Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరిసామెతలు
- అన్నవరం దేవేందర్, 9440763479
కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. దేనికోసమో వస్తరు. ఇంకో ముచ్చట పెడుతరు. సందర్భానుసారం వచ్చిన విషయం బయట పెడుతరు. వాల్లనే 'చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు' చేస్తున్నరు అంటరు. పూర్వం మజ్జిగ అమ్మేవాల్లు కాదు. పాడె వున్న ఇంట్ల నుంచి చల్లను అడిగి తీసికపోవుడే వుండేది. ముంతలో చల్లను తీసిక పోయేందుకు వచ్చి అంతా మంచిదేనా అమ్మా అనుకుంటు ఇతర ముచ్చట్లు మాట్లాడేవాల్లు. ఈ సందర్భంలో డైరెక్ట్‌గా మాట్లాడాలని ఈ సామెత మాట్లాడుతరు.
మరి కొందరేమో 'తాటిచెట్టు కింద వుండె పాలు తాగుతున్న అన్నట్లు' రకం వారు వుంటరు. అసలే అది కల్లు సేవించే తాటిచెట్టు. అక్కడ ఎందుకు ఉన్నావయ్యా అంటే, పాలు తాగుతున్న అంటే ఎవరన్నా నమ్ముతరా? అట్లుంటది కొందరి వ్యవహారం. ఏదైనా 'అబద్దం చెప్పినా గోడకు ఏసిన సున్నం వలె అతికినట్టు ఉండాలి' అని అంటరు. అబద్దాలు ఆడవద్దు కాని అవసరాల రీత్యా ఆడితే 'బంగారానికి వెలిగరం కలిపినట్లు' వుండాలన్న మాట. అబద్దం ఎందుకు ఆడాలనంటే 'నూరు అబద్దాలు ఆడి అయినా ఒక్క పెండ్లి చెయ్యాలనంట' అంటరు. అన్నీ నిజాలు చెప్పితే పెండ్లిల్లు కావు. లేకపోతే ఆగిపోతయి. పెండ్లి అయినంక ఏదైనా కలుపుకపోతరు అని అంటరు. వివాహాలు అందరికీ వెనుకో ముందో అయితయి. 'గంతకు తగ్గ బొంత దొరకదా' అన్నట్టు వుంటది. ఎవల పిల్ల వాల్లకు మంచిగనే వుంటది. అవుతలి వాల్లకు నచ్చదా? 'కాకి పిల్ల కాకికి ముద్దు' లెక్క. కర్రెగ వున్నదని కాకి తన పిల్లను దగ్గరికి తీసికోదా? అంటరు. మరికొందరు 'ఆండ్లేం లేకున్నా అంతంత ఎగురుతండ్రు' అంటరు. 'వాని దగ్గర పరువు శారడు బలపాలు దోసెడు' అయినా పెద్ద చదివినోని లెక్క 'తీస్మార్ఖాన్' లెక్క వ్యవహారం చూపెడుతురు. మనిషి పుట్టిన్నుంచి మొదలయి కొసెల్లేదాక తీరొక్క ఏశాలు ఎయ్యాల్సి వస్తుంది. అదే జిందగీ.