Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండల్ని తొలిచేస్తూ అందమైన ఘాట్ రోడ్లు.. రంగుల హరివిల్లులాంటి ఐదారు అంతస్తుల అపార్ట్మెంట్లు, అందమైన విశాలమైన విల్లాలు.... రెండు వైపులా ఎత్తైన కొండల మధ్య ఒంపులు తిరిగే నది.. ఆ నది ఒడ్డున ఇటలీ స్టైల్లో అందమైన రోడ్లు, వంతెనలు, రెస్టారెంట్లు, షాపులు... రాత్రయితే విద్యుద్దీపాలతో భూలోక స్వర్గం అనిపించేలా వుంటుంది. ఇదంతా ఒక ప్రైవేట్ కంపెనీ స్వయంగా ఒక్కో ఇటుకను పేర్చి తయారు చేసిన సిటీ ఆంటే చాలా ఆశ్చర్యంగా వుంది కదా? కానీ ఇది నిజం.
ఎక్కడైనా సిటీని తయారు చేస్తారా? ఒకప్పటి టౌన్లే కాలక్రమేణా విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ సిటీలా మారుతుంది అనుకుంటున్నారు కదా! కానీ మహరాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఒక సిటీ రూపుదిద్దుకుంది. అదే లవాస. మహరాష్ట్రలో పూణె సిటీకి 65 కిలోమీటర్ల దూరంలో ముల్షీ వెస్ట్రన్ ఘాట్స్‌లో వుంది.
లవాసకు పూణె నుండి దగ్గర దగ్గర రెండు గంటల ప్రయాణం. ప్రయాణంలో మూడో వంతు ఘాట్ రోడ్లు కాబట్టి కాస్త చిన్నగా, జాగ్రత్తగానే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఉదయాన్నే ఆరు గంటలకు బయలుదేరాం. పొగమంచు, కొండల మీద నుండి తేలిపోతున్న మబ్బులు.... చాలా ఆహ్లాదంగా వుంది. మార్చి చివరిలోనే ఇలా వుందంటే, ఇక నవంబర్ - ఫిబ్రవరి నెలల మధ్యలోనైతే పరిసరాలన్నీ మంచుతో కప్పబడి, దారంతా మూసుకుపోతుందేమో! దారి మధ్యలో రెండు చిన్న చిన్న ఊర్లు కనిపించాయంతే! ఆ ఊళ్ళ చుట్టుపక్కల అన్నీ మామిడి తోటలే కనిపించాయి. కమ్మటి మామిడి వాసనతో నోరూరిపోయింది. మహరాష్ట్రలో మామిడి కాయల సీజన్ త్వరగా, అంటే మార్చి నెలలోనే వస్తుందట.
ఆ ఊళ్ళు దాటిన తర్వాత మధ్యలో ఒక నది కనిపించింది. దానిమీద పెద్ద డ్యామ్ కూడా కట్టారు. పేరు టామ్ఘర్ డామ్. పూణె చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి ముఖ్యంగా వ్యవసాయానికి ఆ డ్యామ్ నీళ్ళే ఆధారం. ఆ డ్యామ్ దాటిన దగ్గర్నుండి ఘాట్ రోడ్డు ప్రారంభమౌతుంది. ఆ కొండల్లో మెలికలు తిరుగుతూ వున్న రోడ్లు... చుట్టూ వాతావరణం ఎంతో చల్లగా, హాయిగా అనిపించింది. అంత పెద్ద పెద్ద కొండల్ని తవ్వి ఈ రోడ్డు వేయడానికి ఎంతమంది శ్రమ పడ్డారో, ఎంత ఖర్చయిందో అన్న ఆలోచన తప్పకుండా వస్తుంది. మరి అంత బాగుంది ఆ రోడ్డు.
