Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల వయోజనులు (30 - 79 ఏళ్ల వయస్సు) అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్ లేదా బీపీ) రుగ్మతతో సతమతమవుతున్నారని, వీరిలో 67 శాతం (మూడింట రెండు వంతులు) మంది అల్ప, మధ్య ఆదాయ దేశాల ప్రజలు ఉన్నారని ఐరాస నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 46 శాతం ప్రజలకు అధిక బీపీ ఉన్న విషయం కూడా తెలియని అమాయక స్థితిలో ఉన్నారనే ఆశ్చర్యకర వార్త కొంత కలవరాన్ని కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మందికి అధిక బీపీ ఉన్నట్లు తమ తమ పరీక్షల్లో తేలిందని, వారు వైద్య సలహాలు తీసుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది.
ప్రతి ఐదుగురులో ఒక్కరికి బీపీ నియంత్రణలో ఉంటున్నదని, ఈ సమస్యతో అధిక జనులు అకాల మరణం పొందుతున్నారని తెలుస్తున్నది. ఐరాస సుస్థిరాభివద్ధి లక్ష్యాల ప్రకారం 2030 నాటికి బీపీ రుగ్మతను 33 శాతానికి తగ్గించాలని పథక రచన చేశారు. ఆరోగ్యకర వ్యక్తిలో రక్తపోటు 120/80 ఉండాలని, రక్తపోటు 140/90 లేదా అంతకన్నా అధికమైనపుడు బీపీ రుగ్మత ఉన్నట్లు నిర్థారించి వైద్య సలహాలు, ఔషధాలు తీసుకుంటారు. సిస్టోలిక్ ప్రెషర్ 120-139, డయాస్టోలిక్ ప్రషర్ 80-89 ఉన్నపుడు ప్రీ-హైపర్టెన్సివ్ స్థితిగా పేర్కొంటారు. అధిక బీపీ కలిగిన వ్యక్తులు సకాలంలో వైద్య సలహాలు, సూచనలు తీసుకోనపుడు ప్రాణాంతకం కూడా కావచ్చని గమనించాలి. అధిక బీపీ రుగ్మతతో బాధ పడుతున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించని కారణంగా తరుచుగా బీపీ చెకప్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
భారతంలో అధిక రక్తపోటు సమస్య: భారతంలో 63 శాతం మరణాలు నాన్-కమ్యూనికెబుల్ వ్యాధుల (అంటువ్యాధి కానివి) కారణంగా జరుగుతున్నట్లు, ఇందులో 27 శాతం హదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నట్లు ఐరాస తేల్చింది. 2025 నాటికి 25 శాతం బీపీ రుగ్మతను తగ్గించడానికి ఇండియా పలు చర్యలు చేపట్టడం జరిగింది. హైపర్‌టెన్షన్ బాధిత భారతీయుల్లో 12 శాతం మందికి మాత్రమే బీపీ అదుపులో ఉందని, బీపీని అలక్ష్యం చేస్తే హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి హదయానాళ సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుందని ప్రచారం చేయాలి. ఇలాంటి కారణాలతో 33 శాతం మరణాలు నమోదు అవుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
భారత బాలికల్లో పెరుగుతున్న బీపీ సమస్య: భారతంలో 15-19 ఏండ్ల వయస్సు కలిగిన బాలికల్లో 2015-16 నుంచి 2019-21 వరకు బీపీ రుగ్మత సమస్య పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అధిక బీపీ కలిగిన బాలికల సంఖ్య పెరుగుతున్నట్లు గమనించారు. ఛత్తీస్‌ఘడ్‌లో 2015-16 వివరాల ప్రకారం నార్మల్ బీపీ కలిగిన బాలికలు 81.9 శాతం ఉండగా, 2019-21లో 67.1 శాతానికి తగ్గడం (14.8 శాతం తగ్గుదల) జరిగింది. ఇదే కాలంలో మహారాష్ట్రలో నార్మల్ బీపీ కలిగిన బాలికల సంఖ్య 13.3 శాతం తగ్గడం గమనించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో 78 శాతం బాలికలు నార్మల్ బీపీని కలిగి ఉండగా, భారతంలో (2015-16లో) 80 శాతం, 2019-21లో 74 శాతం నార్మల్ బీపీ కలిగి ఉన్నట్లు తేలింది.
అధిక బీపీకి ముఖ్య కారణాలు: వయసు పైబడిన వద్ధులు, జన్యుపరమైన కారణాలు, స్థూలకాయం లేదా అధిక శరీర బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు/ షుగర్ వాడడం, అధిక ఆల్కహాల్ సేవనం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక కొవ్వు పదార్థాలను తీసుకోవడం, పొగ తాగడం లాంటి పలు కారణాల వల్ల బీపీ పెరుగుతూ ప్రమాదకర స్థాయికి చేరుతుంది. అధిక బీపీ నిర్థారణ అయిన వ్యక్తులకు పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో లేనప్పటికీ దానిని నియంత్రణలో ఉంచడం, పెరగకుండా జాగ్రత్త పడడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.
అధిక బీపీ రుగ్మత లక్షణాలు: అధిక రక్తపోటు వల్ల తల నొప్పి, దష్టిలో మార్పు (మసక దష్టి), ఛాతి నొప్పి, తల తిరగడం, శ్వాస ఇబ్బందులు, వికారం, వాంతులు, ఆందోళన, చెవుల్లో శబ్దాలు, గందరగోళం, ముక్కుల్లోంచి రక్తస్రావం కావడం, అసాధారణ గుండె లయ లాంటి పలు లక్షణాలు కనిపిస్తాయి. అధిక బీపీకి చికిత్స తీసుకోని ఎడల మూత్రపిండ వ్యాధులు, గుండె/ హృదయనాళ జబ్బులు, స్ట్రోక్స్ లాంటి ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది.
బీపీ నియంత్రణకు మార్గాలు: రక్తపోటు అదుపులో ఉండడానికి ప్రతి ఒక్కరు తమ జీవన శైలిలో సమూల మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లవణం/ కొవ్వులు కలిగిన పోషకాహారం తీసుకోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, శారీరక శ్రమ/ వ్యాయామం చేయడం, పొగాకు/ ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించడం లేదా మానుకోవడం, కూరగాయలను అధికంగా తీసుకోవడం, నిశ్చలంగా కూర్చోవడాన్ని మానుకోవడం, వాకింగ్/ రన్నింగ్/ స్విమ్మింగ్/ డాన్సింగ్/ వెయిట్ లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలను రోజువారీగా అలవాటు చేసుకోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం లేదా అధిక బరువును తగ్గించుకోవడం, వైద్యులు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, తరుచుగా బీపీ చెకప్ చేయించుకోవడం, ఒత్తిడి/ ఆందోళనలకు దూరంగా ఉండడం లాంటి పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక బీపీ సమస్య దూరం అవుతుంది.
- డా||బుర్ర మధుసూదన్ రెడ్డి,
9949700037