Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ కళాశాలలో గ్రంథ పాలకునిగా 36 ఏళ్లపాటు సంపాదించిన జీతం డబ్బులు, పెన్షన్ డబ్బులు, విరాళంగా వారికి వచ్చిన 30 కోట్ల రూపాయలు పేదలకు, అనాథలకు దానం చేసిన 83 ఏళ్ల నిస్వార్ద జీవి పాలెం కళ్యాణ సుందరం. ఎవరైనా తనకు ఉన్నదాంట్లో కొంత దానం చేయటం సబబు. అలా కాకుండా ఉన్నదంతా దానం చేసేవాళ్లు ఎంతమంది వుంటారు? చాలా తక్కువ (అంతేకానీ ఉన్నదంతా దానం చేయడం అనేది లోకంలో బహుఅరుదు). అలాంటి ఉత్తములలో ముందు వరుసలో ఉంటారు మన కల్యాణ సుందరం! అతని గొప్పతనం గురించి వింటే నిజంగా ఈరోజులలో ఇలాంటి నిస్వార్థ సామాజిక సేవకులా అని ఆశ్చర్యం కలుగక మానదు! అతనలా నడిచొస్తుంటే మూర్తీభవించిన మానవత్వం, దానగునుడు ఖద్దరు చొక్కా వేసుకుని సమాజ సేవ చేసే కరుణామయుడు మనకు దర్శనమిచ్చినట్లు ఉంటాడు కల్యాణ సుందరం. నేనొక్కడినే కాదు నాతో పాటు నలుగురు బ్రతకాలి, నలుగురికి సేవలందించాలి, సమాజానికి సేవ చేయాలి అనే గొప్ప మానవతా గుణం ఉన్న వ్యక్తి కల్యాణ సుందరం!
బాల్యం: తమిళనాడు రాష్ట్రంలో మేళకరివేలకులం అనే గ్రామంలో, తిరున్వెలి జిల్లా నిరుపేద కుటుంబంలో ఆగష్టు మాసం 1940 సం||లో జన్మించాడు. ఊహ తెలియకముందే తండ్రి కన్నుమూశాడు. అమ్మ తాయమ్మల్ లాలన తప్ప, తండ్రి ప్రేమ తెలియదు. ఉన్నదాంట్లో సాయం చేయాలనే సద్గుణం తల్లి ద్వారా సుందరానికి అబ్బింది. కష్టపడి ప్రాథమిక విద్య సెయింట్ క్సేవియర్ పాఠశాలలో, తరువాత మద్రాసు విశ్వ విద్యాలయంలో చరిత్ర మరియు లిటరేచర్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్‌లో గోల్డ్ మెడలిస్టు. లైబ్రేరియన్‌గా జీవితం మొదలుపెట్టాడు.
ఉద్యోగం: శ్రీ వైకుంఠంలో కుమార్కురుపార ఆర్ట్స్ కాలేజ్‌లో గ్రంథ పాలకునిగా 35 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే విరాళాల పరంపర కొనసాగింది. లైబ్రేరియన్‌గా విధులు అయిపోగానే, సాయంత్రం పూట ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేశాడు. జీతంలో ప్రతీ పైసాను సమాజంలో వెనుకబడిన వారి క్షేమం కోసమే ఖర్చు చేశాడు. ప్రతినెల గ్రంథపాలకునిగా వచ్చిన జీతాన్ని అనాధాశ్రమానికి ఇ చ్చి ఆ నెల రోజులపాటు అదే ఆశ్రమంలో ఉండేవాడు. మరుసటి నెల మరో ఆశ్రమానికి. అలా తన జీవితాన్ని అనాధ పిల్లల కోసం, వీధి పిల్లలకు, మురికివాడలో నివసించే అనాధల కోసం, అనగారిన వర్గాల కోసం సమాజసేవ కోసం ఉపయోగించేవారు.
23 ఏళ్ల వయసులోనే నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకు నేషనల్ సెక్యూరిటీ ఫండ్‌కు 8.5 సవరలు డొనేట్ చేశారు. ఈ విషయాన్ని మేడే రోజు తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజర్ కళ్యాణ సుందరం చేసిన దానం గురించి చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ కళ్యాణ సుందరాన్ని 'లైట్ ఆఫ్ ఇండియా'గా పేర్కొన్నారు.
చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు. పదవీ విరమణ అనంతరం వచ్చిన 10 లక్షలు రూపాయలతో 1998వ సంవత్సరంలో 'పాలెం' సామాజిక సంస్థను స్థాపించి, దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టేవారు.
ప్రభావం: తన తల్లి ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడకు, ఆదాయంలో కొంత భాగాన్ని శ్రేష్ఠమైన పనికోసం ఖర్చు చేయమని, రోజూ ఒక మంచి పనైనా చేయమని చెప్పేది. ఆమె మంచి మాటల ప్రభావమే సుందరాన్ని దయాగుణం వైపు మళ్లించాయి.
అదే విదంగా కళ్యాణ సుందరం గారు తమిజ్ వన్నన్ రాసిన 'self-improvement books, Don’t bother about how you speak. Strive to make others speak good about you. He had found his calling: child welfare' వంటి పుస్తకాల చదవడం ద్వారా కూడా ప్రభావితం అయ్యానంటారు.
