Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాత్రలు రెండు రకాలు. తీర్థయాత్రలు, పాదయాత్రలు. తీర్థయాత్రలు ముక్తి కోసం, పాదయాత్రలు భుక్తి కోసం. భుక్తికోసం అంటే తిండికోసం కాదు కానీ బతుక్కోసం. బతుక్కోసం అంటే బతకలేనివాళ్ళకు కాదు. పదవి లేకపోతే బతకలేని వాళ్ళ కోసం. ఇలా బతుక్కోసం ఎలెక్షన్ల ముందు బూట్లు తొడుక్కున్న కాళ్ళతో కాలికి మట్టి అంటకుండా కొందరు చేసే యాత్రలే పాదయాత్రలు.
సాధారణంగా ఎలెక్షన్ల ముందు సీజన్ పాదయాత్రల సీజన్ అవుతుంది. పాదయాత్ర ఇప్పుడొక ఫ్యాషనైపోయింది. జిరాక్సు కాపీ అయిపోయింది. ఏ పుట్టలో ఏ పామున్నదో అని కొందరు బూట్లు తొడుక్కున్న కాళ్ళేసుకుని చెట్లవెంటా, గట్లవెంటా, పొలాలవెంటా పుట్టలు వెదకడం మొదలు పెట్టారు. తాము అధికారంలో వున్నప్పుడు ప్రజల ఊసే మరచిపోయిన వాళ్ళు, అది పోగానే ప్రజలు గుర్తుకువచ్చి అర్రెర్రె అని నాలుక కరుచుకుని, ప్రజల కోసం బాగా కుమిలి, ఆపైన చితికి పాదయాత్రలకు లంకించుకున్నారు.
ఆయన ఒక లీడర్. ప్రజల్ని తన వైపు తిప్పుకోడానికి తన దగ్గర వున్న ఎత్తులన్నీ అయిపోయి, జిత్తులు ఒక్కటీ మిగలక ఏం చేయాలా అని తెగ ఆలోచించి అరికాళ్ళకు పని అప్పగించాడు. ప్రజల్ని పదవిని తిరిగి చేజిక్కించుకోడానికి కనపడని 'వల' ఒకటి చేత పట్టుకుని పాదయాత్రకు బయలుదేరాడు. ఊళ్ళ వెంట పడ్డ ఆయనకు గుడిసెలు, దేవుని గుళ్ళూ కనపడ్డయి. జనం దేవుళ్ళలా అగుపడ్డారు. అందరినీ కావలించుకున్నాడు. చేతులెత్తి మొక్కాడు. ఏడ్చే వాళ్ళ కళ్ళని స్వంత కర్చీపుతో తుడిచాడు. పాదయాత్ర అనబడే 'బూటు' యాత్రను కంటిన్యూ చేశాడు.
మొదట్లో ఆయన వెంట ఉత్సాహంగా నడిచి చేతులు ఊపి, ఈలలు వేసిన జనం రాను రాను పలచబడ్డారు. ఇలాగయితే చివరకు తాను ఒక్కడే నడవాలని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్న లీడర్ గారి కాళ్ళకు తగిలింది ఓ వస్తువు. తన పాదయాత్రను అడ్డుకోబోయిన ఆ వస్తువు ఏమిటా అని వంగి చూశాడు. అదొక చిన్న గాజు సీసా. లోపల అంతా ఖాళీయే. ఇదివరకటి అలవాటు మానలేని ఆయన జనం కంటపడకుండా చేతివాటం చూపించాడు. సీసాను గబుక్కున పాంటు జేబులో దూర్చాడు.
ఆ రాత్రి అరికాళ్ళకు మసాజు, మోకాళ్ళకు తైలమర్థనం, పిక్కలకు ఆముదం పూయించుకుని డాక్టర్ చేత పెయిన్‌కిల్లర్ పొడిపించుకుని పడుకున్న ఆయనకు, మర్నాడు తన వెంట జనం వస్తారో లేదోనన్న బెంగతో మరి నిద్రపట్టలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది తను జేబులో వేసుకున్న సీసా. తెల్లవారుజామున దాన్ని తెచ్చి మంచం మీద పెట్టి పరీక్షగా చూశాడు. ఊరకే చూస్తూ కూర్చోవడం దేనికని దాని మూత తిప్పే ప్రయత్నం చేశాడు. మూత బిగుసుకుపోయిన దాన్ని, రెండు పాదాల మధ్య ఇరికించి దాని మెడను ఎడమచేత్తో పట్టి కుడి చేత్తో మూతని ఒత్తి ఒంట్లోని శక్తినంతా ఉపయోగించి 'హుమ్' అన్నాడు.
