Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన పట్టుమని పదేండ్లు పలకా బలపం పట్టుకుని బడికి వెళ్ళలేదు. ప్రాథమిక పాఠశాల గడపదాటి పై తరగతుల ముఖం చూడలేదు. కానీ తెలుగు పద్యాన్ని ప్రౌఢంగా రాస్తున్న కవి, రచయిత, అష్టావధాని, బాల సాహితీవేత్త. ఆయన పేరు బండికాడి అంజయ్య గౌడు. ఆత్మీయులు పిలుచుకునే పేరు 'అంజగౌడు'. అంజయ్యగౌడు నేటి సిద్ధిపేట జిల్లా తోగుట మండలంలోని వెంకటరావు పేటలో 1965లో పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి భాగ్యమ్మ- శ్రీ నర్సాగౌడు. ఏడవ తరగతి వరకు చదువుకుని బాల్యంలోనే కులవృత్తిలో కుదురుకుని కల్లుగీత వృత్తిలో స్థిరపడ్డారు.
సాహిత్యంపై అసక్తి అంజగౌడును పద్యం వైపుకు నడిపించింది. గీతగీసిన చేతులతో 'గీత' పద్యాలు, కల్లు తీసిన చేతులతో కంద పద్యాలు రాశారు. సహజంగా పద్యరచన విద్య అబ్బగా ఆశుకవిగా, సహజకవిగా కవిత్వం చెప్పడం మొదలుపెట్టి, ఆ పద్యాన్నే వశపరుచుకుని అవధానిగా అనేక వేదికలపై అష్టావధానాలు చేసి నిలిచారు. పద్యాన్ని ఎంత ప్రేమగా, యిష్టంగా ప్రౌఢంగా రాస్తారో అంతే సరళంగా ఆసక్తిగా పిల్లల కోసం రాస్తారీయన. ఇక్కడ మరో విషయం చెప్పాలి. వృత్తిరీత్యా ఎక్కువగా మరాట్వాడాలో ఉన్న తెలుగు పద్యాన్ని మరువని కవి అంజగౌడు. 'హనుమత్ శతకం', 'రేణుకాదేవి శతకం', 'చంద్రమౌళీశ్వర శతకం', 'వేంకటేశ్వర శతకం', 'రాజరాజేవ్వర శతకం', 'కృష్ణానంద శతకం' వంటివి అంజగౌడు తన యిష్ట దైవాలను కొలుస్తూ అర్పించుకున్న పద్యాక్షర పుష్పాలు. వీటితో పాటు ఏక ప్రాసతో రాసిన మరో శతకం 'వనదుర్గ శతకం'. ఆధ్యాత్మికంగా ఎంత భావన చేస్తాడో అంతే భావన సామాజిక అంశాల పట్ల చూపి స్పందిస్తాడు అంజగౌడు. అందుకు ఆయన రాసిన 'నగసత్యాలు శతకం' ఉదాహరణ. పద్యంలోని శతకంతో పాటు దాదాపు అన్ని రూపాల రచనల్లో తన ప్రతిభను వ్యక్తపరిచిన ఈ అవధాని 'సాయిబాబా చరిత్రం' పేర పద్యకావ్యాన్ని రాశారు. కందంలో 'శ్రీ హనుమాన్ చాలీసా'ను అనువాదం చేశారు. ఒకేరోజు కందంలో 'శ్రీ వేంకటేశ్వర స్తుతి', 'శివస్తుతి' రాసి తిక్కన చెప్పిన హరిహారద్వైతానికి నిదర్శనంగా నిలిచారు కవిగా. ఇంకా ఉదాహరణలు కూడా రాశారు అంజగౌడు. వాటిలో 'ఆంజనేయ ఉదాహరణము', 'కృష్ణదేవరాయో దాహరణము', 'కర్శకోదాహరణం', 'రేణకోదాహరణం' వంటివి వాటిలో ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంగా ఎదిగిన అంజగౌడు పద్యంతో పాటు తనను బాల్యంలో అలరించిన యక్షగాన ప్రక్రియలో 'శ్రీ వేంకటేశ్వర కళ్యాణం' యక్షగానం రాయడం, తన సమకాలికుడు సత్యం విధివిధానాలు చెప్పి ప్రారంభించిన 'మణిపూసలు' రాయడం కూడా విశేషం. గొప్పదిగా భావించే 'తడకమడ్ల సాంప్రదాయ పురస్కారం', చిలుకలూరిపేటలో 'షేక్ అలీ పద్య పురస్కారం', ఒంగోలు 'తన్నీరు కోటయ్య జాతీయ పురస్కారం' మొదలుకుని అనేక పురస్కారాలు అందుకున్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్వహించిన పద్య కవితా పోటీల్లో యాభైవేలు, రైతుల ఆత్మగౌరవ గేయాల పోటీలో పదిహేను వేల బహుమతులను ఆయన గెలుచుకున్నారు.