వ్యక్తులు మూడు మార్గాల్లో డబ్బు పొందవచ్చు. మొదట, ఆదాయాల ద్వారా, రెండవది తల్లిదండ్రుల సంపాదన ద్వారా, మూడోది ఎవరైనా విరాళంగా ఇచ్చిన డబ్బు ద్వారా. కానీ మీ స్వంత సంపాదనలో కొంత దానం చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు.
వీరు చేసిన సేవలకు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వాటిలో 2012లో బాపాసి అవార్డు ఫర్ బెస్ట్ లైబేరియన్, 1990 సంవత్సరంలో భారత జాతీయ ప్రభుత్వం ఉత్తమ గ్రంథపాలకునిగా అవార్డు అందుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ 10 ఉత్తమ గ్రంథపాలకులలో కళ్యాణ సుందరం గారిని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వారు గుర్తించారు. 2000 సంవత్సరం జూలై 6 న ఏపీజే అబ్దుల్ కలాం సుందరాన్ని సన్మానించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కళ్యాణ సుందరం సేవలు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఉపయోగపడతాయని, వాటికి 'కళ్యాణ సుందరం ప్లాన్' అని నామకరణం చేశారు. ఆయన భారత దేశానికి వచ్చినప్పుడు సుందరాన్ని ప్రత్యేకంగా కలిశారు.
కల్యాణ సుందరాన్ని 'అత్యుత్తమ లైబ్రేరియన్'గా మన కేంద్ర ప్రభుత్వం, యునైటెడ్ నేషన్ వారు 'వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ పీపుల్ ఆఫ్ ది సెంచరీ'గా గుర్తించారు. తమిళనాడు ప్రభుత్వం 'ఉత్తమ సామాజిక సేవకుడి'గా, పంజాబ్ ప్రభుత్వం 'ఉత్తమ గ్రంథపాలక పరిశోధకులు'గా, మనోమనియన్ 'సుందరినార్ విశ్వవిద్యాలయం బెస్ట్ ఎడ్యుకేటర్'గా, భారత జాతీయ ప్రభుత్వం 2023 సంవత్సరాలకు గాను 'పద్మశ్రీ' అవార్డుతో సత్కరించింది. అమెరికా ప్రభుత్వం 'మ్యాన్ ఆఫ్ ద మిలీనియం' అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు కింద వచ్చిన 30 కోట్ల రూపాయలను దాదాపు 50 అనాధ ఆశ్రమాలకు దానం చేశారు. 2011 లో రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా 'లైఫ్ టైమ్ ఆఫ్ సర్వీస్ అవార్డు'ను, ఇండియా కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్ధ 'ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తి'గా గుర్తించింది.
తమిళ సినీ స్టార్ రజినీకాంత్ కళ్యాణ సుందరం చేస్తున్న సేవలకు ముగ్ధుడై 'గాడ్ ఫాదర్'గా దత్తత తీసుకుంటాను అని చెప్తే చిరునవ్వుతో .. నేను గ్రామంలోనే ఉంటాను. సమాజమే నా కుటుంబం అని చెప్పి అనాధల కోసం సాయం చేయమని కోరాడు. ఇంకో విషయం ఏంటంటే కల్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. పెళ్లయితే ప్రాధాన్యతలు మారిపోయి, సమాజ సేవకు దూరమవుతానని, అనాధ, పేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులకు సేవలందించలేనని. అందుకే జీవితంలో పెళ్లి ప్రస్తావనని లేదన్నారు. 'పెళ్లి చేసుకోవా?' అని సన్నిహితులు ఎవరైనా అడిగితే.. పేరులో కల్యాణం ఉంది కదా ఇంకెందుకు అని జోక్ చేస్తారు,
ఇంతటి పేరు ప్రఖ్యాతులున్నా, అవార్డులు, రివార్డులు వచ్చినా కల్యాణ సుందరం చాలా సాదాసీదాగా, నిరాడంబర జీవితం గడుపుతారు. జీవితంలో ఆయనపై ప్రభావం చూపించనిది డబ్బు ఒక్కటే. ఆ డబ్బు అవసరమున్న బీద, బిక్కి, పేద అణగారిన వర్గాల వారికి పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నారు.
అధిక ధనం ఆస్తులు కాదు.. తమకి ఉన్న దానిలో దానం చేయాలనే గుణం. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం. ఏదీ తన ఆస్తి అనుకోలేదు కాబట్టే చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే సంపాదించిన ప్రతి రూపాయినీ దానం చేయగలిగాడు. స్వార్ధం రాజ్యమేలే ఈ సమాజంలో నిస్వార్ధంగా బతుకుతూ, నాలుగు డబ్బులు సంపాదించడం కాదు.. చస్తే మోయడానికి నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి అని చాటిచెప్పిన కల్యాణ సుందరం నిజంగా స్ఫూర్తి ప్రదాత. కలియుగ దానకర్ణుడు.. ఉత్తమ వ్యక్తి గా కీర్తింపబడుతున్నారు.
- డా||రవికుమార్ చేగొని, 9866928327