సిటీ ఎంట్రన్స్‌లో 'వెల్కమ్ టు లవాస' అని పెద్ద కమాన్ స్వాగతం చెప్పింది. అక్కడే ఎంట్రన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడ వుండడానికా లేదా చూసి వెళ్ళిపోతారా అని అడుగుతారు. మనం దేనికోసం వచ్చామో చెప్తే దాని ప్రకారం ఛార్జ్ వసూలు చేస్తారు. మేం చూసి సాయంత్రానికి వెళ్ళడానికి వచ్చాం కాబట్టి అదే చెప్పాం. బైక్ కి 200/-, కారుకి 500/-. కారులో ఒక్కరున్నా సరే, ఐదుగురు వున్నా సరే... అదే ఫీజు. అంతసేపు కొండ ఎక్కి వస్తే, లవాస సిటీని చేరుకోవాలంటే ఎక్కిన కొండ దిగాలి.
ముందుగా ఓ పెద్ద హోటల్ కనిపించింది. అక్కడ రూమ్స్ రెంట్‌కి ఇస్తారట. ఫైవ్ స్టార్ హోటల్ లా వుంది. అక్కడి నుంచి చుట్టూ చూస్తే మూడు వైపులా కనిపించినంత మేర నది నీరే. ఆ నదికి రెండు వైపులా పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మీద నాలుగైదు వరుసల్లో బొమ్మరిల్లులాంటి రంగురంగుల అపార్ట్మెంట్లు కొంచెం దూరంగా కనిపించాయి. అంటే ఎంట్రన్స్ దగ్గర్లోనే ఆ హోటల్ వుంది.
సిటీలోకి వచ్చాక రెండు మూడు లైన్లలో అపార్ట్మెంట్లు, విల్లాలు వున్నాయి. ఆ వీధుల్లోని నీట్, రిచ్‌గా వున్న రోడ్లు, విల్లాలను చూస్తుంటే అచ్చంగా ఇటలీ వీధుల్లో నడుస్తున్నట్టే వుంది. ఇక్కడ ప్రతి వీధి గుండా కింద నీళ్ళ దగ్గరకు వెళ్ళడానికి మెట్లు కట్టారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఇంటికీ లేక్ వ్యూ వుంది. అందమైన లేక్ వ్యూ కోసం సిటీలో ఎంతమంది ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నాం కదా! ఇక్కడి ఇళ్ళకి ఒక వైపు లేక్ వ్యూ వుంటే, మరో వైపు ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి... ప్రకృతి ఆరాధకులకు ఇంత కంటే ఇంకేం కావాలి?
మేం వెళ్ళింది వీక్ డేస్ లో కావడం వల్ల ఎక్కువ మంది జనాలు లేరు. మేం కాకుండా, మరో పది మంది సరదాగా వచ్చారంతే. ఇక అక్కడ పనిచేసేవాళ్ళు తప్పితే ఎవ్వరూ కనిపించలేదు. వారాంతాల్లో అయితే టూరిస్టులు ఎక్కువగా వస్తారని అక్కడ పనిచేసే వాళ్ళు చెప్పారు. ఏమైనా తినడానికి షాపులు కూడా ఓపెన్ చేసి లేవు. వాటర్ బాటిల్స్, కూల్స్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే దొరికాయి. షాపులన్నీ కూడా వారాంతాల్లోనే ఓపెన్ చేసి వుంచుతారట టూరిస్టుల కోసం. మిగతా రోజుల్లో జనాలు ఎక్కువగా రారు కాబట్టి పెద్దగా ఏమీ దొరకవని చెప్పారు. ఇక్కడ ఫొటో షూట్లు, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లు, ప్రీవెడ్డింగ్ షూట్లు, సినిమా షూటింగ్ లు మొదట్లో బాగా జరిగేవట. ఇప్పుడైతే సినిమా షూట్లు ఏమీ చేయడం లేదని చెప్పారు. వీక్ డేస్‌లో షూటింగ్ కోసం వచ్చే వాళ్ళు ఎవరి ఆహారం వాళ్ళే తెచ్చుకుంటారనుకుంటా!
అలా రోడ్డంటా నడుస్తూ వెళ్తుంటే.. రకరకాల షాపులు, జిమ్‌లు, సెలూన్లు, బ్యూటీపార్లర్లు... అన్నీ వున్నాయి కానీ ఏవీ ఓపెన్ చేసి లేవు.