అంజయ్య గౌడు బాలల కోసం కూడా నిరంతరం తపించే కవి, రచయిత. తనకు తెలిసిన పద్యంలో బాలల కోసం 'బాలల శతకం' రాశారు. అంతేకాదు బాలల కోసం 'బత్తీసలు' పేరుతో తీయని గేయాలను కానుకగా అందించారు. 'కలిసిమెలిసి తిరిగి కమ్మగ మాట్లాడ/ నెదరులేదు మనకు నెప్పుడైన', 'కాకి గూటిలోన కోకిల పుట్టును/ వర్ణమొకటెగాని ధ్వనులు వేరు' వంటివి వీరి బాలల శతకంలోని పద్య వాక్యాలు. తాను బాల్యంలోనే బడికి దూరమయ్యాడు కదా, తన పిల్లలు అలా కావద్దని చెబుతూ, 'తరగతి గదులందు తారతమ్యము లేక/ తగువులాడరాదు తరచుగాను/ తరగతి గదులన్న దైవ మందిరములు/ వినుడి బాలలార వీనులలర' అంటారు. ఈ అవధాన పద్యాల బండి బాల గేయాలకు కూడా వెండి కొండే. 'భీముడమ్మా భీముడు/ బండెడు కుడుములు తింటాడు/ గండర గండడు భీముడు / కొండలు పిండిగ కొడతాడు' అంటాడు చక్కని ప్రాసతో. రైలు బండి గురించి రాస్తూ, 'కొండ చిలువ ఆకారం/ కొనియాడగ నెవరి తరం/ బొగ్గు డీజిల్ విద్యుత్తు/ బువ్వగ తిని పరుగెత్తు/ పరిగెడుతుంటే గమ్మత్తు/ చూడండిరా సాక్షాత్తు' అని రాస్తారు. ఇందులోని లయ, ప్రాస బాలలను హత్తుకునడమేకాక గేయం పదికాలాల పాటు వాళ్ళ నోళ్లలో నానుతుంది కూడా. దేశనాయకులను పిల్లలకు పరిచయం చేయడంలోనూ అంజగౌడు గొప్పగా రాస్తాడు. 'శాంతిదూత మన గాంధీజీ/ జాతిరత్నమే నెహ్రూజీ/ విప్లవ వీరుడు అల్లూరి/ వితంతు బంధువు కందుకూరి/ నిర్బయమూర్తి నేతాజీ/ నిక్కచ్చితుడు శాస్త్రీజీ' అని చెప్పడంలో పిల్లలకు చెప్పాల్సింది సూటిగా చెప్పడం చూడొచ్చు. ఇంకా తన గేయాల్లో రామున్ని, కృష్ణుడిని, భీష్ముడిని ఇలా అనేక పాత్రలు మొదలుకుని పాఠశాలను, చెట్టును, జంతువులను, గ్రహణ చంద్రుడు, ఉపగ్రహం వంటి అనేక విషయాలను పరిచయం చేస్తాడు. ముద్రితాలు ఎన్నునాయో అంజగౌడు అముద్రిత రచనలూ అన్నే ఉన్నాయి. పిల్లలకోసం తపిస్తూ రాస్తున్న అవధాన కవి పద్యాల బండి, అంజయ్య గౌడుకు అభినందనలు. జయహో! బాల సాహిత్యం...!
- డా|| పత్తిపాక మోహన్,
9966229548