Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగి ఒక లోహం అని తెలుసు కదా! దీనిని బంగారు ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. ఎరుపు నారింజ రంగుల మిశ్రమంలో వుండటం వల్ల చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. రాగిని వంటపాత్రలు, గ్లాసులు, గృహోపకరాల తయారీలో వాడతారు. ఈ లోహం సన్నని తీగలుగా సాగుతుంది. ఈ తీగలను ఉష్ణవిద్యుత్ వాహకాల తయారీలో ఎక్కువగా వుపయోగిస్తారు. క్రీ.పూ. 8000 సంవత్సరాలకు పూర్వమే మానవుడు రాగి నాణేలను, ఆభరణాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. రాతి యుగంలో కూడా రాతి పనిముట్లకు బదులుగా రాగిని ఉపయోగించి ఆయుధాలను పనిముట్లను తయారు చేసేవారు. కల్తీలేని రాగి మృదువుగా, మెత్తగా ఎలా కావాలంటే అలా సాగేగుణాన్ని కలిగి వుంటుంది. అందుకే దీన్ని బంగారంలో కలుపుతారు. రాగి రసాయన నామం (కాపర్) 'షబ'. మోటార్లు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ట్రాన్స్ఫారాలు వంటి వాటి తయారీలో ఈ లోహాన్ని వాడతారు. ఇది నీటితో రసాయన చర్య జరపదు కాబట్టి భవన నిర్మాణంలో వాటర్ ఫ్రూఫ్‌గా ఉపయోగిస్తారు. అలాంటి రాగి తీగెలతో ఈ రోజు బొమ్మలు నేర్చుకుందాం.
మేం హైస్కూల్ చదివేటప్పుడు మా ఇంటి దగ్గర మోటర్లు, వాచ్‌లు, కరెంట్ బాగు చేసే షాపులు వుండేవి. అక్కడ పనికిరాని రాగి తీగెముక్కలు సాయంత్రానికి కుప్పలా వేస్తారు. పిల్లలమంతా అక్కడికి వెళ్ళి ఆ తీగ ముక్కలు తెచ్చుకునేవాళ్ళం. వాటితో చిన్న చిన్న రింగులు, వాచ్‌లు చేసుకుని చేతికి పెట్టుకునేవాళ్ళం. మా బ్యాచ్‌లోని మిగతా పిల్లలు ఆ రాగి చుట్టల్ని బెల్లం మిఠాయి వాళ్ళకిచ్చేసి మిఠాయి తినేవాళ్ళు.
ఇప్పుడు ఈ తీగలతో తేలును సృష్టిద్దాం. ముందుగా తేలు ఆకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తల భాగంలో పొడవుగా వుండి పట్టుకోడానికి వీలయ్యే ముఖ భాగాల్లాంటివి వుంటాయి. శరీరం ఖండితాలుగా వుండి, తోక భాగంలో కొండి వుంటుంది. దీని శరీరాన్ని తయారు చేయడానికి రాగి తీగను గుండ్రంగా చుట్టాలి. తోకకు, ముందున్న ముఖ భాగాలకు రాగి తీగలతో జడలు అల్లాలి. వాటిని శరీరానికి కలుపుతూ అల్లాలి. అతుకుల కాళ్ళను కూడా రాగి తీగతోనే అల్లాలి. ముఖం భాగాన్ని కొద్దిగా లావుగా అల్లితే సరిపోతుంది. ఎర్రగా మెరిసే తేలు తయారవుతుంది. ఈ బొమ్మతో తేలు వచ్చే ప్రమాదాలను పిల్లలకు వివరించడానికి పనికొస్తుంది.
ఎర్రకోట, తాజ్‌మహల్ వంటి చోట్ల తెలుపు, నలుపు తీగలతో రిక్షాలు, సైకిళ్ళు వంటివి తయారు చేసి అమ్ముతుంటారు. రిక్షా, సైకిళ్ళను ఆ కళాకారులు ఎంతో అందంగా తయారు చేస్తారు. నేను కూడా ఢిల్లీ నుండి రిక్షాను, సైకిల్‌ను కొనుక్కుని తెచ్చుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో ఎ.సి. బిగించేటప్పుడు ఈ రాగివైర్లు, అల్యూమినియం తీగలు మిగిలాయి. బట్టలు ఆరేసుకోడానికి తెచ్చుకున్న ఇనుప తీగలు మిగిలిపోయినవి వున్నాయి. వీటన్నిటిని ఉపయోగించి సైకిళ్ళు, రిక్షాలు తయారు చేశాను. సైకిల్ బొమ్మను దగ్గర పెట్టుకుని తీగల్ని ఎలా చుట్టాలో చూసుకున్నాను. చక్రాల కోసం తీగను మెలికల డిజైన్ ఉపయోగించి చేశాను. మా ఇంటి ఎదురుగా స్వర్ణకారులుంటారు. వారి దగ్గర పట్టకారు, శ్రావణాన్ని తీసుకున్నాను. రాగి తీగలయితే చాలా సులభంగా వంగుతాయి. లావుగా వున్న అల్యూమినియం, ఇనుము తీగలయితే పట్టకారు ఉపయోగించాల్సి వుంటుంది. ఇక్కడ ఇచ్చిన ఫొటోలను గమనించి తీగల్ని ఎలా వంచాలో చూడండి. అదే ప్రకారంగా తీగల్ని వంచితే అందమైన సైకిళ్ళు, రిక్షాలు తయారవుతాయి.