ఇక్కడ అపార్ట్మెంట్లు బాగానే వున్నాయి వాటిల్లో కొన్ని ఇళ్ళలో వుంటున్నారు కూడా. అయితే చాలా తక్కువ ఇళ్ళల్లోనే మనుషులు కనిపించారు. అది కూడా కరోన వల్ల వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వుంది కదా. అందుకే చిన్న పిల్లల్ని తీసుకుని ఇంత దూరం వచ్చి ప్రశాంత వారావరనంలో హాయిగా పని చేసుకుంటున్నాలా వుంది. మరో విషయం ఏంటంటే ఇక్కడి బోర్డుల మీద.. విల్లాలు, ఫ్లాట్లు దీర్ఘకాలానికైతేనే రెంట్‌కి ఇస్తారు. కొద్ది రోజులకైతే ఇవ్వడం కుదరదు అని రాసి వుంది. కొద్ది రోజులంటే ఎన్ని రోజులైంది మాకైతే అర్థం కాలేదు.
అయితే ఇక్కడ చాలా వరకు మధ్యలోనే ఆగిపోయిన కట్టడాలు కనిపించాయి. ఇంకొన్నైతే బూత్ బంగ్లాలా అనిపించాయి. మరికొన్ని పిల్లర్లు లేపి ఆపేసినవి వున్నాయి రెండు బ్రిడ్జ్లైతే నీళ్ళ అడుగు నుండి పిల్లర్ల వరకు కట్టారు పైన డోమ్ లాంటి వంతెన ఒక్కటే పూర్తి చెయ్యాలి. అవన్నీ పూర్తయితే ఎంత బాగుంటుందో కదా ఈ ప్రదేశం అనిపించింది. ఇక్కడ వాటర్ గేమ్స్ చాలా ఏర్పాటు చేశారు. బోటింగ్ కూడా వుంది. ఈ సిటీ మొత్తం తిరగడానికి రెంట్‌కి సైకిళ్ళు కూడా ఇస్తారట. రెండు కొండల మధ్య వంతెన మీద ప్రయాణం చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా బైక్ మీద వెళ్ళినప్పుడు మాత్రమే. ఇక చిన్న చిన్న ఆర్చ్ వంతెనల మీద ఫొటో షూట్‌కి వ్యూ చాలా బాగుంది. లేక్ వ్యూకి దగ్గర్లో కూర్చోడానికి ఎక్కడికక్కడ బెంచీలు, మెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పానీపూరి షాపులతో సహా అన్నీ వున్నారు, ఒక్క మనుషులు తప్ప. అందుకే ఇది ఘోస్ట్ సిటీ అయిందేమో!
ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఒకటి రెండు రోజులు వుండాలనుకుంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఒకటి రెండు రోజులకి రెంట్ కి కూడా ఇస్తారట.
మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి ఎండ బాగా అనిపించింది కానీ, చుట్టూ కొండల్లోనుండి నది మీదుగా వచ్చే గాలి వల్ల కాస్త చల్లగానే వుంది.
రాత్రయితే రంగురంగుల లైట్ల కాంతిలో రోడ్ల మీద నడుస్తుంటే ఇటలీలో వున్నామా? ఇండియాలో వున్నామా అనిపిస్తుంది. దీన్ని 'ఇటలీ ఇన్ ఇండియా' అని కూడా అంటారు. అనిపించే భూలోక స్వరంలా తయారు చేయాలనుకున్న ఈ లవాస సిటీకి కొంత కాలానికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఘోస్ట్ సిటీ అని పేరు వచ్చింది. బహుశా పాడైపోయి వున్న బూత్ బంగ్లాలాంటి అపార్ట్మెంట్లని చూసి అలా అంటున్నారేమో!?