సీసామూత ఊడివచ్చింది. సీసాలోంచి తెల్లటి పొగ రింగురింగులుగా బయటకి రాసాగింది. భయపడి మంచం దిగాడు లీడర్. పొగ అంతకంతకు పెరిగింది కానీ తరగలేదు. ఆ పొగ పీల్చడంతో దగ్గు లంకించుకుంది లీడర్ని. కళ్ళు గిర్రుమన్నయి. మసకమసక పొగలో గది పై కప్పును తాకుతూ నిలబడి వున్న ఆకారం అగుపడింది. లీడర్ గుండె ఢమాల్మనేదే కాని భూమ్మీద బకెట్ బిర్యానీ రైసు మిగిలుండడంతో గుభేల్ అని మాత్రమే అన్నది. 'హైహై నాయకా' అన్నది ఆకారం. అది తనను నాయకా అనడంతో ధైర్యం వచ్చి 'ఎవర్నువ్వు?' అనడిగాడు.
'నేనెవరినైతేనేం లక్షల సంవత్సరాల నుంచి వున్న సీసా అనే చెర్లపల్లి జైలు నుంచి ఫ్రీడమ్ వచ్చేట్టు చేశావు. నువ్వేది అడిగినా ఇస్తాను. నాకు ఎక్కువ టైం లేదు. తెల్లారితే కనిపించను' అన్నది ఆ ఆకారం చేతికి వున్న స్మార్ట్ వాచిలో టైం చూసుకుంటూ.
లీడర్ గారు ఆలోచన మొదలు పెట్టారు. తన పాదయాత్ర దేనికి? ఫైనల్‌గా కోరుకునేది ఏమిటి? ఈ పాదయాత్ర కొనసాగించి ఒళ్ళు పులిసిపోయేట్లు చేసుకోడం కన్నా అదే అడిగేస్తే సరి అనుకున్నాడు. 'సరే! అడగమన్నావు కనుక అడిగేస్తున్నాను. పాదయాత్ర కంటిన్యూ చేసే ఓపిక మరి లేదు. రాబోయే ఎలెక్షన్లలో అన్నీ పార్టీల ఓట్లు నాకే పడాలి. నేను కోరుకున్న పదవి నాకు దక్కాలి. మరో నాలుగు టర్ములు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కాలి' అన్నాడు లీడర్.
ఆ ఆకారం బోడిగుండు మీద గోక్కుంది. మూతి కిందికి జారిన మీసం పీక్కుంది. బాతు గుడ్లంత కళ్ళు మూసుకుని తెరిచింది. 'మాఫ్ కర్నా బై! ఇప్పుడు ప్రజలు నువ్వు తెచ్చిన వలలో పడేట్టు లేరు. ఇది వరకు నువ్వు వెలగబెట్టిన అధికారం తీరు వారికి నచ్చినట్టు లేదు. ఎంత పెద్ద భూతాన్నయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పవిత్రమైన ఎన్నికల తంతులో నా బోడితల దూర్చలేను. ఇంతమంది ప్రజల మనసు మార్చి నీకు ఓట్లు వేయించలేను. సారీ! మళ్ళీ పొగగా మారి సీసాలో దూరుతా మూత పెట్టెయ్యి' అన్నది భూతం.
అసలుకే ఎసరు వచ్చేట్టుంది. గోల్డెన్ ఛాన్సు మిస్సయ్యేట్టుంది. కష్టపడి సీసా మూత తీసినందుకు ఏదో ఒకటి అడుక్కోవాలి అనుకున్న లీడర్, పాదయాత్రకి తండోపతండాలుగా జనం రావాలి. వాళ్ళు వస్తే తన మాటల బుట్టలో పడిపోతారు అనుకుని అదే కోరిక కోరుకున్నాడు.
'ఓస్ అంతేనా! నీ వెంట జనం రావాలి. నీ ఊకదంపుడుకు చప్పట్లు కొట్టాలి. నువ్వు ఎక్కడ మైకు పట్టుకుంటే అక్కడ జనమే జనం, జనమే జనం' అంటూ భూతం తన చుట్టూ తను గిర్రున తిరిగింది.
హాంఫట్ అన్న భూతం అనేక మందు బాటిళ్ళు, బిర్యానీ పొట్లాలు ఊరూరా, వాడవాడా సరఫరా చేసింది. లీడర్ గారి వెంట నడవడానికి ఉపన్యాసం వినడానికి జనం లారీలు లారీలుగా గుంపులు గుంపులుగా, హుషారు హుషారుగా రాసాగారు.
జనాలను సభలకు, పాదయాత్రలకు రప్పించటానికి భూతాలు వరమిస్తాయేమో కాని ఓట్లు మాత్రం వేయించలేవు!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212