ స్త్రోత్రం ఆశువుగా పాడతాడు. ఈ శివుడే రావణానుగ్రహ శివమూర్తి.
ఈ ఎలిఫెంటా గుహలలోని శిల్పాలన్నీ, నిలువెత్తు ఆకారంలో లింగ పురాణంలోని కథలను, ఒక నాటకంలోని దృశ్యాలలాగా ఎంతో అందంగా చెక్కబడ్డాయి. కానీ ప్రతీ శిల్ప దృశ్యాలు విరిగి, చేతులు, కాళ్ళు, వివరాలు కొట్టివేసినట్టు నిలుచుని వుంటాయి. ఇది పోర్చుగీసువారు చేసిన విధ్వంస కాండలో భాగంగా చెపుతారు. ఈ కథల అమరికలో ఒక వింత కనిపిస్తుంది. తూర్పు గోడకు ధ్యానంలో నిశ్శబ్దంగా వున్న శివుడు కనిపిస్తే, ఆ గోడకు ఎదురుగా తాండవం చేస్తూ ముల్లోకాలనూ ఏకం చేస్తున్న శివుడు కనిపిస్తాడు. ఈ విధంగా శివుడు అన్నీ భావాలనూ చూపిస్తూ గుహ అంతా కనిపిస్తాడు. ఈ గుహల దృశ్యం ఒక వింత అనుభవం.
మహారాష్ట్ర, తెలుగు ప్రదేశాలు భారతదేశం మధ్యలో వుండి కళలు, కళాకారులు ఉత్తరం, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు విడిదిలా ఆశ్రయం ఇస్తాయి. అలాగే ఈ ఎలిఫెంటా గుహల, చెక్కడాలు కూడా పురాతన కాలపు అంటే క్రీ.శ. 5వ శతాబ్దం వరకూ వున్న గుప్తుల కళలను పొడిగిస్తూ అలాగే ఆపై కాలాల్లో రాబోయే కొత్త కళల ప్రయత్నాలకు నాంది పలుకుతూ కనిపిస్తాయి. ఇక్కడ అజంతా నాటి గుహల స్తంభాలు చెక్కిన పద్ధతీ కనిపిస్తుంది. అలాగే ఔరంగాబాద్ వద్ద వున్న గుహల శిల్పం చెక్కడాలూ కనిపిస్తాయి. మొత్తం మీద ఈ ఎలిఫెంటా గుహల చెక్కడాలు, శిల్పం, భారతదేశ మధ్యలో వుండి ఉత్తర దక్షిణాల వంతెనలాగానే కాదు, పురాతన కాల శిల్ప చెక్కడాలకు, రాబోయే కాలాల శిల్ప కళలకు మధ్య సంధి, సంబంధాలు చూపుతాయి.
- డా||ఎం.బాలామణి, 8106713356