ఈ లవాస సిటీ పుట్టు పూర్వోత్తరాలకొస్తే... ఇది ఒక ప్రైవేట్ ప్లాన్డ్ సిటీ. అజిత్ గులాబ్ చంద్ దీని నిర్మాణానికి పూనుకున్నాడు. అజిత్ ఇటలీలోని పోర్టోఫినో సిటీని చూసి అచ్చంగా దానిలా ఇండియాలో కట్టాలనుకున్నాడు. అతని ఆశకి ప్రతిరూపమే ఈ లవాస సిటీ. హిందూస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీతో కలిసి ఈ అజిత్ 100 కి.మీ. విస్తీర్ణంలో ఆ సిటీని 2004లో ప్రారంభించారు. 2030కి పూర్తి నిర్మాణం అవ్వాలని ఆలోచనతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ని అనుమతి తీసుకోలేదన్న కారణంతో 2010లో ఇండియన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ కొంతకాలం నిలిపేసి, తిరిగి 2011లో అనుమతినిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ కోసం 25 వేల ఎకరాల భూమిని సంవత్సరానికి కేవలం 70వేల రూపాయలకే లీజుకి తీసుకున్నారంటే నమ్మగలరా? అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర గాని, ఇండియన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ దగ్గర కానీ ఈ నిర్మాణానికి పర్మిషన్ తీసుకోలేదు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీనికి అనుమతినిచ్చింది. అంతా పెద్దల వ్యవహారం... పర్మిషన్ల లొసుగులు, పర్యావరణానికి హాని... వెరసి.... సగం సగం కట్టబడిన సిటీగా తయారైంది.
ప్రైవేట్ ప్లాన్డ్ సిటీ కావడంతో, ప్రచారం ప్రభావంతో చాలామంది తమ సంపాదనంతా ఇక్కడి విల్లాల కోసం, ఇళ్ళ కోసం పెట్టుబడి పెట్టారు. కొందరైతే లోన్లు తీసుకుని మరీ ఈ ప్రైవేట్ సిటీలో అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొన్నారు, రాబోయే కాలంలో ఎంతగానో డెవలప్ అవుతుందన్న ఆశతో. అయితే ఇప్పటికీ ఈ సిటీ మీద కోర్టులో కేసు నడుస్తోంది.
ఏదైతేనేం.... పెద్ద పెద్ద కొండల్ని తొలిచి ఒక సిటీని నిర్మించాలంటే మాటలు కాదు. దాదాపు లక్ష కోట్ల పైనే ఖర్చు పెట్టి కొంత వరకు విజయం సాధించిందనే చెప్పాలి. ఇటలీ స్టైల్లో అందమైన రోడ్లు, వంతెనలు, విద్యుద్దీపాలు, రెస్టారెంట్లు, షాపులు... భూలోక స్వరం అనిపించేలా తయారు చేయాలన్న ఆలోచనకి కొంత రూపం కూడా వచ్చింది. కాకపోతే.... రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టు... కొంతమంది కష్టజీవుల సొమ్మంతా కొండల పాలయింది.
మొదట ఈ సిటీ నిర్మాణం ప్రారంభిస్తున్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఫారెన్ అనుబంధ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఫిల్మ్ ఇండిస్టీలు నిర్మించాలని చాలా ప్లాన్లు వేశారు. అవన్నీ ఫెయిలయ్యి ప్రస్తుతం ఇక్కడకి షార్ట్ ఫిల్మ్‌లు, ఫొటో షూట్లు, వెబ్ సిరీస్, ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం మాత్రం బాగానే వస్తున్నారు.
ఆ.. అన్నట్లు మీరు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి సినిమాలు చూసే వుంటారు కదా! ఆ చిత్రాల్లో ''హొ... హొ... అమ్మాయి'', ''కాటుక కళ్ళను చూస్తుంటే...'' పాటల్లో అధిక భాగం ఇక్కడ షూట్ చేసినవే. ఆ చిత్రాల్లో ఎంతో అందంగా, కలర్ఫుల్గా కనిపించిన ఆ బిల్డింగులు, లొకేషన్లు అన్నీ ఇప్పుడు మెయింటెనెన్స్లేక రంగులు వెలిసిపోయి మసకబారిపోయాయి. ఇంకొన్నేళ్ళకైనా ఈ సిటీ పూర్తి చేసి టూరిజం స్పాట్‌గా డెవలప్ చేస్తే.... ప్రకృతి ఆరాధకులైన పర్యాటకులు బాగా వస్తారు. ఇక్కడ విల్లాలు, ఫ్లాట్లు కొన్ని వారికి కూడా కొంత ఊరట కలుగుతుంది.
- బి.మల్లేశ్వరి