అలాగే మెడలో చైను, బ్రేస్లెట్, చెవులకు పోగులు కూడా తయారు చేయొచ్చు. ముచ్చటైన రాగి తీగలతో మెడలో పెట్టుకునే నెక్లెస్, బ్రేస్‌లెట్‌ను అల్లుకుందాం. రాగి తీగలను గుండ్రంగా బిళ్ళల్లాగా చుట్టాలి. మెడలో పెట్టుకోవడానికి దగ్గరగా వుండేలా చిన్న నెక్లెస్ చేద్దాం. ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. జాకెట్ హుక్స్ లాంటి డిజైన్ ఇది. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఈ రాగి తీగను తీసుకుని రెండు వైపులా రెండు గుండ్రాలు మెలి తిప్పాలి. కిందికి మామూలు రింగు రావాలి. మరొక రాగి తీగను తీసుకుని పై నున్న రింగుకు దూర్చి మరల రెండు గుండ్రాలుగా మెలికలు తిప్పాలి. దీన్ని కూడా పైదాని వలె చేయాలి. ఒక రింగులో నుంచి మరొక రింగును దూరుస్తూ డిజైన్ తయారు చేసుకోవాలి. కావాల్సినంత పొడవుతో చైన్‌ను, బ్రేస్‌లెట్‌ను చేసుకుని చివర హుక్ పెట్టాలి. పోగుల కోసం కూడా అదే డిజైన్‌ను చేయాలి. చాలా బాగుంటాయి.
సైకిళ్ళు, మూడు కాళ్ళ రిక్షాలు చేసుకున్నాం కదా. ఇప్పుడు మోటార్ బైక్‌ను తయారు చేద్దాం. నేను తయారు చేసిన సైకిళ్ళు, రిక్షాలను చూసిన ఒక టీవీ రిపేరర్ నాకు కొన్ని తీగలు పంపించాడు. ఈ తీగలు వంకాయ, బ్లూ రంగుల్లో వున్నాయి. మామూలు తీగలకు రంగులు వేశారో లేదా ఈ తీగలు ఈ రంగులోనే వస్తాయో తెలియదు. రంగురంగుల తీగలు బాగున్నాయనిపించింది. మోటార్‌బైక్‌ను చేద్దామని స్టార్ట్ చేశాను. సైకిల్, రిక్షాల కంటే కొంచెం కష్టంగా అనిపించింది. మోటార్‌బైక్ చక్రాల కోసం కొద్దిగా వెడల్పాటి గాజుల్ని ఉపయోగించాను. లైటు, హాండిల్ కోసం తీగను కోన్ ఆకారంలో చుట్టాను. చక్రం మధ్యలో పెట్టడానికి తీగను గుండ్రంగా చుట్టాను. తీగ సరిపోకపోతే కొంచెం అల్యూమినియం తీగను కూడా వాడాను. చాలా అందంగా తయారయ్యాయి బైకులు.
పూల కుండీని తయారు చేయడానికి తెల్లని అల్యూమినియం తీగను వాడాను. దీన్ని కూడా రిక్షాలాగా మలిచి మధ్యలో కుండీలాగా పెట్టాను. మూడు కాళ్ళ రిక్షాలా తయారు చేసి మనుషులు కూర్చుంటారనే స్థలంలో చిన్న కుండీని పెట్టాలి. వీటిని మీనియేచర్ వర్క్ అని కూడా అనొచ్చు. చక్రాల కోసం గుండ్రంగా, మధ్యలో తీగను ముగ్గులో మెలికల్లా తిప్పాలి. అంటే చక్రం బ్యాలెన్స్ కోసం ఇలా చెయ్యాలి. ఇలా మూడు చక్రాలను చేసుకోవాలి. ఈ మూడింటిని కలుపుతూ తీగల్ని అల్లాలి. మద్యలో చిన్న గిన్నెలాంటి దాన్ని పెట్టాలి. దాంట్లో పూలు పెట్టడానికి సరిపోతుంది. అంటే రిక్షాలో పూలకుండీ తయారైపోయింది.
- కందేపి రాణీప్రసాద్, 9866160378