Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యంగ్య చిత్రం (కార్టూన్) అంటే తెలియని పాఠకులు ఉండరు. కార్టూన్ ఫకాలున నవ్వించడమే కాదు ఆలోచన రేకెత్తిస్తుంది. అవినీతి రాజకీయ నాయకులను ఈడ్చి చెంపమీద కొడుతుంది కార్టూన్. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాంత, వాస్తవ స్థితిగతులను వ్యంగ్యం జోడించి అందిస్తుంది. రెండు మూడు పేజీల రచన చెప్పలేని విషయాన్ని ఒక చిన్న కార్టూన్ వివరిస్తుంది. అందుకే చాలా మంది పాఠకులు కార్టూన్‌ను ఇష్టపడతారు. కార్టూన్ చదివి ఆనందిస్తారు. ఆలోచిస్తారు. హాయిగా నవ్వుకుంటారు. తద్వార ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మే 20వ తేదీ తెలుగు కార్టూన్ దినోత్సవం. ఈ సందర్భంగా చిన్న వ్యాసం...
ఒకప్పుడు స్వర్ణయుగంగా వెలుగొందిన కార్టూన్ కళ ముందు ముందు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. భావి తరాలవారు కార్టూన్ అంటే ఏమిటి అని అడిగే పరిస్థితి కూడా దాపురించవచ్చు. గతంలో కార్టూన్లు లేని దిన, వార, పక్ష, మాస పత్రికలు ఉండేవి కావు. ఎక్కువమంది పాఠకులు కార్టూన్ల కోసమే వివిధ రకాల పత్రికలు కొనేవారు, చదివేవారు. తెలుగు కార్టూన్ రంగంలో తలిశెట్టి రామారావు, బాపు, పాపా, బాలి, శ్రీధర్, జయదేవ్ వంటి వారి కషి మరువలేనిది. కార్టూన్ కళ మరుగున పడబోతుందనడానికి కారణాలు అనేకం ఉన్నాయి. టి.విలు వచ్చాక పాఠకులలో పఠనాసక్తి తగ్గిపోయింది. రీడర్స్ కాస్త వ్యూవర్స్గా మారిపోయారు. అలా కొన్ని పత్రికలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ కొన్ని పత్రికలు కార్టూన్లను తప్పని సరిగా వేసుకోవడం కాకుండా, వ్యాసాలు, కథలు మొదలైనవి పొందుపరిచాక పేజీలో కాసింత స్థలం మిగిలితే ఆ స్థలాన్ని భర్తీ చేయడం కోసం మాత్రమే కార్టూన్లను ఉపయోగించుకునే వారు. ఆ విధంగా కార్టూన్ విలువలను తగ్గించేశారు.
కార్టూన్ కళ అంతరించిపోవడానికి మరో కారణం ఆదరణ తగ్గిపోవడం. పాఠకుల పరంగా ఆదరణ తగ్గిపోలేదు. పాఠకులు అప్పుడు, ఇప్పుడూ కార్టూన్లను ఆదరిస్తూనే ఉన్నారు. ఆదరిస్తూనే ఉంటారు. కార్టూన్‌కు పత్రికల నుండి ఆదరణ తగ్గిపోయింది. ప్రోత్సాహం తగ్గిపోయింది. దాదాపు 1985 కాలంలో ఒక కార్టూన్ ప్రచురితమైతే 10 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. ఒక కార్టూనిస్ట్ 10 కార్టూన్లు పత్రికకు పంపిస్తే అందులో వారికి నచ్చిన ఒకటో, రెండో కార్టూన్లు ప్రచురించేవారు. ప్రచురించిన వాటికే పారితోషికం ఇచ్చేవారు. కార్టూనిస్ట్ కార్టూన్లు వేయడానికి స్టేషనరీ కోసం చేసే ఖర్చుకన్నా వచ్చే పారితోషికం చాలా తక్కువ. ఆ కారణంగా చాలా మంది కార్టూనిస్ట్‌లు కార్టూన్లు వేయడం మానుకున్నారు. ఉద్యోగాలు చేసుకొనే కార్టూనిస్ట్‌లు... అంటే పారితోషికంపై ఆధారపడని కొంతమంది మాత్రమే కార్టూన్స్ వేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
కరోనా ముందు వరకు కార్టూనిస్టులకు ఇచ్చే పారితోషికం 100 రూపాయలకు పెరిగింది. స్టేషనరీ ఖర్చులు అంతకుమించి పెరగడంతో అప్పటికీ ఇప్పటికీ పారితోషికంలో మార్పు ఏమీ లేనట్టే. ఆ పారితోషికమైనా కొన్ని పత్రికలవాళ్లు మాత్రమే ఇచ్చేవారు. కరోనా తర్వాత పారితోషికం ఇచ్చే పత్రికలు కూడా మూత పడడంతో ఇక కార్టూన్లకు పారితోషికం ఆశించే అవకాశాలు కూడా లేకుండా పోయాయి.
