Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు వున్నప్పుడు ఓ తీరు వుంటరు, లేనప్పుడు మరో తీరు వుంటరు. ఇక్కడ కొందరని కాదు అందరు అట్లనే. పైసలు ఉన్నప్పుడు గలగల ఉంటది, లేనప్పుడు సప్పుడు వుండది. అయితే సంపద ఐశ్వర్యం వున్నా లేకున్నా ఒక్క తీరే వ్యవహరించే వాల్లు కొందరు వుంటరు. వాల్లను స్థిత ప్రజ్ఞులు అంటరు కావచ్చు. ఉన్నప్పుడు ఉరుకులాడే వాల్లను 'ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ' అనే సామెత వాడుతరు. కొందరు 'పెట్టి పుడుతరు వాల్లకు ఐశ్వర్యమే ఐశ్వర్యం' మరికొందరు పేదరికంను అనుభవిస్తరు. బాగా మాటకారితనం ఉన్నోల్లను 'ఎంటికలున్న కొప్పు ఎటు ముడిసినా సింగారమే' అంటరు. కొప్పు ముడిచేందుకు వెంట్రుకలు బాగా పొడుగ్గా వున్నవాల్లకు కొప్పు వెనుకకు ముడిసినా పక్కలకు శానిగ ముడిచినా సింగారమే. అంటే ఎట్లైనా అందం కన్పిస్తదని అన్నట్టు. పైన ఉరుకులాట అంటే ఆక్టివ్‌నెస్ అన్నట్టు. లేనప్పుడు వెంకులాట అంటే వెతకడం అన్నట్టు, సెర్చ్ చేయడం అన్నట్టు.
కొన్ని సార్లు ఏం లేనట్ల సుత ఉన్నట్టు ఆక్షన్ ఉంటది. అదీ ఇదీ టాట్ టాట్ అని హంగామా కూడా చేస్తరు. అట్లాంటాల్లను 'ఏం లేనోనికి పోకడ ఎక్కువ శాతగానోనికి ఊపుడు ఎక్కువ' అనే సామెతను వాడుతరు. శాతగానోడు చాతకానట్టు వుండడు. ఎగురుతనే వుంటరు. ఇసొంటోల్లు ఏతులు బాగా కొడుతరు. ఏతులు అంటే ఉత్తమాటలు. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం. ఇటువంటి వాన్ని 'ఏతులోనికి మూడే ఆకులు' అంటరు. అంటే ఏతులు కొట్టే వాని చెట్టుకు రెండు మూడు ఆకులే వుంటయి అన్నట్టు. సామెతలు కొన్ని మంచిగ పాజిటివ్గ వుంటయి మరికొన్ని నెగెటివ్‌గా వుంటయి. ఏ కాలంలోనో ఆయా పరిస్థితుల పట్ల పుట్టినయి. వీటిల్లో శాస్త్రీయత వున్నదా అని ఆలోచించవద్దు. జస్ట్ సరదా కోసం వాడుకుంటరు. అట్లనే 'నిండ మునిగినోనికి చలి వుంటదా' అంటరు. దీన్ని ఎవరైనా అప్పు చేస్తే వాడుతరు. ఇంకిన్ని పైసలు మిత్తికి తేరా, నిండ మునిగినంక చలి వుంటదా అని ప్రేరేపిస్తరు. ఆయన కూడా ఎటూ తేల్చుకోలేక మరిన్ని అప్పులు తెస్తడు. నిజానికి చలి ఎప్పుడూ వుండేదే కానీ ఈ సామెతను అన్వయించుకుంటే ఇంతే సంగతులు. ఇవన్నీ జన జీవితం నుంచి వచ్చినవే. ఆయా కాల సందర్భాల్లోనివి. అన్ని కాలాలకు అన్వయించుకోరాదు, అన్వయించుకోవచ్చు, రెండూనూ...
- అన్నవరం దేవేందర్,
9440763479