Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాటలన్నీ రక్తం పంచుకొని పుట్టవు/ కొన్ని రంగులు పులుముకొనీ... /ఇంకొన్ని నగ్నదేహాలతో నర్తిస్తూ/ మరికొన్ని రక్తరాగ రంజితమై పరిమళిస్తూ..' అని మాటల మాటున దాగిన ప్రయోజనాలను కవిత్వం చేశారు ప్రముఖ కవి, కథకులు ఎమ్వీ రామిరెడ్డి. మాటలతో గాయాలు చేయవచ్చు. గాయాలకు సాంత్వన చేకూర్చవచ్చు. ఆ మాటల మర్మాన్ని 'మాటలన్నీ' కవితలో ఎరుక చేశారు. 'బిందువు'తో ఆరంభమైన ఎమ్వీ రామిరెడ్డి రచనా వ్యాసంగం 'మనిషి జాడ'ను వెతుకుతూ 'అజరామరం'గా సాగుతూ నేడు 'అనిర్వచనం' అయింది.
'మట్టిలో వరిమళ్లు మాయమయ్యాయి/ సున్నం గళ్ళు కళ్ళు విప్పాయి/ గజాలు డాలర్ల ట్యాగులు తొడుక్కున్నాయి/ పొలాల వెంట వేలంపాటలు మొదలయ్యాయి/ గట్లు మీద నోట్లకట్ల పాములు బుసలు కొట్టాయి/ కుశలప్రశ్నలు సైతం డబ్బు కంపు కొట్టాయి'' అని నిత్వం పచ్చదనమై పరిఢవిల్లిన 'అమరావతి' ప్రాంతం రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా మారిపోయిన తీరును 'మట్టి రోదన' కవితలో ' మా ఊరి మట్టిప్పుడు/ మూగగా రోదిస్తోంది' అని ఆవేదన చెందారు. అధికార మార్పిడి అనంతరం ''అయిదేళ్ళ రంగాలంకరణకు తెరదించుతూ/ ఇంకొకాయన వచ్చాడు... గుప్పిళ్ళతో తీసుకొని మూడు దిక్కులకూ విసిరాడు'' తప్పితే జరిగినమేలేదో తెలీక 'రాజధానిని తలగుడ్డలా చుట్టుకొని/ మా ఊరి మట్టి వింతగా నవ్వింద'ని స్థానికుడిగా ఆ ప్రాంతంలో అభివద్ధి పేరుతో జరుగుతున్న మోసాన్ని వివరించారు.
మతాల మధ్య, దేశాల మధ్య సంఘర్షణలు ఎక్కువయ్యాయి. అణుశక్తి కలిగిన దేశాలు లేని దేశాలపై పెత్తనంకోసం ఆరాట పడుతున్నాయి. యుద్ధాల వల్ల ఇరుపక్షాల్లో నష్టపోయేది సామాన్యులే అని 'క్షేత్రజ్ఞత'లో స్పష్టం చేస్తారు. ''రక్తకణాలకు రక్షణ గోడలుండవు/ యుద్ధాల వెనక కుట్రలు అర్థం కావు/ ఆయుధాలకు ఆర్తనాదాలు వినిపించవు/ మానసిక మాంద్యం దెబ్బకు/ దేహాల సరిహద్దులు మూతబడతాయి'' అని స్పష్టం చేశారు. యుద్ధానంతర పరిణామాల్ని కూడా ఊహించాలని హితం పలికారు.
'పత్తిచేనులో నూతన వస్త్రంలా కనిపించాల్సింది' పోయి 'ఉరితాడులా' మారి చెట్టుకు ఊగిన జీవితాల్ని 'నాగళ్లఘోష'గా అక్షరబద్దం చేసి కన్నీరు పెట్టిస్తారు. 'ప్రేమ', 'బంధం', 'నమ్మకం','స్వచ్ఛత'లను తన అక్షరాలతో మేళవించి అనిర్వచనీయమైన కవిత్వాన్ని మన ముందుంచారు ఎమ్వీ రామిరెడ్డి. ఈ కవితా సంపుటిలో రైతు సంఘర్షణలు, నిర్జీవ యాంత్రికజీవనం, నేటి విద్యావిధానం, ప్రకతితో అనుభూతి చెందిన సందర్భాలు, వృత్తి జీవితంలో గమనించిన నవీన జీవన ధోరణలు ఇలా మన జీవితాలకు దగ్గరగా ఉండే అనేక కవితలు ఈ కవితా సంపుటిలో ఉన్నాయి.
- అనంతోజు మోహన్‌కృష్ణ,
8897765417