ఒకప్పుడు మామూలు పత్రికలతోపాటు హాస్య పత్రికలు ప్రత్యేకంగా ఉండేవి. ప్రస్తుతం రెగ్యులర్ గా వచ్చే హాస్య పత్రికలు ఒకటో, రెండో ఉండవచ్చు. అయితే పారితోషికాల విషయానికి వస్తే కార్టూనిస్టుల సాధక బాధలు తెలిసిన కార్టూనిస్టులు నిర్వహిస్తున్న పత్రికలు, అంతర్జాల పత్రికలవాళ్లు కూడా పారితోషికాలు ఇవ్వకపోవడం శోచనీయమే. కార్టూన్లు ప్రచురించడమే గొప్ప అనే భావం యాజమాన్యంలో, ప్రచురితమవడానికి వేదిక దొరికితే చాలనే అభిప్రాయం కొంతమంది కార్టూనిస్టులలో కనబడుతోంది.
పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్టూన్ పోటీలు కార్టూనిస్టులందరికీ ఉపయుక్తంగా ఉన్నప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే పోటీల్లో ఇచ్చే బహుమతుల నగదు తక్కువగా ఉంటుందనే అసంతప్తితోపాటు, తమ ప్రాంతీయులకే బహుమతులు ఎక్కువగా ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొన్ని పోటీల్లో సీనియర్ కార్టూనిస్టులను న్యాయనిర్ణేతలుగా నియమించుకోకపోవడం, కార్టూనిస్టులు కానివారిని కూడా నియమించుకోవడం, కార్టూన్ రంగంపై పరిపూర్ణమైన అవగాహన లేనివారిని కూడా న్యాయనిర్ణేతల స్థానంలో కూర్చోబెట్టడం, కొన్ని పోటీల నిర్వాహకులు అవలంభిస్తుండడంతో కార్టూనిస్టుల్లో నిరుత్సాహం కలగడానికి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
వివిధ దిన పత్రికలలో వస్తున్న రాజకీయ కార్టూన్లకు ఇప్పటికీ ఆదరణ బాగానే ఉంది. ఆ కార్టూన్లు వేసే కార్టూనిస్టుల జీతాలు, జీవితాలు బాగానే ఉంటున్నాయనే చెప్పుకోవచ్చు. ఎంతయినా ఒకప్పటి రాజకీయ కార్టూన్లకు, ప్రస్తుత రాజకీయ కార్టూన్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకప్పుడు దిన పత్రికల్లో మూడు కాలమ్స్ లో వచ్చే కార్టూన్స్ ప్రస్తుతం సింగిల్ కాలానికి కుచించుకుపోయాయి. అంతేకాదు. ఒకప్పుడు దిన పత్రికలో వచ్చే కార్టూన్లు చూస్తే ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, ప్రతి పక్షాలు, రాజకీయ నాయకులు భయపడేవారు. పాఠకులు కూడా దిన పత్రిక చేతికి రాగానే మొట్టమొదట కార్టూన్‌నే చూసేవారంటే ఆ కార్టూన్లకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పటి రాజకీయ కార్టూనిస్టులకు కాసింత స్వేచ్ఛ ఉండేది. అదిప్పుడు కనుమరుగయిందని చెప్పవచ్చు. అప్పటి కార్టూనిస్టులు ఎవరికి వత్తాసు పలికే విధంగా, అకారణంగా ఎవరిని అప్రతిష్టపాలు చేయడం కోసం కార్టూన్లు వేసేవారు కాదు. నిజాన్ని నిర్భయంగా కార్టూన్ ఎక్కుపెట్టి ప్రజల్లోకి సంధించేవారు. అప్పటి కొందరు రాజకీయ నాయకులు తమపైన కార్టూన్లు వేయడానికి అడ్డుపడేవారు కాదు. కానీ ఇప్పడు ఏ నాయకునికి వ్యతిరేకంగా కార్టూన్ వేస్తే ఆ కార్టూనిస్ట్ ఆ నాయకుడినుండి కక్షసాధింపుకు గురి అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ప్రస్తుత కాలంలో రాజకీయ కార్టూన్లకు అర్థాలు మారిపోయాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులకులకు స్వంతంగా పత్రికలు ఉండడం వలన వారి పంథాను అనుసరించి రాజకీయ కార్టూనిస్టులు కార్టూన్లు గీయవలసి ఉంటుంది. అది నచ్చినా నచ్చకపోయినా జీతం కోసం, జీవనం కోసం మనసు చంపుకొని కార్టూన్స్ గీయవలసి వస్తోంది. ఒక పార్టీకి చెందిన పత్రిక మరో పార్టీని తూన్పార పడుతూ కార్టూన్ లు వేయడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలు పెరిగిపోయాయి. కొంతమంది ఆ మీడియాలని ఉపయోగించుకొని తమ కార్టూన్లను పొందుపరుస్తున్నారు. ఆ విధంగా పాఠకులకు చేరువవుతున్నారు. అయితే ఏదైనా పత్రికలో ప్రచురితమైన కార్టూన్ చూసినప్పుడు కలిగే తప్తి సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడు కలగదనేది అందరికీ తెలిసిందే. ఏదైన పత్రికకు కార్టూన్స్ పంపించాలనుకున్నప్పుడు ఆ కార్టూన్స్ సంపాదక వర్గానికి నచ్చేవిధంగా వేయడానికి కార్టూనిస్ట్ కషి చేసేవాడు. ఆ విధంగా తన ప్రతిభను మెరుగు పరుచుకునేవారు. అదే సోషల్ మీడియాలో అయితే కార్టూన్ ఎంపిక చేసే వాళ్లు ఉండరు కనుక ఎవరి ఇష్టానుసారం వాళ్లు కార్టూన్ వేసి పోస్టు చేసుకోవచ్చు. అప్పుడు కార్టూన్ మరింత బాగా వేయలన్న ఆసక్తి తగ్గిపోయే అవకాశం లేకపోలేదు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత పాత, కొత్త తెలుగు కార్టూనిస్టులు వాట్సప్ సమూహాలుగా ఏర్పడ్డారు. ఈ సమూహాల ద్వారా కార్టూన్ వేయడంలో సీనియర్ కార్టూనిస్టులు కొత్త కార్టూనిస్టులకు మెళకువలు నేర్పడం. కార్టూన్లు వేయడం మానుకున్న వారిని ప్రోత్సహించడం లాంటివి మంచి పరిణామాలు. కార్టూన్ పితామహుడు, అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో బహుమతులు పొందిన కార్టూనిస్ట్ జయదేవ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడంలో తనవంతు సహకారం అందిస్తున్నారు. ఎంతో మందిని కార్టూనిస్టులుగా తీర్చిదిద్ది గురుస్థానంలో ఉన్న జయదేవ్ గారు ఇప్పటికీ వర్ధమాన కార్టూనిస్టులను ప్రోత్సహిస్తూ కార్టూన్ కళను బతికించడానికి చేసే ప్రయత్నం అభినందనీయం. ఈ సమూహాల ద్వారా వివిధరకాల కార్టూన్ పోటీల వివరాలు అందించడం, ఆయా పోటీల్లో పాల్గొంటూ తెలుగు కార్టూనిస్టులు బహుమతులు గెలుచుకోవడం హర్షనీయం. అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో కూడా తెలుగు కార్టూనిస్టులు ఎక్కువమంది బహుమతులు గెలుచుకుంటూ తమ ప్రతిభను చాటుకుంటూ తెలుగు బావుటాను ఎగరవేస్తున్నారు.
ప్రతి సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం (మే 20) సందర్భంగా కార్టూన్ పోటీలు నిర్వహించడం, తెలుగు కార్టూనిస్టులందరు ఈ వేడుకలు వైభవంగా జరుపుకోవడం, తమ ఐక్యత చాటుకోవడం ముదావహం. ఈ సంవత్సరం మే 20న రవీంద్రభారతిలో ఈ వేడుకలు జరుపుకోనున్నారు. తెలుగు కార్టూనిస్టుల సమూహాల ద్వారా తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా కోరుకుందాం.
- నూతి శివానందం, 9247171906