Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా ఓ విశ్వం. అందులో భూమి ఓ ఉపగ్రహం. అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుండేది. ఆ భూమ్మీద నేనో మనిషిని. అలాంటి వాళ్ళు కొన్ని వందల కోట్ల మంది వున్నారు. అందరికీ ఏదన్నా లెక్క లేకపోయినా కొంచెం తిక్క మాత్రం వుంది. అదే ఇప్పుడు ఈ భూమాత కొంప ముంచింది. జనరల్‌గా కొత్తొక వింత, పాతొక రోత అనే సామెతంటే చాలా ఇష్టం. ఇష్టమంటే మామూలు ఇష్టం కాదు, దాన్ని ఇమ్మీడియెట్‌గా ఆచరణలో పెట్టేయాలంతే! నాగరికత అంటే పిచ్చ మోజు. కొత్త కొత్త టెక్నాలజీతో వచ్చిన వస్తువులంటే పడి చచ్చిపోతారు. ఇక ఫ్యాషన్ల విషయానికొస్తే ఏ దేశంలో కొత్తగా, వింతగా కనిపించినా సరే చివరికి ఆఫ్రికా అయినా సరే (ఆఫ్రికా అంటే ఎందుకో తెలీదు కానీ కాస్త చిన్నచూపు) వెంటనే ఫాలో అయిపోతారు. దేశాల మధ్య అంతర్యుద్దాలు ఎన్నున్నా సరే, ఇలాంటి వాటికి దేశ సరిహద్దులు కనిపించవు! కొత్త కొత్త అణు బాంబులు కనిపెట్టి, అణ్వాయుధాలతో యుద్ధాలు చేసి జనాన్ని, వాతావరణాన్ని నాశనం చేసుకుంటారు కానీ, భూతాపాన్ని తగ్గించే ఏ ఒక్క పనీ గుర్తుండదు. అసలు భూతాపం తగ్గడానికి కొన్ని మార్గాలుంటాయని కూడా తెలీదేమో! సిరియా వంటి దేశాల్లో భూకంపాలు వచ్చి వందలు, వేల మంది భూస్థాపితమైనా మరో చోట వరదలు, సునామీలు వచ్చి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినా ఎవ్వరికీ చీమ కుట్టినట్లు కూడా వుండదు. బాధ అనిపించినా అది ఆ కొద్దిసేపే. సమస్త జీవరాశిని భరించేది భూమి. భరించడమా అనే సందేహం రావచ్చు. నిజమే కదా! నేడు మానవుడు ఎన్ని రకాలుగా భూ తాపాన్ని పెంచగలుగుతున్నాడో చూస్తూనే వున్నాం. నిద్ర లేచిన మరు క్షణమే చూసే సెల్ ఫోన్ దగ్గర నుండి కూరగాయలు తెచ్చే క్యారీ బ్యాగులైనా, పనికిరాని చెత్త పడేసే డస్ట్ బిన్ కవర్లయినా? ప్రతిదీ భూమికి, పర్యావరణానికి హాని కలిగించేవే. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంత హానికి కారణమైన భూమి పరిరక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే సమాధానం శూన్యం. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు, కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. దాన్ని సరిగ్గా నెరవేర్చి మన ముందు తరాల వారికి ఈ భూమిని సురక్షితంగా అందిద్దాం. ఈ నెల 22వ తేదీ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా.